ఎవరి లెక్క వారిదే
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:08 AM
జిల్లాలోని కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల నియామకాల్లో గందరగోళం నెలకొంది
నోటిఫికేషన్‌లో 52.. జిల్లా అధికారులు భర్తీ చేస్తున్నది 49
ఆందోళనలో అభ్యర్థులు
కర్నూలు ఎడ్యుకేషన్, అక్టోబరు 19, (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల నియామకాల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర అధికారుల నోటిఫికేషన్‌లోని ఖాళీల సంఖ్యకు జిల్లా అధికారులు భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. నోటిఫికేషన్‌లో కేజీబీవీ, మోడల్ స్కూల్‌లో పీఈటీ పోస్టు ఒకటి, పీఆర్టీలు 14, టీజీటీలు 15, పార్ట్ టైమ్ టీచర్స్ 16, వార్డెన్ పోస్టులు 6 మొత్తం 52 ఖాళీలను ప్రకటించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు 1:20 ప్రకారం రోస్టర్ కం మెరిట్ తాత్కాలిక జాబితాను వెల్లడించారు. అయితే ఇందులో 49 పోస్టులను మాత్రమే జిల్లా సమగ్ర శిక్ష అధికారులు చూపిస్తున్నారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఖాళీల సంఖ్యకు జిల్లా స్థాయి అధికారులు చేపట్టిన నియామకాలకు పొంతన కుదరడం లేదు. నోటిఫికేషన్‌లో పీఈటీ పోస్టు ఒకటే ఉంది. ఇవి రెండు పోస్టులు ఉన్నట్లు అధికారులు చూపిస్తున్నారు. అలాగే పీఆర్‌టీ పోస్టులు 14 అని ప్రకటించారు. 16 పోస్టులు జిల్లా స్థాయిలో చూపిస్తున్నారు. నోటిఫికేషన్‌లో సోషల్ స్టడీస్, మ్యాథమాటిక్స్ పోస్టులను చూపించారు. అయితే ఈ పోస్టులకు నియామకాలను చేపట్టడం లేదు. నాన్‌టీచింగ్ కేటగిరి కింద ఏపీ మోడల్ స్కూల్‌లోని హాస్టళ్లలో 6 వార్డెన్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. మద్దికెర పాఠశాలల్లోని స్పెషల్ ఆఫీసర్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులందరినీ విఽధుల నుంచి తొలగించారు. అయితే వార్డెన్ తనను ఉద్యోగంలో కొనసాగించాలని కలెక్టర్‌ను వేడుకొని అనుమతి పొందారు. ఈ వార్డెన్ పోస్టును కూడా ఖాళీలలో చూపించారు. ఈ పోస్టును తిరిగి భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో చూపించడంతో ఈ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరులో కేజీబీవీలో పని చేస్తున్న స్పెషల్ ఆఫీసర్‌ను తొలగించారు. బాధితురాలు కోర్టును ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వు తెచ్చుకున్నారు. అయినా ఈ పోస్టు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో చూపించారు. జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నదీ కింది స్థాయి అధికారుల నుంచి సమాచారం తెలుసుకోకుండా రాష్ట్ర అధికారులు నోటిఫికేషన్‌లో 52 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడంతో ఈ గందళగోళం ఏర్పడిందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఈ స్థితిపై అభ్యర్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పరిశీలనకు నేటి వరకు గడువు
కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూళ్లలో ఉద్యోగాల నియామకాల కోసం అభ్యర్థుల సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలనకు ఆదివారం చివరిరోజు. జిల్లాలో మొత్తం 49 పోస్టులకు గాను 1953 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష ఏపీసీ శామ్యుల్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. పలువురు అభ్యర్థులు తమకు జరిగిన పొరపాట్లను వివరించారు. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు అభ్యర్థులకు వివరించారు. ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా జరగడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated Date - Oct 20 , 2024 | 12:08 AM