చిక్కిన చిరుత
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:56 PM
నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్ పోస్టు వెనుక వైపున ఏర్పాటు చేసిన బోనుకు చిరుత పులి చిక్కింది.

తిరుపతి జూకు తరలించిన అధికారులు
శిరివెళ్ల, రుద్రవరం, జూన్ 28 : నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్ పోస్టు వెనుక వైపున ఏర్పాటు చేసిన బోనుకు చిరుత పులి చిక్కింది. అటవీశాఖ నంద్యాల డీఎఫ్‌వో అనురాగ్ మీనా, పచ్చర్ల రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య, నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పరిశీలించారు. ఇటీవల నల్లమల పరిసర గ్రామాల్లో చిరుత పులి దాడులు తీవ్రమైన నేపథ్యంలో అధికారులు చిరుతను బంధించడానికి బోన్లు అమర్చారు. ఈ నెల 25న కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరున్నిషాపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. దీంతో పచ్చర్ల గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో అటవీ శాఖ అధికారులు తరచూ చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో పలు చోట్ల బోన్లు, ట్రాప్ కెమెరాలను అమర్చారు. ఎట్టకేలకు పచ్చర్ల చెక్‌పోస్టు సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు శుక్రవారం తెల్లవారుజామున చిరుత పులి చిక్కింది. బోనుకు చిక్కిన చిరుత పులి, మహిళపై దాడి చేసి చంపేసిన చిరుత ఒకటే అనే ప్రాథమిక అవగాహనకు అటవీశాఖ అధికారులు వచ్చారు. ఐదారేళ్ల వయసు ఉన్న ఈ చిరుతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్‌కు తరలించినట్లు ఎప్‌ఆర్‌వో ఈశ్వరయ్య వెల్లడించారు. ఇదిలా ఉండగా పచ్చర్ల అటవీ ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నాయని మహిళలు అంటున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నల్లమల అటవిలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. చెలిమ, రుద్రవరం రేంజ్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అడవిలోకి వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలి.
-సబ్ డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి