రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:34 AM
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, అక్టోబరు 7: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నంద్యాల, గోస్పాడు మండల రైతులకు రాయితీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను వైసీపీ నేతలు వదలడం లేదని అన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజాసేవ అంటూ శిల్పాసహకార్, శిల్పా మహిళాబ్యాంక్ పేరుతో ప్రభుత్వ భవనాలను అద్దెప్రాతిపాదికన తీసుకుని గడువు ముగిసినప్పటికీ వదలక పోవడంలో అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఖాళీ చేసి నిజాయితీని చాటుకోవాలని సూచించారు. అక్కడే వేదికపై ఉన్న రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తులసీరెడ్డిని ప్రభుత్వ స్థలాలలో మార్క్‌ఫెడ్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని రైతులకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రైతులు ప్రభుత్వం ఆందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనగ విత్తనం పూర్తి ధర రూ.9400 కాగా 25 శాతం సబ్సిడీ పోగా రూ.7050 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం తులసీరెడ్డి మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రైతులకు అన్ని విదాల సహకరిస్తామన్నారు. త్వరలో గోనె సంచులను కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
అధికారుల పనితీరుపై మంత్రికి ఫిర్యాదు
నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజశేఖర్ పసితీరుపై ఊడుమాల్పురం గ్రామానికి చెందిన రైతు లోకేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాక మంత్రికి ఫిర్యాదు చేశారు. గత పాలనలో జొన్నలు కొందరివి మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల మంజూరులో ఆడ్డంకులు సృష్టించారన్నారు. మార్క్‌ఫెడ్ కార్యాలయంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బ్రహ్మానందరెడ్డి జొన్నల కొనుగోలులో కలిగించిన అవరోధాలను గోస్పాడు మండలం ఎం.క్రిష్ణాపురం గ్రామానికి చెందిన రైతు బాలీశ్వరరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. బ్రహ్మానందరెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, టీడీడీ నంద్యాల, గోస్పాడు మండలాల కన్వీనర్లు విశ్వనాథరెడ్డి, తులసీశ్వరరెడ్డి, నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి మండ్ల గుర్రప్ప, నంద్యాల, గోస్పాడు ఏవోలు ప్రసాదరావు పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 12:34 AM