స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు..!
ABN, Publish Date - Nov 27 , 2024 | 11:08 PM
‘రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీ స్థలం ఇచ్చే ప్రస్తకే లేదు. కాదు కూడదని బలవంతంగా ముందుకుపోతే ప్రత్యక్ష ఆందోళనకు ఏమాత్రం వెనుకాడబోం’ అని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మున్సిపల్ అధికారుల ప్రతిపాదనలపై మండిపాటు
మా నిర్ణయాన్ని కాదని ముందుకుపోతే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధం
హెచ్చరిస్తున్న జూనియర్ డాక్టర్లు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీ స్థలం ఇచ్చే ప్రస్తకే లేదు. కాదు కూడదని బలవంతంగా ముందుకుపోతే ప్రత్యక్ష ఆందోళనకు ఏమాత్రం వెనుకాడబోం’ అని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రవేశ ద్వారం కుడి వైపున ఉన్న దాదాపు ఎనిమిది సెంట్ల ఖాళీ స్థలాన్ని సోమవారం రెవెన్యూ అధికారులు సర్వే చేయడం, మంగళవారం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్థలాన్ని కేటాయించాలని ప్లాన్‌తో లెటర్ తీసుకొని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు అందజేయడం వంటివి తాజాగా అలజడి రేపాయి. కర్నూలు నగరంలో రోడ్డు విస్తరణకు నగర పాలక మున్సిపల్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. దీంతో మెడికల్ కాలేజీ ఆనుకొని ఉన్న ఎనిమిది షాపులను తొలగించి వస్తోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీ ఇన్‌గేట్, ఎగ్జిట్ గేట్‌ల మధ్య ఉన్న ఎనిమిది సెంట్ల స్థలాన్ని ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీనిపైనే మెడికల్ కాలేజీలో వివాదం నెలకొంది. ఈ ప్రతిపాదనలపై కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె.చిట్టినరసమ్మ వైద్యులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీలోని ఇన్‌గేట్ కుడివైపున ఉన్న ఖాళీ స్థలాన్ని షాపులకు ఇవ్వడం కుదరదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని వైద్యులు ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు.
2012లో రోడ్డు వెడల్పులో భాగంగా కర్నూలు జీజీహెచ్ నుంచి కర్నూలు మెడికల్ కాలేజీ వరకు కొంత స్థలాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆసుపత్రి మెడికల్ కాలేజీలోని కాంపౌండ్, పరిపాలన విభాగం భవనాలు, మైదానం మొదలుకొని దాదాపు పది అడుగుల మేర లోపలికి జరిగాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ఎగ్జిట్ గేట్, ఇన్‌గేట్‌ల మధ్య ఈ ఎనిమిది షాపులు ఉన్నాయి. ఆ షాపుల కారణంగా రహదారి ఇరుకుగా మారి నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఈ షాపులను తొలగించాల్సి ఉంది. ఇంతవరకు బాగానే ఉన్న తొలగించే షాపులకు ప్రత్నామ్నాయంగా మెడికల్ కాలేజీకి చెందిన ఎనిమిది సెంట్లను ఇవ్వాలన్న మున్సిపల్ అధికారుల ప్రతిపాదనలపైనే వైద్యులు, జూనియర్ డాక్టర్లు భగ్గుమంటున్నారు. గతంలో కాలేజీ స్థలాన్ని వదులుకున్నామని, ఇప్పుడు షాపుల కోసం స్థలాన్ని ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. గతంలోనే ఆసుపత్రి, కాలేజీ గ్రౌండ్ స్థలాన్ని వదులుకున్నామని, ఇప్పుడు షాపులకు మళ్లీ స్థలం ఇవ్వడం కుదరదని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఖాళీ స్థలాన్ని ఇచ్చేది లేదు
కర్నూలు మెడికల్ కాలేజీలోని ఇన్‌గేట్ కుడి వైపున ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ఖాళీ స్థలాన్ని షాపుల నిర్మాణానికి ఇచ్చేది లేదు. మున్సిపల్ అధికారులు ఖాళీ స్థలాన్ని షాపులకు ఇవ్వాలని ప్లానింగ్ లెటర్‌ను తీసుకు వచ్చారు. దీనిపై రిప్లయ్ లెటర్‌ను రాసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ఇప్పటికే కాలేజీ వద్ద ఇన్‌గేట్, అవుట్‌గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఇన్‌గేట్ పక్కన షాపులు కడితే ట్రాఫిక్ రద్దీ పెరిగి రాకపోకలకు, విద్యార్థులు, వైద్యులకు ఇబ్బందిగా మారుతుంది. ఖాళీ స్థలంలో ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల కోసం కామన్ రూమ్‌ను ఏర్పాటుకు స్థలం కేటాయించాం. ఆ స్థలాన్ని ఇతరులకు ఇవ్వడం కుదరని పని.
- డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ
కాలేజీ స్థలాన్ని ఎలా ఇస్తారు?
మెడికల్ కాలేజీలోని స్థలాన్ని షాపులకు ఎలా ఇస్తారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. కర్నూలు బోధనాసుపత్రి రాయలసీమలోనే అతి పెద్దది. ప్రతిరోజూ మూడు వేల మంది ఓపీకి వస్తుంటారు. 1250 మంది వైద్య విద్యర్థులు, 300 మందికి పైగా డాక్టర్లు పని చేస్తుంటారు. ఇంత పెద్దాసుపత్రికి వసతులు, సౌకర్యాల కోసం స్థలం ఎంతో అవసరం. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం విద్యార్థులకు భవనాలు, తరగతులు, కామన్ రూములు ఎంతో అవసరం. కాలేజీ అవసరాలకు రాకుండా బయటి షాపులకు స్థలాన్ని ఇస్తే వైద్యులు, జూనియర్ డాక్టర్లను కలుపుకుని ఉద్యమిస్తాం. కాలేజీని కాపాడుకుంటాం.
- డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, అధ్యక్షులు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం
సమ్మెలోకి వెళ్తాం
కాలేజీ స్థలాన్ని బయటి సంస్థలు, బయటి వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదు. ఇప్పటికే ఆసుపత్రి మెడికల్ కాలేజీ మెన్స్ హాస్టల్ రోడ్డు వెడల్పు పేరుతో చాలా స్థలాన్ని కోల్పోయాం. కాలేజీ ఇన్‌గేట్ దగ్గర ఉన్న ఖాళీ స్థలాన్ని షాపులకు ఇస్తే జూనియర్ డాక్టర్లందరూ విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తాం. ఆందోళనలు చేపడుతాం. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను కలిసి మా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించాం.
- డాక్టర్ జగదీష్, అధ్యక్షుడు, ఏపీ జూడాల సంఘం, కర్నూలు జీజీహెచ్
Updated Date - Nov 27 , 2024 | 11:08 PM