స్వచ్ఛత జీవితంలో భాగం కావాలి
ABN, Publish Date - Oct 21 , 2024 | 01:11 AM
‘‘అందరి జీవితంలో స్వచ్ఛత ఒక భాగం కావాలి.. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఇది నిత్య ప్రక్రియ.. నిరంతరం సాగాలి’’ అని సినీనటుడు సుధీర్‌బాబు అన్నారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ‘స్వచ్ఛతా హి సేవ’లో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘వాక్‌థాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విజయవాడ సిటీలైఫ్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ‘‘అందరి జీవితంలో స్వచ్ఛత ఒక భాగం కావాలి.. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఇది నిత్య ప్రక్రియ.. నిరంతరం సాగాలి’’ అని సినీనటుడు సుధీర్‌బాబు అన్నారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ‘స్వచ్ఛతా హి సేవ’లో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘వాక్‌థాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంజీ రోడ్డులో ఉన్న ఆదాయ పన్ను శాఖ కార్యాలయం నుంచి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ మొగల్రాజపురంలోని ఆదాయపు పన్నుశాఖ కార్యాలయం వరకు సాగింది. మంచి లక్ష్యం కోసం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం ఒకడుగు ముందుకు వేసి ఇంటితోపాటు, పరిసరాలను, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛతా హి సేవ’ గురించి మన చుట్టుపక్కల వారికి, కుటుంబసభ్యులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలని కోరారు. తాను పుట్టి పెరిగింది విజయవాడలోనే అని గుర్తుచేశారు. ఎంజీ రోడ్డులో ఉన్న డీఆర్‌ఆర్ స్టేడియంలో బ్యాట్మింటన్ నేర్చుకున్నానని చెప్పారు. ఎంజీ రోడ్డులో వాకింగ్, రన్నింగ్ చేసేవాడినని యువతరం నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. నగర వీధులు అప్పటికి, ఇప్పటికి చాలా క్లీన్‌గా కనిపిస్తున్నాయని కితాబిచ్చారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వీరేందర్ మెహెతా మాట్లాడుతూ, ‘స్వచ్ఛతా హి సేవా రన్’ ప్రచారంలో విద్యార్థులు పాల్గొనటం చాలా సంతోషదాయకమన్నారు. హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ సురేష్ బత్తిని మాట్లాడుతూ, ప్రధాని మోదీ చొరవను ముందుకు తీసుకెళ్లడం ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సునీత బిల్లా, పెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డీజీ రాజేంద్రచౌదరి, గుంటూరు ఆదాయపు పన్నుశాఖ అదనపు కమిషనర్ సుప్రియ, విజయవాడ ఆదాయపు పన్నుశాఖ జాయింట్ కమిషనర్ అభినయ, ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ దోనేపూడి విజయ్‌బాబు, ఆదాయపు పన్నుశాఖ అధికారులు శ్యామలాదేవి, ఈశ్వరరావు, రామ్ ప్రసాద్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 01:11 AM