తోడేస్తున్నారు!
ABN, Publish Date - Apr 09 , 2024 | 12:52 AM
భారీగా గట్టు కోతలతో, ఒకదాని తరువాత ఒకటి టిప్పర్ల పరుగులతో కనిపిస్తున్న ఈ దృశ్యం అక్రమ మైనింగ్‌కు నిదర్శనం. గన్నవరం మండలం కొండపావులూరు సర్వే నెంబర్ 34లో 100 మీటర్ల లోతున జరిగిన మట్టి తవ్వకాలకు సాక్షీ భూతం. సాగర్ కాల్వకు గండి కొట్టి మైనింగ్ చేపడుతున్న అక్రమానికి నిలువుటద్దం. అక్రమార్కులు వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకుని భారీస్థాయిలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో ఎక్స్‌కవేటర్లను పెట్టి రోజుకు రెండు వేలకుపైగా టిప్పర్లలో తరలించేస్తున్నారు. అధికార వైసీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖలకు తెలిసినా చర్యలు తీసుకోవటం లేదు.
సాగర్ కాల్వకు గండి కొట్టి మైనింగ్
కొండపావులూరు సర్వే నెంబర్ 34లో అక్రమం
100 మీటర్ల లోతున తవ్వి టిప్పర్లలో తరలింపు
ఇప్పటికే 30 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం
అక్రమ మైనింగ్‌లో వైసీపీ కీలక నేత అనుచరుడికి భారీగా వాటాలు
కోర్టును ఆశ్రయించిన మామిడి రైతులు..
అయినా లెక్కలేకుండా తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
భారీగా గట్టు కోతలతో, ఒకదాని తరువాత ఒకటి టిప్పర్ల పరుగులతో కనిపిస్తున్న ఈ దృశ్యం అక్రమ మైనింగ్‌కు నిదర్శనం. గన్నవరం మండలం కొండపావులూరు సర్వే నెంబర్ 34లో 100 మీటర్ల లోతున జరిగిన మట్టి తవ్వకాలకు సాక్షీ భూతం. సాగర్ కాల్వకు గండి కొట్టి మైనింగ్ చేపడుతున్న అక్రమానికి నిలువుటద్దం. అక్రమార్కులు వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకుని భారీస్థాయిలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో ఎక్స్‌కవేటర్లను పెట్టి రోజుకు రెండు వేలకుపైగా టిప్పర్లలో తరలించేస్తున్నారు. అధికార వైసీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖలకు తెలిసినా చర్యలు తీసుకోవటం లేదు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ గన్నవరం) : కొండపావులూరులోని సర్వే నెంబర్ 34లో గతంలో పేద దళితులకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికి కొందరికి సాగు పట్టాలు ఇచ్చారు. మరికొందరు ఆక్రమించుకుని సాగు చేపట్టారు. కొండవాలు ప్రాంతమైన ఈ భూముల్లో భారీగా ఎర్రమట్టి, తెల్లచట్టు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అధికార పార్టీ అక్రమార్కులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా పేద దళితులు, పట్టాలు కలిగిన వారి నుంచి ఈ భూములను కొనుగోలు చేసి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. మూడు మీటర్లు అని చెప్పి ప్రస్తుతం 100 అడుగుల వరకు తవ్వేశారు. మైనింగ్ మాఫియా కొనుగోలు చేసిన భూముల మధ్యన సాగర్ కాల్వ ఉండటం వల్ల దానికి కూడా గండి కొట్టి 50 అడుగుల లోతున తవ్వి దారి ఏర్పాటు చేసుకుని ఆవల ఉన్న భూముల్లో వంద అడుగుల లోతున ఇప్పటి వరకు తవ్వేశారు. వంద అడుగులకుపైగా తవ్వేసినా.. ఇంకా ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. గండికోట తరహాలో భారీలోతున జరుగుతున్న అక్రమ తవ్వకాల కారణంగా సమీపంలోని మామిడితోటల భూములు కూడా కోతకు గురవుతున్నాయి.
అక్రమార్కులు సరిహద్దు పొలాలను కూడా దాటి తవ్వేయడంతో తనకు జరిగిన అన్యాయంపై ఓ రైతు హైకోర్టును ఆశ్రయించాడు.
ప్రమాదకరంగా గోతులు
సాగర్ కాలువ అనేది సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ కాలువలో నీరు లేకపోయినా.. అక్రమ మైనింగ్ కోసం దానికి గండి పెట్టడం వల్ల నీరంతా 100 అడుగుల లోతున తవ్వేసిన గోతుల్లోకే వెళతాయి. వంద అడుగులకుపైగా తవ్వేసిన గోతులు చూస్తే అత్యంత భయంకరంగా కనిపిస్తున్నాయి. వర్షాలు పడితే ఇవి మునిగిపోయే ప్రమాదం ఉంది. 100 అడుగుల లోతున నీరు నిల్వ ఉంటే.. గట్టు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. సరిహద్దును అనుకుని ఉన్న మామిడితోటలన్నీ కోతకు గురై, కొంత విస్తీర్ణం మేర కుంగిపోయి.. రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అన్నింటికీ మించి మృత్యుకుహరాలుగా ఉంటాయి.
ఎర్రమట్టి, తెల్లచట్టుకు భారీ గిరాకీ
సర్వే నెంబర్ 34లో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు సంబంధించి మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. రెవెన్యూ అధికారులతో డీల్ కుదుర్చుకుని తవ్వకాలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 30 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టిని తవ్వేసినట్టు తెలుస్తోంది. ఎర్రమట్టికి ఎంతో డిమాండ్ ఉంది. కొండవాలు కాబట్టి మెత్తటి మట్టి నిక్షేపాలు ఉన్నాయి. ఈ మట్టికి ఎంతో డిమాండ్ ఉంది. ఉద్యానవనాల అభివృద్ధికి, గ్రీన్‌బెల్టుల విస్తరణ, ఇటుక బట్టీలు, రియల్ వెంచర్లకు ఈ మట్టి అంటే ఎంతో డిమాండ్. దీంతో హాట్‌కేకులా అమ్ముడౌతోంది. ఈ మట్టి ద్వారా ఇప్పటికే రూ.వందల కోట్లు పిండుకున్నట్టు తెలుస్తోంది. పంద అడుగుల లోతుకుపైగా ఈ మట్టిని తవ్విన తర్వాత.. తెల్లచట్టు బయట పడింది. మార్కెట్లో తెల్లచట్టుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తెల్లచట్టు అనేది రోడ్లకు ఉపయోగిస్తారు. తెల్లచట్టు వేస్తే బిగుసుకుని గట్టిపడుతుంది. దీంతో ఈ తెల్లచట్టు పెద్ద ఎత్తున రియల్ వెంచర్లకు తరలిపోతోంది.
అక్రమం వెనుక వైసీపీ నేత హస్తం
అక్రమ మైనింగ్ వెనుక గన్నవరం నియోజవర్గ కీలక వైసీపీ నేత ముఖ్య అనుచరుల హస్తం ఉందన్న తెలుస్తోంది. వీరెక్కడా బయట పడకుండా ఉండటానికి ముదిరాజుపాలెం గ్రామ మాజీ సర్పంచ్ గోనె వెంకయ్య పేరును తెరపైకి తెచ్చారు. స్థానికంగా ఉన్న రైతులంతా గోనె వెంకయ్య ఈ అక్రమ తవ్వకాలను మేనేజ్ చేస్తున్నాడని అతనిపైన వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల మాటున వైసీపీ కీలక నేత ముఖ్య అనుచరుడి భారీగా వాటాలు ముట్టినట్టు తెలుస్తోంది.
అడ్డగోలుగా తవ్వేస్తున్నారు : గోనేపల్లి సురేష్
పొలాలు కొనుగోలు చేసి వంద మీటర్లకుపైగా తవ్వేస్తున్నారు. ఈ మట్టి అంతా బయటకు తరలించి అమ్మేసు కుంటున్నారు. ప్రతిరోజూ కనీసం వెయ్యికి పైగా లారీల్లో మట్టి తరలిపోతోంది. దుమ్ము బీభత్సంగా లెగుస్తోంది. కాలుష్యంతో అల్లాడి పోతున్నాం. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవటం లేదు.
మామిడి తోటలు నాశనమవుతున్నాయి : చిట్టేటి శ్రీనివాస్
దారుణంగా తవ్వేస్తున్నారు. వంద అడుగులకుపైగా తవ్వేశారు. ఇంకా తవ్వుతున్నారు. సాగర్ కాలువకు కూడా గండి కొట్టి మరీ తవ్వేస్తున్నారు. భారీ తవ్వకాల వల్ల దుమ్ము లేచి మామిడి చెట్ల మీద పడుతోంది. మామిడిచెట్లన్నీ ఎర్రగా మారిపోయాయి. మామిడిచెట్ల పూత కూడా క్వారీ వల్ల రాలిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. చివరకు రైతులు కొందరు కోర్టుకు వెళ్లినా పట్టించుకోలేదు.
Updated Date - Apr 09 , 2024 | 12:52 AM