ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేశవ చూపు కేసీ వైపు..

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:57 AM

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం 2024-25 బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్‌ ఇది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.

అత్యధికంగా కేసీ కెనాల్‌కు రూ.253.10 కోట్లు

కర్నూలు జిల్లా ప్రాజెక్టులకు అరకొర నిధులే

సూపర్‌ సిక్స్‌ పథకాలకు అధిక ప్రాధాన్యం

పయ్యావుల బడ్జెట్‌లో పశ్చిమానికి అన్యాయం

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం 2024-25 బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్‌ ఇది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. నాలుగు నెలల బడ్జెట్‌ అయినా.. కరువుతో తల్లడిల్లే కర్నూలు ప్రాజెక్టులకు ఆశాజనకంగా కేటాయింపులు లేవు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా ప్రాజెక్టులకు రూ.445.81 కోట్లు కేటాయిస్తే అందులో సగానికి పైగా కేసీ కాలువకే కేటాయించారు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో కరువు నివారణ లక్ష్యంగా చేపట్టిన వేదవతి లిఫ్ట్‌, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టులు సహా తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు అరకొర నిధులతో సరిపుచ్చారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు కాస్త ఊపిరి పోశారు. గుండ్రేవుల జలాశయం ఊసే లేదు. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ పథకాల హామీలతో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పథకాలకు బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించారు. పేదల సంక్షేమ బడ్జెట్‌ ఇది అని విత్త మంత్రి పయ్యావుల చాటి చెప్పారు. జిల్లాలో విశ్వవిద్యాలయాలకు జీతాలు, నిర్వహణకు మాత్రమే నిధులు ఇచ్చారు. పయ్యావుల బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులపై ఆంధ్రజ్యోతి కథనం.

బడ్జెట్‌లో కీలకం!

హంద్రీ నీవాకు రూ.812 కోట్లు

హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోత పథకం ప్రాజెక్టు ఫేజ్‌-1, ఫేజ్‌-2 కింద కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో లైనింగ్‌, అసంపూర్తి పనులు, పాత బిల్లుల చెల్లింపులు సహా వివిధ పనులు, జలాశయాల నిర్వహణ కోసం రూ.812 కోట్లు కేటాయించారు. మూడు జిల్లాలకు కలిపి కేటాయంపులు చేయడంతో ఏ జిల్లాకు ఎంత అన్నది స్పష్టత లేదు. పత్తికొండ రిజర్వాయర్‌ కుడి ఎడమ కాలువలు అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. వాటికి పరిపాలన అనుమతులు రాలేదు. అదే క్రమంలో హంద్రీనీవా విస్తరణ కోసం ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంటే.. ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఫేజ్‌-2 కింద అనంతపురం, చిత్తూరు జిల్లాలో చేపట్టే పనులకే ఖర్చు చేసే అవకాశం ఉంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలకు దాదాపు రూ.3,500 కోట్ల విద్యుత్‌ చార్జీల బకాయి ఉంది. ఏడాదికి రూ.6-8 కోట్ల వడ్డీ అవుతుంది. విద్యుత్‌ బిల్లులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.

కందనవోలుకు అరకొర నిధులే..

ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు 2024-25 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ రూ.445.81 కోట్లు కేటాయించారు. అందులో నంద్యాల జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు, కేసీ కాలువ, కుందూ విస్తరణ, ఎస్‌ఆర్‌బీసీ, సిద్ధేశ్వరం ఎత్తిపోతల పథకాలకు రూ.329.75 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించగా నిత్యం కరువు, వలసలతో తల్లడిల్లే కర్నూలు జిల్లాలో తుంగభద్ర ప్రాజెక్టు దిగువ కాలువ (ఎల్లెల్సీ), గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌, వేదవతి, గాజులదిన్నె ప్రాజె క్టులకు రూ.115.39 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నిధుల్లో అత్యధికంగా కేసీ కాలువకు రూ.253.10 కోట్లు ఇచ్చారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన కుందూ విస్తరణ పనులకు పాత బిల్లుల చెల్లింపులే అఽధికంగా ఉన్నాయని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లా ప్రాజెక్టులైన వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి ఉంటే తక్షణం భూ సేకరణ చేపట్టి వేసవిలో పనులకు అంకురార్పణ చేసే అవకాశం ఉండేది. ఈ బడ్జెట్‌లో నిధులు ఊసే లేకపోవడంతో ఈ పనులకు మోక్షం లభిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంపు పనులకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్‌ ఆపేశారు. బడ్జెట్‌లో రూ.11.79 కోట్లు ఇచ్చారు. కాంట్రాక్టరు బిల్లులు చెల్లించి పనులను మొదలు పెట్టాల్సిన బాధ్యత ఇంజనీర్లు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిలపై ఉంది. పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాల్లో 68 చెరువు లకు హంద్రీ నీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసే ప్రాజెక్టుకు రూ.20 కోట్లు కేటాయించారు. అసంపూర్తి పనులతోపాటు నిర్వహణ సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉంది. గుండ్రేవుల జలాశయంపై బడ్జెట్‌లో ఊసే లేకపోవడం రైతులను నిరాశకు గురి చేసింది.

రోడ్లను బాగు చేసేలా..

నంద్యాల జిల్లాలో దాదాపు 3300 కి.మీ ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని డోన్‌ నియోజకవర్గానికి మినహా ప్రత్యేకించి గతంలో ఎక్కడా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాలోని రోడ్లు అధ్వాన స్థితిని దాటిపోయాయి. వీటి గుండా ప్రయాణించాలంటే ప్రయాణీకులకు, వాహనదారులకు చుక్కలు కనిపించేవి. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్‌అండ్‌బీకి అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రూ.9554 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తే జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది.

యాంత్రీకరణకు ఊతం

ప్రస్తుత వ్యవసాయ విధానంలో యంత్రాల సాయం లేకుండా అన్నదాతలు వ్యవసాయం సాగించే పరిస్థితి లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం రైతులకు యంత్రాలు, పనిముట్లను రాయితీపై అందించేందుకు నిధులు కేటాయించింది. ఇదే విధానాన్ని వైసీపీ గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెడుతున్నామంటూ ప్రగల్భాలు పలికి మొదటి మూడు, నాలుగేళ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రవేశపెట్టిన పథక లబ్ధిని కూడా పూర్తిగా వైసీపీ నేతల అనుభవించారు. ట్రాక్టరు వంటి ముఖ్యమైన వాటిని వైసీపీ నేతలు ఇళ్లలోనే పెట్టుకుని సొంతానికి వాడుకున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతులను అవలంభించకుండా పూర్తిగా రైతులకు ఉపయోగపడేలా యంత్రాలను రాయితీపై ఇచ్చి, అందరికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోనుంది.

వర్సిటీ అభివృద్ధిని విస్మరించారు

జిల్లాలో మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నా వాటి అభివృద్ధిని ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్‌ విస్మరించారు. రాయలసీమ వర్సిటీ బోధన, బోధనేత సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులకు రూ.10.45 కోట్లు కేటాయించారు. దక్షిణ భారత దేశంలోనే తొలి క్లస్టర్‌ విశ్వవిద్యాలయానికి రూ.1.40 కోట్లు కేటాయించారు. అది కూడా జీతాలకు ఒక్కటే. జగన్నాథ గట్టుపై 54 ఎకరాల్లో నిర్మిస్తున్న క్లస్టర్‌ వర్సిటీ నూతన భవనానికి ఒక్క పైసా ఇవ్వలేదు. దీంతో నిర్మాణాలు అసంపూర్తిగా ఆగిపోక తప్పని పరిస్థితి. గత ఏడాది బడ్జెట్‌లో రూ.39 కోట్లు కేటాయిస్తే తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ జీరో పద్దు చూపించారు. ఉర్దూ విశ్వవిద్యాలయం సిబ్బంది జీతాలకు రూ.2.80 కోట్లు కేటాయిస్తే భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు ఇచ్చారు. ఓర్వకల్లు వద్ద గత టీడీపీ ప్రభుత్వంలో 110 ఎకరాల్లో నిర్మాణం చేపడితే.. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా వేయలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ రావడంతో ఉర్దూ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణం మొదలై వేగంగా పనులు చేపడతారని ఆశిస్తే అరకొర నిధులతో సరిపుచ్చారు. అయితే.. ఈ నిధులు నాలుగు నెలలకే అని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టే 2025-26 బడ్జెట్‌లో సముచిత స్థానం దక్కుతుందని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. స్టేట్‌ క్యాన్సర్‌ యూనిట్‌, కర్నూలు సర్వజన వైద్యశాల, బోధనాస్పత్రికి దాదాపుగా రూ.56 కోట్లు కేటాయించారని అధికారులు పేర్కొన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధులు కేటాయించలేదు

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్‌సిక్స్‌ పథకాలకు నిధుల కేటాయించలేదు. మద్యం, రిజిస్టేషన్‌ చార్జీలు పెంచడం, ప్రజలపై పన్నులు వేయడం ద్వారా నిధులు సేకరించాలనే ప్రతిపాదనలు చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ3000 ఇస్తామనే హామీకి తగిన నిధులు బడ్జెట్‌లో కేటాయించలేదు. తల్లికి వందనం పథకానికి రూ 12,480 కోట్లు అవసరమైతే కేవలం రూ 5300 కోట్లు మాత్రమే కేటాయించారు.

-రమేష్‌ కుమార్‌, సీసిఎం జిల్లా కార్యదర్శి, నంద్యాల

ఎన్నికల హామీలపై స్పష్టతలేని బడ్జెట్‌

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో బడ్జెట్‌లో కనీస ప్రస్తావన చేయకపోవడం బాధాకరం. దళితులు, మహిళలు, మైనార్టీల సంక్షేమానికి నామమాత్రంగా నిధులు కేటాయించడం చూస్తే ప్రభుత్వానికి వారి పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. గత ప్రభుత్వంపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

- డి.గౌస్‌ దేశాయ్‌,సీపీఎం జిల్లా కార్యదర్శి

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.4376కోట్లు కేటాయించారు. గతంలో మైనార్టీలకున్న పథకాలన్నింటినీ తిరిగి పునరుద్ధరించి అమలు చేయనున్నారు.

- మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌, ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

వేదవతి, గుండ్రేవుల పట్ల నిర్లక్ష్యం

వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దారుణం. జిల్లా ప్రజలను కూటమి ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యువత ఉద్యమాలకు సిద్ధం కావాలి.

- బి.గిడ్డయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌లో యువతకు అన్యాయం

రాష్ట్ర బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం యువతకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలు కల్పించడలో పూర్తిగా వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ ఆర్భాటంగా రూ.2 లక్షల కోట్లు ఉంటే అందులో యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు కేటాయించడం సిగ్గుచేటు.

- నక్కీ లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - Nov 12 , 2024 | 12:57 AM