బియ్యం బ్లాక్ మార్కెట్‌కు..!
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:08 AM
ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో చౌక దుకాణాలు 1233, ఎండీయూ వాహనాలు 409, తెల్లరేషన్‌కార్డులు 6,76,209 ఉన్నాయి.
ఎండీయూ వాహనాల బరితెగింపు
జిల్లాలో పెట్రేగిపోతున్న రేషన్ మాఫియా
పేదలకు చిల్లర.. అక్రమార్కులకు
కోట్ల ఆదాయం
పేదలకు కిలో బియ్యం
రూ.10తో ఎర
గుట్టుచప్పుడు కాకుండా
మిల్లర్ల మాయాజాలం
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో చౌక దుకాణాలు 1233, ఎండీయూ వాహనాలు 409, తెల్లరేషన్‌కార్డులు 6,76,209 ఉన్నాయి. ప్రతి ఎండీయూ వాహనానికి నెలకు రూ.21వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందిస్తోంది. పేదలు రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం, ఇతర నిత్యావసరాలు తెచ్చుకోవడం కష్టమవుతుందంటూ గత వైసీపీ ప్రభుత్వం భారీ ఖర్చుతో ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రేషన్ బియ్యాన్ని ఇంటింటికి తీసుకువెళ్లి అందిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంది. అంతా అది నిజమేనని ప్రజలు సంతోషపడ్డారు. కానీ ఆ వాహనాలు ఆ వీదిలో ఏదో ఒక చివర ఆపేసి సైరన్ కొడితే లబ్ధిదారులే సంచులు, రేషన్ కార్డులు చేతపట్టుకుని వాహనాల దగ్గరకి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఎవరైనా ఇంట్లో లేకుంటే వారికి బియ్యం ఆ నెలకు అందే పరిస్థితి లేదు. వాహనం దగ్గరకు వచ్చిన కొంత మంది లబ్ధిదారులకు ఇచ్చామని అనిపించి మిగిలిన వాటిని నేరుగా నల్లబజారుకు తరలిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 20వ తేదీ లోపు తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కుటుంబ సభ్యులు ఎంత మంది ఉంటే అంత బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. రేషన్‌కార్డుదారులకు కిలో రూ.10 చొప్పున డబ్బులు ఎర వేస్తున్నారు రేషన్ అక్రమార్కులు. లబ్ధిదారుల దగ్గర బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.15లు కొని వాటిని పాలిష్ పట్టించి కిలో రూ.25 నుంచి రూ.30లకు వ్యాపారులకు అమ్ముతున్నారని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఎండీయూ వాహనాలు వచ్చాక రేషన్ బియ్యం తరలింపు తేలికవడంతో 60శాతం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. కిలో బియ్యం బహిరంగ మార్కెట్‌లో రూ.45 నుంచి రూ.55 వరకు ధర పలుకుతోంది. సాధారణ రకం బియ్యం అయితే రూ.35 నుంచి 40 వరకు ఉంది.
రైస్ మిల్లర్ల కీలక పాత్ర
రేషన్ పంపిణీలో ఎండీయూ వాహనాలు కీలకం. గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాలు ప్రవేశ పెట్టడానికి ముందు రేషన్ దుకాణాలు ఇళ్ల మద్య ఉండడం, వాటి దగ్గరకు సరుకులు దింపే లారీలు మినహా మరి ఇతర వాహనం వచ్చినా రేషన్ సరుకులు నల్లబజారుకు తరలిస్తున్నారని ఇట్టే పసిగట్టి చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం అందించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఏ అడ్డంకులు లేకుండా అధికారికంగానే రేషన్ బియ్యం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ అక్రమార్కులు, అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. బియ్యం, అక్రమ రవాణాలో కొందరు మిల్లర్లే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
గ్రామ స్థాయి నుంచే రేషన్ మాఫియా యథేచ్చగా సాగుతోంది. ప్రతి నెలా మొదటి తేదీలోపు సివిల్ సప్లైస్ గోదాముల ద్వారా నిర్దేశిత రేషన్ షాపులకు పీడీఎస్ బియ్యం సరఫరా అవుతోంది. అయితే స్టాక్‌ను ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తు న్నారనీ ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టిం చుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం పేదలకోసమని భారీగా ఖర్చు చేస్తుంటే.. దానిని రేషన్ మాఫియా తమకు ఆదాయం వనరుగా మార్చుకుంది. రేషన్ మాఫియా చేసే దందాను పోలీసులు, రెవెన్యూ అధికారులు అనేకసార్లు పట్టుకుని కేసులు నమోదు చేసినా, జరిమా నాలు విధించిన మళ్లీ అదే తరహా అక్రమ వ్యాపారానికి రేషన్ మాఫియా సిద్ధపడుతోంది.
Updated Date - Nov 20 , 2024 | 12:08 AM