Big Breaking: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం
ABN, Publish Date - Sep 23 , 2024 | 01:17 PM
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇవాళ (సోమవారం) కీలక పరిణామం చోటుచేసుకుంది. వేధింపుల వ్యవహారంలో ప్రమేయమున్న ఐపీఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు. కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో వీరి పేర్లను పోలీసులు చేర్చారు.
అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) కీలక పరిణామం చోటుచేసుకుంది. వేధింపుల వ్యవహారంలో ప్రమేయమున్న ఐపీఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు. కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో వీరి పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా తాతా, విశాల్ గన్నీని నిందితులు పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్‌కు అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ 4వ ఏసీఎంఎం జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్ నుంచి నిన్న (ఆదివారం) రాత్రి రైలులో విజయవాడకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేయించారు. అనంతరం తెల్లవారు జాము సమయంలో విజయవాడ 4వ ఏసీఎంఎం జడ్జీ ఇంటికి తీసుకెళ్లారు. జడ్జి ముందు హాజరు పరచగా ఆయన రిమాండ్ విధించారు. అక్టోబరు 4వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు చెప్పారు.
కాగా నటి జెత్వానీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ఆచూకీని గుర్తించారు. కేసు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న అతడు పరారయ్యాడు. అయితే తన స్నేహితుడి మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్టు సాంకేతికతను ఉపయోగించి పోలీసులు గుర్తించారు. దీంతో అతడు ఉన్న చోటుకే వెళ్లి పోలీసలుు అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా.. వైసీపీ హయాంలో కాదంబరి జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే విమానంలో వెళ్లి మరీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చారు. దీంతో తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ ఇటీవలే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇక ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని తేలింది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కుక్కల శ్రీనివాస్ అరెస్ట్ కావడంతో కేసు మరింత ముందుకు కదిలే అవకాశం ఉంది.
Updated Date - Sep 23 , 2024 | 01:31 PM