అత్యాశకు పోవొద్దు..
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:29 AM
అధిక డబ్బు వస్తుందన్న అత్యాశకు వెళ్లి మొదటికి మోసం తెచ్చుకోవద్దని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి పట్టణంలోని సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిప్టో కరెన్సీ కేసులో నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు.
క్రిప్టో కరెన్సీ కేసులో నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసులు
డోన్ రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అధిక డబ్బు వస్తుందన్న అత్యాశకు వెళ్లి మొదటికి మోసం తెచ్చుకోవద్దని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి పట్టణంలోని సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిప్టో కరెన్సీ కేసులో నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. డోన్ పట్టణం కొత్తపేటలో నివాసముంటున్న రామాంజనేయులు 2021 నవంబరు నుంచి ఒక ఆయుర్వేదిక్ షాపులో పని చేస్తూ.. అదే ప్రాంగణంలో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలకు రూ.లక్ష పెట్టుబడి చేస్తే.. ప్రతి నెలా రూ.10వేలు అందిస్తానని ఆశ చూపాడు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని నమ్మించి డోన్ పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 315 మంది నుంచి రూ.23 కోట్ల అక్రమ డిపాజిట్ల రూపంలో సేకరించాడు. వాటిని విడతల వారిగా వడ్డీ రూపంలో వారికే సుమారు రూ.17 కోట్లు చెల్లించాడు. ప్రారంభంలో డిపాజిటర్లకు వడ్డీ చెల్లిస్తూ నమ్మించి మోసం చేస్తూ అధిక డిపాజిట్లు పొందాడు. సెప్టెంబరు నుంచి వడ్డీ చెల్లించడం నిలిపివేవాడు. ఈ మేరకు నిందితుడు రామాంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేసి సాక్షులను విచారించారు. నిందితుడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.2.45 కోట్లను ఫ్రీజ్ చేశారు. సోమవారం తమ పోలీసు ప్రత్యేక బృందం రామాంజనేయులును అరెస్టు చేసి మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను కేసుకు సంబంధించిన ఇతర ముఖ్యపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్‌ఐ నరేంద్ర కుమార్, శరత్ కుమార్ రెడ్డి, రూరల్ ఎస్‌ఐ మమత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 12:29 AM