ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరాన్ని తవ్వేస్తున్నారు..!

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:29 AM

అవనిగడ్డ నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలకు అదుపు లేకుండాపోయింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలు, పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇసుకాసురులు కృష్ణానది తీర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఫలితంగా తీర గ్రామాలు ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడగా, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

అవనిగడ్డలో బరితెగిస్తున్న ఇసుక మాఫియా

తీరాన్ని కొల్లగొడుతున్నా పట్టించుకోని అధికారులు

పర్యావరణ చట్టాలకు తూట్లు పొడుస్తూ తవ్వకాలు

దౌర్జన్యాలకు పాల్పడినా కేసులు నమోదు చేయరు

ఇసుక తరలింపులో పంట పొలాలు నాశనం

దారులకు గండ్లు కొడుతున్న రైతులు

కొత్తదారులు వెతుక్కుంటున్న ఇసుకాసురులు

అవనిగడ్డ నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలకు అదుపు లేకుండాపోయింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలు, పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇసుకాసురులు కృష్ణానది తీర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఫలితంగా తీర గ్రామాలు ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడగా, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

అవనిగడ్డ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ మండ లాల్లో రాత్రయితే ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. చల్లపల్లి మండలం వెలివోలు, నిమ్మగడ్డ, ఆముదార్లంక రేవుల నుంచి నిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తు న్నారు. ఇటీవల ఆముదార్లంక గ్రామంలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టగా, అక్కడి ప్రజలు అడ్డుకుని ట్రాక్టర్లను రెవెన్యూ యంత్రాగానికి అప్పగించారు. కనీసం పట్టుకున్న ట్రాక్టర్లకు జరిమానాలు కూడా విధించని పరిస్థితిలో అధికారులున్నారు.

నిమ్మగడ్డ వద్ద ఆ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కను సన్నల్లో నిత్యం వందలాది బండ్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తు న్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఇసుక మాఫియా దాడికి తెగబడింది. ఈ దౌర్జన్యాలపై రెండు రోజుల కిందట రెవెన్యూ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇంతవరకు కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి ఏర్పడింది. మోపిదేవి మండలం మొత్తం సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉందని, ఎవరు ఇసుక తవ్వినా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, రెవెన్యూ యంత్రాంగంలోని కిందిస్థాయి సిబ్బంది ప్రోత్సాహంతో మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, కె.కొత్తపాలెం గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం, పాత ఎడ్లంక గ్రామాల సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతం కోతకు గురవుతూ జనావాసాలు కృష్ణానదిలో కలసిపోతున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణాదారులను అడ్డుకోవాల్సిన యంత్రాంగం రాజకీయ పలుకబడితో చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కోడూరు మండలం విశ్వనాథపల్లి కొత్తపాలెం, కుమ్మరిపాలెం, ఉల్లిపాలెం గ్రామాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి వందలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలిస్తున్నారు.

సీఆర్‌జెడ్‌ నిబంధనలు పట్టవా..?

నాగాయలంక మండలం గుల్లలమోద, కోడూరు మండలం హంసలదీవి మొదలు చల్లపల్లి మండలం వెలివోలు వరకు ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సీఆర్‌జెడ్‌) పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చిన ప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ఇదేం ఇసుక పాలసీ

కొత్త ఇసుక పాలసీ ప్రకారం.. స్థానికంగా ఉండే రేవుల నుంచి ఇసుకను తరలించుకోవచ్చని, అందుకోసం జిల్లాస్థాయి శాండ్‌ కమిటీ నియమించాలని, ఎలాంటి సందర్భాల్లో, ఎక్కడి నుంచి ఇసుక తెచ్చుకోవాలన్న విషయమై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే, కలెక్టర్‌ బాలాజీ ఇచ్చిన ఆదేశాల్లో స్థానికంగా అందుబాటులో ఉన్న నదుల నుంచి ఇసుకను తరలించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన తవ్వకాలు సాగిస్తున్నారు. అయితే, కలెక్టర్‌ ఇచ్చిన అవే ఆదేశాల్లో.. సమీపంలోని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రీచ్‌ల నుంచే ఇసుకను తీసుకొచ్చుకోవాలని సూచించిన విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు.

మేట తొలగింపునకు అష్టకష్టాలు

ఇటీవల కృష్ణానదికి వచ్చిన భారీ వరదల కారణంగా విజయవాడ మొదలు జిల్లాలోని చిట్టచివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు మండలాల్లోని లంక భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక మేట వేసింది. ఈ మేటను తొలగించేందుకు రెవెన్యూ అనుమతులు ఇవ్వటంలో తీవ్ర జాప్యం చేస్తోందని రైతులు చెబుతున్నారు. ఓవైపు తమ కళ్లముందే ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలించుకుపోతుండగా, తమ భూముల్లో ఏర్పడిన మేటను తొలగించుకునేందుకు తమకెందుకు ఈ ఇబ్బందులు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దారులకు గండ్లు

ఇసుక మాఫియా రాత్రి సమయాల్లో లంక భూముల్లోని పంట పొలాల మీదుగా వెళ్లి నదిలోని ఇసుకను తవ్వేస్తుండగా, దీని కారణంగా తమ భూములకు ఇబ్బంది ఎదురవుతోందని చెబుతూ పలుచోట్ల రైతులు, తీర గ్రామాల ప్రజలు నదిలోకి వెళ్లే బాటకు గండ్లు కొడుతున్నారు. ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద, సూరపనేనివారిపాలెం గ్రామస్థుల లంకకు వెళ్లే దారి, నిమ్మగడ్డ లంక భూములకు వెళ్లే దారిలో స్థానిక రైతులు, గ్రామస్థులు దారులకు గండ్లు కొట్టారు. అయినా ఆగని ఇసుక మాఫియా కొత్తదారులు వెతుక్కుంటోంది.

Updated Date - Nov 12 , 2024 | 01:29 AM