రాజధానికి రెక్కలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 01:30 AM
ఆవిరైన ఆశలకు ఊపిరిపోశారు. అమరావతి అభివృద్ధికి మళ్లీ బీజం వేశారు. ఐదేళ్ల తర్వాత కలలను సాకారం చేస్తూ సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి కృష్ణాజిల్లావాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం, అమరావతి మెట్రో.. వంటి కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు శుభపరిణామాలుగా పేర్కొంటున్నారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి అవుటర్ రింగురోడ్డు అవసరాన్ని తెలియజేయడం మరో ముఖ్యమైన అంశంగా చెబుతున్నారు. - (విజయవాడ-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి కృష్ణాకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు
అమరావతికి ఊపిరినిస్తూ లైట్ మెట్రోలో కదలిక
రూ.50 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం
బందరు పోర్టుకు రూ.150 కోట్లు
కృష్ణా వర్సిటీ, వీఎంసీకి కూడా నిధులు
కృష్ణాడెల్టాకు రూ.377 కోట్ల కేటాయింపు
ఆవిరైన ఆశలకు ఊపిరిపోశారు. అమరావతి అభివృద్ధికి మళ్లీ బీజం వేశారు. ఐదేళ్ల తర్వాత కలలను సాకారం చేస్తూ సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి కృష్ణాజిల్లావాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం, అమరావతి మెట్రో.. వంటి కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు శుభపరిణామాలుగా పేర్కొంటున్నారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి అవుటర్ రింగురోడ్డు అవసరాన్ని తెలియజేయడం మరో ముఖ్యమైన అంశంగా చెబుతున్నారు.
- (విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అమరావతి అవుటర్‌పై ఆశలు
‘గత ప్రభుత్వ హయాంలో అమరావతి అవుటర్ రింగురోడ్డు ప్రాజెక్టు నిలిచిపోయింది. 189 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఎక్స్‌ప్రెస్-వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాజధానిని.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను, ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది.’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
కృష్ణా వర్సిటీ, వీఎంసీకి ఊతం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి రూ.9.67 కోట్లు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం అరకొర కేటాయింపులతో నెట్టుకురాగా, టీడీపీ ప్రభుత్వం వర్సిటీకి కేటాయింపులను గణనీయంగా పెంచింది. అలాగే, విజయవాడ నగరంలో మౌలిక వసతుల కల్పనకు వీఎంసీకి రూ.10 కోట్లు కేటాయించారు.
బందరు పోర్టుకు ముందడుగు
ఉమ్మడి కృష్ణా జిల్లావాసుల శతాబ్దాల కల మచిలీపట్నం పోర్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోర్టు నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. నవయుగతో ఉన్న నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత డీపీఆర్ పేరుతో ఏడాది కాలక్షేపం చేశారు. 2020-21 బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. 2021-22 బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు పెట్టలేదు. సుమారు రూ.12 వేల కోట్ల పైచిలుకు నిర్మాణ వ్యయమయ్యే పోర్టుకు ఈసారి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు.
కృష్ణాడెల్టాకు ఊపిరి
ఉమ్మడి కృష్ణాలో సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణాడెల్టా ఆధునికీకరణతో మొత్తం ఆయకట్టుకు నీరు అందే అవకాశం ఉంటుంది. దశాబ్దకాలంగా ఆధునికీకరణ పనులు సాగుతూనే ఉన్నాయి. రూ.3,900 కోట్లతో 2007లోనే కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ తర్వాత అంచనాలు రెట్టింప య్యాయి. ఇప్పటి వరకు సుమారు రూ.2వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంకా డెల్టా ఆధునికీకరణ పూర్తి కాలేదు. అంచనా వ్యయాలు పెరిగాయి. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా పనులు జరగడం లేదు. డెల్టా ఆధునికీకరణ చేస్తే సాగునీరు వృథా కాకుండా ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. 2023లో వైసీపీ సర్కార్ రూ.279 కోట్లు కేటాయిం చగా, టీడీపీ సర్కార్ రూ.377 కోట్లు ఇచ్చింది.
Updated Date - Nov 12 , 2024 | 01:30 AM