తీర్పు ఇద్దాం.. పదండి
ABN , Publish Date - May 13 , 2024 | 12:20 AM
తీర్పు ఇద్దాం.. పదండి

నేడు పోలింగ్.. సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
ఓటు వేయనున్న 20.54 లక్షల ఓటర్లు
విధుల్లో 14,561 మంది సిబ్బంది
ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్
ప్రలోభాలకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులు
కర్నూలు, మే 12 (ఆంధ్రజ్యోతి): నేడు ఓటరు తీర్పు. ఇది ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన బతుకులు ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల పాలనకు అంకురార్పణ చేస్తాయి. కొత్త ప్రభుత్వాన్ని, కొత్త మన నాయకుడిని నిర్ణయిస్తాయి. స్వేచ్ఛ, సమానత్వం ఉండే ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణం చేస్తుంది! అందుకే ఓటేయడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు ఆదివారం నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్‌సీ) కేంద్రాల నుంచి బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. జిల్లాలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, నంద్యాల పార్లమెంట్ పరిధిలో పాణ్యం నియోజకవర్గం కలిపి 8 అసెంబ్లీ నియోజవర్గాలు, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. 20,54,563 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,204 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 14,561 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 3,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 338 ఉన్నాయి. ఆ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జి. కృష్ణకాంత్ తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టరు జి. సృజన పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అత్యధికంగా పాణ్యం నియోజకవర్గంలో 357, అత్యల్పంగా మంత్రాలయం నియోజకవర్గంలో 237 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవో, ఏపీవో ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున 1,400 ఓటర్లు ఉంటారు. కర్నూలు నియోజకవర్గం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్‌సీ) అవుట్ డోర్ స్టేడియం, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్‌సీ) కేంద్రాలు సిల్వర్ జుబ్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు జి.సృజన సందర్శించి సామగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గోనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్‌సీ) కేంద్రాల్లో ఆర్‌ఓల పర్యవేక్షణలో ఎన్నికల సామాగ్రి అందజేశారు. ఆ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
మహిళా ఓటర్లే: జిల్లాలో 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 10,13,794, మహిళలు 10,40,451 ఓటర్లు ఉన్నారు. నేటి తీర్పులో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. పురుషులతో పోలిస్తే 26,657 ఓటర్లు అధికంగా ఉన్నారు. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరులో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారు ఇచ్చే తీర్పు కీలకం కానుంది.
తొలిసారి ఓటు హక్కు
తొలిసారిగా 56,067 మంది యువత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కలెక్టరు డాక్టర్ జి. సృజన కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు బీఎల్‌ఓలను పంపి 10-19 ఏళ్లు వయసు కలిగిన యువతను ఓటర్లుగా నమోదు చేయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 6 వేల నుంచి 9 వేల వరకు యువ ఓటర్లు ఉన్నారు. దివ్యాంగులు 23,940 మంది ఉన్నారు.
ఈ రికార్డుల్లో ఏది ఉన్నా ఓకే: ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా, మిగతా 12 కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. అవి.. 1. ఆధార్ కార్డు, 2. ఉపాఽధి హామీ జాబ్ కార్డు, 3. పోస్టాఫీస్ లేదా బ్యాంకు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, 4. కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, 5. డ్రైవింగ్ లైసెన్స్, 6. పాన్ కార్డు, 7. ఆర్‌జీఐ ద్వారా జారీ చేసి స్మార్ట్ కార్డు, 8. ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్, 9. ఫొటో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం/ పీఎస్‌యూ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగ గుర్తింపు కార్డు, 10. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, 11. దివ్యాంగుల గుర్తింపు కార్డు, 12. ఇండియన్ పాస్ పోర్టు
పోలింగ్ ఏర్పాట్లు
నియోజకవర్గం బ్యాలెట్ కంట్రోలింగ్ వీవీ
యూనిట్స్ యూనిట్స్ ప్యాట్స్
కర్నూలు 606 309 325
పాణ్యం 425 425 456
పత్తికొండ 302 306 321
కోడుమూరు 325 328 346
ఎమ్మిగనూరు 320 325 347
మంత్రాలయం 281 281 300
ఆదోని 206 304 329
ఆలూరు 347 351 377
మొత్తం 2,912 2,629 2801