పదిరోజులుగా ముంపులోనే వరి చేలు
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:22 AM
బుడమేరు వరద ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. గ్రామం చుట్టూ వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి. సుమారు 1,200 ఎకరాల్లో మరో వారం పది రోజుల్లో పొట్ట దశకు చేరుకుంటుందనుకుంటున్న పంట వరదపాలవడం రైతులకు మింగుడు పటడం లేదు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 11 : బుడమేరు వరద ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. గ్రామం చుట్టూ వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి. సుమారు 1,200 ఎకరాల్లో మరో వారం పది రోజుల్లో పొట్ట దశకు చేరుకుంటుందనుకుంటున్న పంట వరదపాలవడం రైతులకు మింగుడు పటడం లేదు. నీటిలో నానుతున్న పంట కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఏం రోగాలు వస్తాయోనని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికొస్తుందనుకున్న పంట వరద పాలవ్వడం ఊరు చుట్టు పట్టిన వరద నీరు ఇప్పటికీ బయటకు పోకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామస్థులున్నారు. మరోవైపు పశుగ్రాసం కోసం మూగ జీవాలు అల్లాడుతున్నాయి. ఏ రైతును కదిలించినా అయ్యా పంటలు మొత్తం పోయాయి. ప్రాణాలు మాత్రం దక్కించుకోగలిగామని వాపోతున్నారు.
రైతుల కష్టాలు వారి మాటల్లోనే...
నిండా ముంచేసింది
- జూలపల్లి గంగారావు
బుడమేరు వరద నిండా ముంచేసింది. ఎకరానికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మరో కట్ట మందు, ఇంకోసారి పురుగు మందు కొడితే పొట్టదశకు మాగాణి చేరుకునేది. వరద పట్టి మొత్తం పంట సర్వనాశనమైంది. ఇప్పట్లో పొలాల్లో నీరు బయటకు పోయే మార్గం లేదు. ఈ ఏడాదికి ఏ పంట సాగు చేసుకునే వీలు లేదు. గండ్లు పడ్డాయి. చాలా వరకు పొలాలు మేటలు వేసి ఉంటాయి. వరద పూర్తిగా తగ్గితే మేటలు ఏ మేర వేశాయో తెలుస్తుంది.
రోగాలు వస్తాయని భయమేస్తోంది
- దామా హనుమంతరావు
పంటలు మొత్తం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పది రోజులుగా పొలాల్లో ఎక్కడి నీరు అక్కడే ఉంది. బయటకు వెళ్లే అవకాశం లేదు. బుడమేరు పూర్తిగా తగ్గితే తప్ప ఈనీరు వాగుద్వారా బయటకు పోయే మార్గం లేదు. రెగ్యులేటర్ గేట్లు ఎత్తినా, గండ్లు పడిన ముందు మునిగిపోయేది మాగ్రామమే. దుర్వాసన వల్ల రోగాలు వస్తాయేమోనని భయమేస్తున్నది.
కౌలు రైతులకు పరిహారం అందాలి :
- వల్లూరు కిషోర్ కుమార్
పంట పరిహార విషయంలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలి. హెక్టారుకు రూ.25 వేలు ఇస్తామని అంటున్నది. అయితే రెండు హెక్టార్లుకు మాత్రమే పరిహారం ఇస్తే 20 నుంచి 30 ఎకరాలు కౌలుచేసే రైతులున్నారు. వారి పరిస్థితి ఏం కావాలి. ప్రభుత్వం నిబంధనలు సడలించి మొత్తం పంటకు పరిహారం అందించి ఆదుకోవాలి.
శాశ్వత పరిష్కారం చూపాలి
- దారపనేని కిషోర్ కుమార్
బుడమేరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి. వరదల వల్ల పంటలు పూర్తిగా పోయాయి. పశువులకు మేత లభించడం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. బుడమేరు వరద వచ్చి పడేది ముందు మా గ్రామం మీదే. ఆ తర్వాతే విజయవాడ పల్లపు ప్రాంతాలు మునుగుతాయి. సీఎం చంద్రబాబు చొరవ బాగుంది. నిత్యావసరాలు అందాయి. పంట పరిహారంలో కూడా న్యాయం చేయాలి.
Updated Date - Sep 12 , 2024 | 12:22 AM