ఆన్‌లైన్‌లో పాసు పుస్తకాల మార్పు
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:37 PM
సొంతూరులో పనులు లేక పిల్లా పాపలతో బొంబాయికి వలస వెళ్లిన వాళ్ల పొలాన్ని వైసీపీ నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో పాసుపుస్తకాలు మార్చేశారు.
వలస వెళ్లాక ఈ పని చేశారంటున్న బాధితులు
కోసిగి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సొంతూరులో పనులు లేక పిల్లా పాపలతో బొంబాయికి వలస వెళ్లిన వాళ్ల పొలాన్ని వైసీపీ నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో పాసుపుస్తకాలు మార్చేశారు. ఈ ఘటన మండలంలోని కందుకూరు గ్రామంలో జరిగింది. గూడ్ల ఈరన్న, గూడ్ల తాయప్ప, వారి కుటుంబ సభ్యులు బుధవారం కోసిగి విలేకరుల ముందు ఈ విషయం తెలిపారు. కలెక్టర్ రంజిత్‌బాషా, ఎస్పీ బిందుమాధవ్‌లకు తమ సమస్యలు లిఖిత పూర్వకంగా అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు ఈరన్న, తాయప్ప మాట్లాడుతూ కందుకూరు గ్రామంలోని సర్వే నెం.352ఏ, 352బీలో 17.81 ఎకరాల పొలం తమకు ఉన్నదని తెలిపారు. ఊళ్లో పనులు లేకపోవడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి బొంబాయి, గుంటూరు పట్టణాలకు వలస వెళ్లిన సమయంలో అప్పటి గ్రామ రెవెన్యూ అధికారులు, స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో తమ భూమి పాసు పుస్తకాలను గ్రామానికి చెందిన దోసయ్యగారి రామన్న కుమారులు అయ్యన్న, చిన్న రామన్న, నరసింహులు, దేవేంద్ర పేర్ల మీద ఆన్‌లైన్‌లో మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగెకరాలను వారి పేర్ల మీద పాసు పుస్తకాలు చేశారని, మిగతా 13.54 ఎకరాల పొలం కూడా వారే ఆధీనంలోకి తీసుకొని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామంలోని వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే రెవెన్యూ అధికారులు తమ పేర్లను మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. కోసిగి సీఐ మంజునాథ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
Updated Date - Nov 20 , 2024 | 11:37 PM