రెండ్రోజుల్లో సరిచేద్దాం!
ABN, Publish Date - Apr 13 , 2024 | 04:59 AM
రాష్ట్రం లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పరస్పర మార్పును రెండ్రోజుల్లో కొలిక్కి తేవాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి....
సీట్ల మార్పుపై ఎన్డీయే పక్షాల నిర్ణయం
చంద్రబాబు నివాసంలో భేటీ
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పరస్పర మార్పును రెండ్రోజుల్లో కొలిక్కి తేవాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, అధికార పక్షం కుట్రలు ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించాయి. 25 లోక్‌సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యం కావాలని పేర్కొన్నాయి. శుక్రవారమిక్కడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అరుణ్ సింగ్, సహ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ రెండు గంటల పాటు చర్చించారు. పలు చోట్ల సీట్లు మార్చాలని బీజేపీ నేతలు ప్రస్తావించగా.. అలా మారుస్తూ పోతే గందరగోళానికి దారి తీస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అనపర్తి స్థానాన్ని తాము తీసుకుని బీజేపీకి తంబళ్లపల్లె ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఉంగుటూరు ఇవ్వాలని ఆ పార్టీ కోరగా.. ఆ సీటు జనసేనకు కేటాయించామని.. అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ఉన్నారని బాబు బదులిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరికి ఎక్కడో చో ట అవకాశం కల్పించాలని పురందేశ్వరి కోరగా.. అందుకు పవన్ అంగీకరించలేదని తెలిసింది. ఇప్పటికే పవన్ ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలు త్యాగం చేశారని.. ఇక జనసేన సీట్ల విషయంలో మార్పులు వద్దని చంద్రబాబు అన్నారు. ఉండి సీటు మార్చేందుకు టీడీపీ సిద్ధమైనందున ఆ సీటు తమకివ్వాలని బీజేపీ నేత లు అడిగారు. అక్కడి టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే రామరాజును మార్చే ఉద్దేశం తనకు లేనప్పటికీ.. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని రఘురామకృష్ణంరాజుకు మీరు ఇవ్వనందున అలా సర్దుబాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని చంద్రబాబు వివరించారు. నరసాపురం పార్లమెంటు సీటు రఘురామరాజుకు కేటాయిస్తే.. ఇప్పటికే మీరక్కడ ప్రకటించిన అభ్యర్థి శ్రీనివాస వర్మ కోసం ఉండి స్థానం కేటాయించడం సమ్మతమేనన్నారు. లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థిని మా ర్చాలంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు బదులిచ్చారు. అనపర్తి వెనక్కి తీసుకుని ఉండి స్థానం ఇచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా కాకపోతే ఉండిలో రఘురామరాజును నిలిపి అనపర్తి స్థానానికి ప్రత్యామ్నాయంగా బీజేపీకి తంబళ్లపల్లె కేటాయిస్తామని చెప్పారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రెండ్రోజుల్లో సీట్ల సర్దుబాటు అంశాన్ని కొలిక్తి తెచ్చేద్దామని బీజేపీ నేతలు తెలిపారు. అసంతృప్తులు ఉన్నచోట తొందరగా సర్దుబాటు చేయాలని కూటమి నేతలు నిర్ణయానికి వచ్చారు. ఉభయ గోదావరి జిల్లా ల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలకు ప్రజా స్పందన బాగుందని ఇలాగే వీలైనన్ని సభలు కొనసాగించాలని, బీజేపీ నేతలు వీలైనంత ఎక్కువ మంది పాల్గొంటే మంచిదని బాబు సూచించారు. పురందేశ్వరి స్పందిస్తూ.. ‘కూటమి తరఫున ఢిల్లీ పెద్దలతో మాట్లాడితే ప్రధాని మోదీతో పాటు ఇతర ముఖ్య నేతలైన రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు పాల్గొంటారు’ అని తెలిపారు. ఈ నెల 16న విజయనగరం సభకు బీజేపీ అగ్రనేతల్లో ఒకరిని రప్పించాలని నిర్ణయించారు. అధికార వైసీపీకి వత్తాసు పలుకుతూ, అక్రమాలకు సహకరించిన కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవడం కూటమి కేడర్లో మనోధైర్యాన్ని పెంచిందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇంత జరిగినా ఇంకా కొందరు అధికారులు ఏకపక్ష వైఖరి అవలంబిస్తున్నారని నేతలు పేర్కొన్నారు.
16, 17 తేదీల్లో విజయనగరం, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలు
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి సభలు మళ్లీ రెండు రోజులు జరగనున్నాయి. 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో, 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఇవి జరుగుతాయని టీడీపీ వర్గాలు వివరించాయి. దీని కొనసాగింపుగా మరి కొన్నిచోట్ల కూడా ఇవి జరిగే అవకాశం ఉందని చెప్పాయి. ప్రజా గళం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలు శుక్రవారం నాటికి 31 పూర్తయ్యాయి. 13వ తేదీ శనివారం ఆయన గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల సభల్లో పాల్గొననున్నారు. 14వ తేదీ, ఆదివారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, చోడవరం, గాజువాక నియోజకవర్గాల్లో, 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, పలాస, టెక్కలిలో ఆయన పర్యటిస్తారు.
Updated Date - Apr 13 , 2024 | 04:59 AM