గౌతంరెడ్డి ఎక్కడ?
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:28 AM
పూనూరు గౌతంరెడ్డి... కమ్యూనిస్టు నేతగా ఎదిగి వైసీపీలో ట్రేడ్ యూనియన్ నేతగా ఓ వెలుగు వెలిగాడు. గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్నం కేసులో ప్రస్తుతం పలాయనం చిత్తగించాడు. ఈ కేసులో ఏ1గా ఉన్న గౌతంరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
తీవ్రంగా గాలిస్తున్న మూడు ప్రత్యేక బృందాలు
కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్నట్టు అనుమానం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పూనూరు గౌతంరెడ్డి... కమ్యూనిస్టు నేతగా ఎదిగి వైసీపీలో ట్రేడ్ యూనియన్ నేతగా ఓ వెలుగు వెలిగాడు. గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్నం కేసులో ప్రస్తుతం పలాయనం చిత్తగించాడు. ఈ కేసులో ఏ1గా ఉన్న గౌతంరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూడు ప్రత్యేక బృందాలు ఊరూరు తిరుగుతున్నాయి. గౌతంరెడ్డి సామాజిక బలం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై పోలీసులు దృష్టి పెట్టారు. దీని ప్రకారం చూస్తే ఆయన నెల్లూరు, కడప జిల్లాల్లో ఎక్కడో ఒకచోట ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉంటే వైసీపీ నేతలే ఆయనకు ఆశ్రయం కల్పిస్తారు. అదే కడప జిల్లాలో అయితే కుమార్తె తరఫు బంధువులు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. ఈ కేసులో ఉమామహేశ్వరశాస్ర్తిపై దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు ఇప్పటికే జైలుకు పంపారు. గౌతంరెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ ఐదుగురి కోసం వేట సాగుతోంది. సాంకేతిక దర్యాప్తు కూడా కొనసాగుతోంది.
ప్రతిపాదనలు ఉన్నా ఓపెన్ కాని షీట్
గౌతంరెడ్డికి 1988 నుంచి నేరచరిత్ర ఉంది. కమిషనరేట్‌లో 42 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు హత్యలు, రెండు హత్యాయత్నాలు, ఒక డెకాయిటీ, రెండు దోపిడీ, రెండు చీటింగ్‌లు ఉన్నాయి. అతడిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దీన్ని 2003లో తీసేశారు. తర్వాత 2004-2005లో గౌతంరెడ్డిపై రౌడీషీట్ తెరవడానికి అప్పటి ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు ముందుకు కదల్లేదు. దీనికి కారణాలు ఏమిటన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. రౌడీషీట్ ఎందుకు తీసేశారు, తర్వాత తయారు చేసిన ప్రతిపాదనలు ఎందుకు మూలనపడ్డాయి అనే అంశాలను బయటకు తీస్తున్నారు. కేసులను పరిశీలించాక తిరిగి షీట్ తెరిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనిపై న్యాయనిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లా అండ్ ఆర్డర్ బృందాలు, ఒక టాస్క్‌ఫోర్స్ బృందం గౌతంరెడ్డి ఆచూకీని తెలుసుకునే పనిలో ఉంది. కాగా, ఉమామహేశ్వరశాస్ర్తి కేసుతో గౌతంరెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తామంతా గౌతంరెడ్డి బాధితులమేనని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన ఎన్నో అరాచకాలు చేశాడని వారంతా ఆరోపిస్తున్నారు.
వీలునామాను కూడా మార్చేసి..
ఉమామహేశ్వరశాస్ర్తి స్థలాన్ని నకిలీ వీలునామా ద్వారా గౌతంరెడ్డి కాజేశాడు. ఉమామహేశ్వరశాస్ర్తి తండ్రి రాసిన వీలునామా మొత్తంగా మార్చే పత్రాన్ని తయారు చేశాడు. దీనికి ఎలాంటి రిజిస్ర్టేషన్ లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని మొత్తం స్థలాన్ని గౌతంరెడ్డి మింగేశాడు. దీని గురించి తెలుసుకున్న బాధితుడు అప్పుడే సత్యనారాయణపురం పోలీసుల వద్దకు వెళ్లాడు. తన వద్ద అసలు వీలునామా ఉందని, గౌతంరెడ్డి వద్ద ఉన్నది నకిలీదని పదేపదే చెప్పాడు. దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందజేశాడు. దీనిపై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు వదిలేశారు. ఉమామహేశ్వరశాస్ర్తి ఇచ్చిన వీలునామాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపితే నాడే అసలు నిజాలు బయటకు వచ్చేవంటున్నారు. అప్పటి పోలీసులు ఈ పని ఎందుకు చేయలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Updated Date - Nov 16 , 2024 | 12:28 AM