భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ
ABN, Publish Date - Jun 19 , 2024 | 06:28 AM
గతేడాది 36 ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్ ఎగువ దశను తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయం సాధించింది.
సురక్షితంగా హిందూ మహాసముద్రంలో పడేసిన ఇస్రో
సూళ్లూరుపేట, జూన్ 18: గతేడాది 36 ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్ ఎగువ దశను తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయం సాధించింది. గతేడాది మార్చి 26న షార్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్ ద్వారా వన్ వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు అంతరిక్షంలో తిరుగుతున్నాయి.
అయితే.. ఈ ఉపగ్రహాలను మోసుకువెళ్లిన ఎల్‌వీఎం ఎగువ క్రయోజనిక్ దశ పరికరం కూడా వీటితో పాటే పరిభ్రమిస్తోంది. అంతరిక్షంలో వ్యర్ధాల ముప్పు పెరుగుతుండడంతో కాలపరిమితి ముగిసిన ఉపగ్రహాలు, ఇతర ప్రయోగ పరికరాలను తక్కువ కక్ష్యలోకి చేర్చాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎల్‌వీఎం-3 ఎగువ దశను బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తూ, ఇందులోని ఇంధనాన్ని పూర్తిగా తొలగించి భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఆ వ్యర్థాలను సురక్షితంగా హిందూ మహా సముద్రంలో పడేలా చేశారు. ఈ ప్రక్రియను శ్రీహరికోటలోని మల్టీ-ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ (ఎంవోటీఆర్) ట్రాక్ చేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
Updated Date - Jun 19 , 2024 | 08:56 AM