అందరినీ ఆదుకుంటాం
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:33 AM
విజయవాడ పరిసర ప్రాంత వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహాలకు, వ్యాపార వాణిజ్య ఆస్తులకు జరిగిన నష్టాన్ని యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ అర్బన్ ఏరియాలో దాదాపు పూర్తికావచ్చిందని, గ్రామీణ ప్రాంతంలోను శరవేగంగా జరుగుతోందని, అయితే ఇంకా ఎవరైనా మిగిలివుంటే వారు ఈనెల 12న తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి నష్ట నమోదు చేయడం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు.
కష్టమొచ్చిన ప్రతి ఒక్కరి నష్టాన్ని గణిస్తాం
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి నష్టాన్ని నమోదు చేస్తాం
అన్ని విధాలా సహాయ సహకారాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన
విజయవాడ లీగల్, సెప్టెంబరు 11 : విజయవాడ పరిసర ప్రాంత వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహాలకు, వ్యాపార వాణిజ్య ఆస్తులకు జరిగిన నష్టాన్ని యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ అర్బన్ ఏరియాలో దాదాపు పూర్తికావచ్చిందని, గ్రామీణ ప్రాంతంలోను శరవేగంగా జరుగుతోందని, అయితే ఇంకా ఎవరైనా మిగిలివుంటే వారు ఈనెల 12న తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి నష్ట నమోదు చేయడం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ, వరద ప్రభావం నుంచి 32 వార్డులు, ఐదు గ్రామాల్లో రక్షణ, ఉపశమన చర్యలు విజయవంతంగా పూర్తిచేయడం జరిగిందని, ఇప్పుడు పునరావాస చర్యలను ప్రణాళికాయుతంగా చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈనెల 9వ తేదీన నష్ట నమోదు ప్రక్రియ ప్రారంభించామని, బాధితులను ముంపు నష్టాల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకాలను అనుగుణంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 2,32,000 కుటుంబాలకు సంబంధించిన నష్ట గణాంకాలను నమోదు చేయడం జరుగుతోందని, ఒకవేళ ఇల్లు విడిచి బయటకు వెళ్లినా, ఎన్యూమరేషన్ బృందం ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 12వ తేదీన తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. నష్ట గణనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్లలో సబ్ కలెక్టర్ కార్యాలయం (0866-2574454), విజయవాడ మున్సిపల్ కార్యాలయం (8181960909) సంప్రదించి ఎన్యూమరేషన్‌ను పూర్తిచేయించుకోవచ్చని వివరించారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు తదితర ప్రాంతాల్లోనూ నష్ట గణనను మర్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిచేస్తామని కలెక్టర్ సృజన తెలిపారు.
అన్ని విధాలా అండగా..
రిలీఫ్ అంటే కేవలం ఆహారం, ఆర్థిక సహకారమే కాకుండా బాధితులకు ఎన్ని విధాలా సహాయం అందించాలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాధితులకు చేసే సహాయం రియాక్టివ్‌గా కాకుండా ప్రో యాక్టివ్‌గా (క్రియాశీలంగా) వుండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారని, ఈ క్రమంలోనే బాధితుల వాహనాలు, ఎలక్ర్టానిక్ వస్తువులు, ఎలక్ర్టికల్ రిపేర్లు వంటివి చాలా తక్కువ ధరలో చేయించడం జరుగుతోందని, అవసరమైతే ప్రభుత్వమే రాయితీతో ఇవన్నీ చేయించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల సౌకర్యార్థం అందుబాటులో వుంచిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అందరూ సమిష్టిగా విజయవాడను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు.
Updated Date - Sep 12 , 2024 | 12:34 AM