నిబంధనాల్లో పత్తి రైతు
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:10 AM
పత్తి ధర మరింత పతనమయింది. మార్కెట్ యార్డ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటం పత్తి రూ.600 తక్కువకు వ్యాపారులు కొంటున్నారు.
ఒక రైతు నుంచి ఎకరాకు 5 క్వింటాళ్లే కొనుగోలు
తేమ ఉందంటూ మరో కొర్రి
ఇప్పటికి కొన్నది 2400 క్వింటాళ్లే
అడ్డగోలు నిబంధనలతో పత్తి రైతు అవస్థలు
తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోతున్న రైతులు
ఆదోని అగ్రికల్చర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : పత్తి ధర మరింత పతనమయింది. మార్కెట్ యార్డ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటం పత్తి రూ.600 తక్కువకు వ్యాపారులు కొంటున్నారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నది. ఎకరాకు మొదటి కోత 5 క్వింటాళ్లకు మించి కొనలేమని కరాఖండిగా చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. మరోవైపు పత్తిలో తేమ ఉందని పేచి పెడుతున్నారు. నిబంధనల సుడిగుండంలో రైతులు పత్తి అమ్ముకోడానికి అవస్థ పడుతున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ, సీసీఐ సమన్వయ లోపం పత్తి రైతులకు శాపంగా మారింది. పత్తి విక్రయించుకోవడానికి వందల సంఖ్యలో పేర్లు నమోదు చేసుకున్న రైతులు కేంద్రాలకు వస్తే నిబంధనలతో తిరస్కరిసున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఎకరాకు 12-15 క్విటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండడంతో రైతులు సంబరపడ్డారు. అంతలోనే పత్తి ధరలు పతనం కావడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేని పరిస్థితి. మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్ కమిటీలో పత్తిని వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ అప్రమత్తమై సీసీఐను రంగంలోకి దించింది. కనీస మద్దతు ధర క్వింటం రూ.7521తో ఆదుకుంటుందని రైతులు ఆశించారు. పత్తి పంట సాగుకు పెట్టిన ఽపెట్టుబడి ఖర్చులు వస్తాయి. లాభాలు లేకపోయినా అప్పులు తీర్చుకోవచ్చని అనుకున్నారు. కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించడంతో రైతుసేవా కేంద్రాలలో నమోదు చేసుకున్నారు. తీరా కొనుగోలు కేంద్రాలకు పండించిన పత్తిని రైతులు తీసుకొస్తే నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్నారు. దీపావళి కంటే ముందే అదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడులలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా, రైతుల నుంచి కొనుగోలుకు మాత్రం 5 రోజులు కిందే మొదలు పెట్టారు. . ఇప్పటివరకు 144 మంది రైతులు నుంచి కేవలం 2400 క్వింటాళ్లే పత్తిని కొనుగోలు చేసినట్టు సీసీఐ అధికారులు తెలుపుతున్నారు.
మార్కెట్లో రోజుకు పదివేల క్వింటాళ్లు
ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ప్రతిరోజు 10వేల నుంచి 12వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు కొంటున్నారు. పత్తిధర గరిష్ఠంగా రూ.7100 మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. తక్కువ ధరకే ఇన్ని వేల క్వింటాళ్లు వేల మంది రైతులు విక్రయిస్తున్న సీసీఐ నిబంధనల వల్ల మద్దతు ధరకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆదోని, కౌతాలం, పెద్దకడుబురు, హాలహర్వి, ఆలూరు, చిప్పగిరి, మంత్రాలయం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, ప్రాంతాల్లో ఎకరాకు 12-14 క్వింటాళ్లపైగానే దిగుబడి వచ్చింది. కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామంలో ఎకరాకు 16నుంచి 18 క్వింటాళ్లు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. దిగుబడి అధిక మొత్తంలో వచ్చినా వ్యవసాయ శాఖ మాత్రం కేవలం ఎనిమిది క్వింటాళ్లకు దిగుబడి మించలేదని నివేదిక పంపడంతో సీసీఐకి విక్రయించుకునేందుకు కేవలం ఎనిమిది క్వింటాళ్లేనని నిబంధనలు పెట్టింది. దీంతో పత్తి రైతులు అమ్ముకోలేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. అమ్ముకునేందుకు కూడా పత్తి రైతులు ఆసక్తి చూపడం లేదు.
సీసీఐ నిబంధనలు ఇవే....
పత్తి రైతు ఖరీఫ్‌లో ఈ-పంట నమోదు చేసుకొని ఉండాలి.
గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలలో ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలి.
పేర్లు నమోదు చేసుకున్నా సీసీఐ చెప్పిన రోజే కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకెళ్లాలి.
పత్తి బోరాల్లో కాకుండా లూజుగా వాహనాల్లో తేమ లేకుండా తీసుకెళ్లాలి
తేమ 8శాతం నుంచి 12శాతానికి మించరాదు
పత్తికి 8శాతం ఉంటేనే కనీసం మద్దతు ధర రూ. 7521 చెల్లిస్తారు
తేమశాతం ఒక్క శాతం అధికమైన రూ.75పైగా కోత
పట్టాదారు, పాస్ పుస్తకం బ్యాంకు ఖాతా నెంబరు ఉండాలి
కొనుగోలు చేశాక పది రోజుల తర్వాత చెల్లింపులు రైతు ఖాతాలో జమ
ఎకరాకు మొదటి కోత దిగుబడిలో 40 శాతం మాత్రమే మొదట కొనుగోలు. అలా మూడు సార్లు విక్రయించుకునేందుకు నిబంధన
సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజులే కొనుగోలు
కొనుగోలు కేంద్రాలకు వచ్చాక నిబంధనల పేరుతో సతాయింపు.
మద్దతు ధర ఉత్తిదే
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉత్తిదే. మార్కెట్లో ధరలు పతనమైనప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ రైతులను సతాయిస్తున్నారు. దిగుబడి ఉన్నా ధర లేక సీసీఐకి విక్రయించుకుందామంటే ఎకరాని ఇంతే కొంటామంటూ చెప్పండం భావ్యం కాదు. తీరా కొనుగోలు కేంద్రానికి వచ్చాక కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా లేకుండాపోయింది. నిబంధనల వల్ల మద్దతు ధరకు అమ్ముకోలేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నాము.
- సీతారాం రెడ్డి, పత్తి రైతు, నెరణికి గ్రామం, ఆలూరు
నిబంధనలు సడలించాలి
మార్కెట్‌లో రోజురోజుకు పత్తి ధరలు పతనమవుతున్నాయి. మద్దతు ధర కల్పిస్తామని సీసీఐ కొనుగోలు చేస్తున్న రైతులకు నిబంధనలు పెట్టింది. తేమశాతం, ఎకరాకు మొదట 40శాతం కొంటామని చెప్పడం రైతులను ఇబ్బందులు కలిగించడమే. నిబంధనలు సడలించి రైతుతో ఎన్ని క్వింటాళ్ల పత్తి ఉన్న సీసీఐ మద్దతు ధరలో కొనుగోలు చేయాల్సిందే లేనిపక్షంలో రైతులతో ఆందోళన చేపట్టాల్సి వస్తుంది.
- వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆదోని
నిబంధనల మేరకే కొనుగోలు
వ్యవసాయ శాఖ దిగుబడి సూచించిన మేరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆన్‌లైన్‌లో మొదటికోతలో ఎకరాకు ఎంత వస్తే అంతే ఆ రైతు నుంచి కొంటాం. అలా మూడు దశల్లో రైతులు విక్రయించుకోవచ్చు. మా చేతుల్లో ఏమీ లేదు.
- సీసీఐ కేంద్ర బాధ్యుడు, ఆదోని
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
వ్యవసాయ శాఖ దిగుబడి అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. సీసీఐ మూడు విడతల్లో రైతు నుంచి కొనుగోలు చేస్తుంది. మొదట విడతలో 40శాతం పత్తి దిగుబడి, రెండో విడతలో 40శాతం, చివరి కోత దిగుబడి 20శాతం కొంటుంది. కొన్ని నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని కోరాం. రైతులు ఆందోళన చెందకుండా మద్దతు ధరకు విక్రయించుకోవాలి.
- రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి, ఆదోని
Updated Date - Nov 18 , 2024 | 12:10 AM