ఆర్టీసీలో పదోన్నతుల రగడ
ABN, Publish Date - Oct 31 , 2024 | 01:27 AM
ఆర్టీసీలో అధికారులు, ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారులు వ్యవహార శైలి అనేక విమర్శలకు దారితీస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు, పదోన్నతులు ఇస్తున్న వీరు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై పదోన్నతి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మాత్రం పదోన్నతి కల్పించడానికి అనేక సాకులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ద్వంద్వ వైఖరిపై ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో పదోన్నతుల రగడ చర్చనీయాంశంగా మారింది.
సంస్థలో వేల సంఖ్యలో ఖాళీగా పోస్టులు
అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు, పదోన్నతులు
ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వ అనుమతి, సాంకేతిక సాకుతో నిలుపుదల
అర్హత పరీక్షలు ఉత్తీర్ణులై ఏళ్లు గడిచినా ఇవ్వని పోస్టింగ్
ఉన్నతాధికారుల ద్వంద్వ వైఖరిపై ఉద్యోగుల ఆగ్రహం
ఆర్టీసీలో అధికారులు, ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారులు వ్యవహార శైలి అనేక విమర్శలకు దారితీస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు, పదోన్నతులు ఇస్తున్న వీరు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై పదోన్నతి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మాత్రం పదోన్నతి కల్పించడానికి అనేక సాకులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ద్వంద్వ వైఖరిపై ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో పదోన్నతుల రగడ చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో పదోన్నతుల రగడ నడుస్తోంది. అధికారులకో న్యాయం.. ఉద్యోగులకో న్యాయం అన్నట్టుగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థలో డిప్యూటీ మెకానిక్‌లు, అసిస్టెంట్ మేనేజర్లు, ఏడీ, పీడీ, ఓపీడీ, ఎంఈడీ, ఎస్పీడీ, మ్యాట్ తదితర విభాగాల్లో వందలాది మందికి చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వడం లేదు. ఈ విభాగాలలో పనిచేసే వారికి పదోన్నతులు ఇవ్వటానికి ఉన్నతాధికారులు అనేక సాంకేతిక కారణాలు చూపిస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఖాళీల భర్తీ పేరుతో సంస్థలో పనిచేసే చాలా మంది అధికారులను తాత్కాలిక ఇన్‌చార్జిలుగా నియమించడంతో పాటు పదోన్నతులను కల్పించారు. అధికారుల పదోన్నతుల విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాలేదని, ఉద్యోగుల విషయంలో ఎందుకు సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని ఉద్యోగులు ప్రశ్నిస్తు న్నారు. సంస్థలో పదోన్నతులను అందుకునేందుకు అవసరమైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారు చాలా మంది ఉన్నారు. సీనియారిటీ ప్రకారం పదోన్న తులకు అర్హులైన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా తమకు పదోన్నతులు వస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పదోన్నతులు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పుడు పదోన్నతులు రాకపోతే తీరని అన్యాయం జరుగుతుందని లబోదిబోమంటున్నారు. ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ అనుమతి, సాంకేతిక కారణాల సాకు..
ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వశాఖగా మారిన క్రమంలో ఆయా విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయని సాకు చెబుతూ ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి కావాలంటే ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించాలి. అలాంటి ప్రయత్నం ఉన్నతాధికారుల నుంచి జరగటం లేదు. దీంతో బాధిత ఉద్యోగులలో తీవ్ర నిరాశ, అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు తాత్కాలిక ఇన్‌చార్జిలుగా అయినా బాధ్యతలు అప్పగిస్తే.. ఆయా పోస్టులలో పని విధానాన్ని వీరు తెలుసుకోవటంతో పాటు, నైపుణ్యం, అనుభవం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ఏపీపీటీడీ గుర్తింపు సంఘం ఈయూ తరఫున రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదరరావు, నరసయ్యలు ఆర్టీసీ ఎండీకి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖపై ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే!
ఇది అన్యాయం
ఆర్టీసీలో ఉన్న ఖాళీల్లో అర్హులైన అధికారులకు పదోన్నతులు ఇచ్చిన విధంగానే కిందిస్థాయి ఉద్యోగులకు కూడా పదోన్నతులు ఇవ్వాలి. కేటగిరీల వారీగా మొత్తం మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేయకపోవడంతో పనిభారంతో అల్లాడిపోతున్నారు. కనీసం పదోన్నతులు అయినా ఇస్తే ఉత్సాహంతో పనిచేస్తారు. పదోన్నతుల విషయంలో అధికారులు, ఉద్యోగులను వేర్వేరుగా చూడటం తగదు. వెంటనే ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
- పలిశెట్టి దామోదరరావు, ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Updated Date - Oct 31 , 2024 | 01:27 AM