స్వర్ణ రథంపై ఆది దంపతులు
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:12 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో సోమవారం ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది.
శ్రీశైలం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో సోమవారం ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామున మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథాన్ని నేత్రశోభితంగా పుష్పాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్లు ఆశీనులైన స్వర్ణరథాన్ని ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. స్వర్ణరథం ఎదుట కోలాటం, చెక్కభజన, జానపద కళాకారులు భక్తులను ఆకట్టుకున్నాయి. భద్రత ఏర్పాట్లను స్థానిక సీఐ ప్రసాదరావు, దేవస్థానం ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జి. స్వాములు పర్యవేక్షించారు. కార్యనిర్వహణాధికారి యం శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమీషనర్ ఈ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తులు
శ్రీశైలం మహాక్షేత్రానికి సోమవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పటింది. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలను జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం కార్యాలయం సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
ధర్మపథంలో భాగంగా దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో సోమవారం సాయంత్రం విశాఖపట్నానికి చెందిన దర్పణ నాట్య అకాడమీ బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - Dec 17 , 2024 | 12:12 AM