విద్యుత్ ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:08 AM
కూలీపని కోసం అరటి కాయలు మోసేందుకు వెళ్ళి అక్కడ జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మహానంది, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కూలీపని కోసం అరటి కాయలు మోసేందుకు వెళ్ళి అక్కడ జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం మహానంది మండలం అబ్బీపురంలో చోటు చేసుకొంది. మండలంలోని అబ్బీపురం గ్రామానికి చెందిన షేక్ నాగూర్ బాషా(43), కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలికి చెందిన బోయ రాఘవేంద్ర(46) ఆదివారం మరి కొందరు కూలీలతో కలసి మండలంలోని కృష్ణనంది సమీపంలోని అరటి గెలలను కోసేందుకు మినీ లారీలో వెళ్లారు. రాఘవేంద్ర మినీ లారీకి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గెలలను కోసి లారీలో లోడ్ చేశాక, మిగతా కూలీలు లారీ వెంట నడిచి రాగా నాగూర్‌బాషా లారీ డ్రైవింగ్ చేస్తుండగా రాఘవేంద్ర వాహనంలో బయల్దేరాడు. అబ్బీపురానికి కిలో మీటర్ దూరంలోని ఐదు మాన్ల చెట్ల రహదారిలో 11 కెవి విద్యుత్త్ కేబుల్ తగలడంతో లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ రాఘవేంద్ర, నాగూర్‌బాషా అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా కూలీలు సంఘటన స్ధలానికి చేరుకొని స్ధానికులకు సమాచారం అందించారు. మండల ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డి సంఘటన స్ధలా నికి చేరుకొని సిబ్బంది ద్వారా వివరాలను సేకరించారు. మహానంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
Updated Date - Nov 18 , 2024 | 12:08 AM