మినీ గోకులం షెడ్లకు సబ్సిడీ రుణాలు
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:50 AM
పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు అందిస్తోందని బాపులపాడు పశుసంవర్థక శాఖ ఏడీ శ్రావణ్‌కుమార్ తెలిపారు.
హనుమాన్‌జంక్షన్, జూలై 25: పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు అందిస్తోందని బాపులపాడు పశుసంవర్థక శాఖ ఏడీ శ్రావణ్‌కుమార్ తెలి పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్న,పేద రైతులు తాము పెంచుకుంటున్న పాడి పశువులకు సరైన వసతి కల్పించలేకపోతున్నారని, దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తోందని తెలిపారు. రెండు పశువులకు రూ.లక్షన్నర, నాలుగు ఉన్న వారికి రూ.1.85 లక్షలు, ఆరు పశువులకు రూ.2.30 లక్షలు యూనిట్‌కు మంజూరు చేస్తోందన్నారు. యూనిట్ ఖర్చు మొత్తంలో 10శాతం రైతులు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. మిగిలిన సొమ్మును ఉపాధి హామీ పథకం ద్వారా విడుదల చేస్తోందన్నారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. షెడ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో పశువైద్యాధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Updated Date - Jul 26 , 2024 | 12:50 AM