నేడు అల్పపీడనం
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:10 AM
బంగాళాఖాతంలో సోమవారం మరో అల్ప పీడనం ఏర్పడనుంది. బుధవారం నాటికి అది తుఫానుగా బలపడే అవకాశం ఉంది.
రేపు వాయుగుండం,
ఎల్లుండి తుఫాన్‌గా బలపడే చాన్స్
24న ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే చాన్స్
గురువారం నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
ఒడిశా, బెంగాల్‌ను అప్రమత్తం చేసిన ఐఎండీ
చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో సోమవారం మరో అల్ప పీడనం ఏర్పడనుంది. బుధవారం నాటికి అది తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ తుఫాన్‌పై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నాలుగు రోజుల ముందే ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆదివారం తుఫాన్‌పై ప్రీవాచ్ బులెటిన్ విడుదల చేసింది.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తూర్పుమధ్య బంగాళాఖాతంలోనే 22వ తేదీకి వాయుగుండంగా, 23 నాటికి తుఫాన్‌గా బలపడనుంది. తర్వాత వాయవ్యంగా పయనించి 24 నాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం దిశగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అత్యధిక మోడళ్ల మేరకు తుఫాన్ బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఈనెల 25న ఒడిశాలోని గోపాలపూర్, పూరి మధ్య లేదా.. గోపాలపూర్, జగత్సింగ్‌పూర్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన నోవా సంస్థ మాత్రం 25న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. ఈనెల 23న ఏర్పడనున్న తుఫాన్‌కు ఖతర్ సూచించిన పేరు ‘దానా’ (డీఏఎన్‌ఏ) పెట్టనున్నారు.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
ఇదిలావుండగా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక బులెటిన్ మేరకు ఉత్తరాంధ్రలో ఈనెల 23 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కాగా.. కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఈ నెల 24వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదివారం హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Updated Date - Oct 21 , 2024 | 07:09 AM