సంప్రోక్షణ చేయండి
ABN, Publish Date - Sep 21 , 2024 | 04:27 AM
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన మాట వాస్తవమని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
కల్తీ నెయ్యితో ఘోర అపచారం
శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశం
మంత్రులు, సీఎ్‌సతో అత్యవసర భేటీ
ఈవోతో రెండుసార్లు టెలికాన్ఫరెన్స్
గత ప్రభుత్వ తప్పిదాలపై నివేదిక కోరిన బాబు
భక్తుల విశ్వాసాన్ని కాపాడతామని హామీ
అమరావతి/ఒంగోలు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన మాట వాస్తవమని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కిలో రూ.320కే ఇస్తున్నారని కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. దీనిలో జంతువులు, వెజిటబుల్ కొవ్వు వంటివి వాడారని తెలిపారు. ఇప్పుడు ఆ విషయం ఆధారాలతో సహా వెలుగు చూశాక.. బుకాయిస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు నెయ్యి కిలో రూ.500 ఉంటే రూ.320కే ఇస్తామంటే ఎలా నమ్మారని నిలదీశారు. వైసీపీ హయాంలో తిరుమ ల నిత్యాన్న ప్రసాదం బాగాలేదని, లడ్డూ ప్రసాదం బాగోలేదని భక్తులు మొత్తుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కారణంగానే తిరుమలకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఆయన మాట్లాడారు.
అధికారులకు దిశానిర్దేశం
తిరుమల పవిత్రతను పునరుద్ధరించే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ అధికారులతో శుక్రవారం ఆయన రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి ముందు.. గత వైసీపీ హయాం లో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చం ద్రబాబు సచివాలయంలో ఉన్న త స్థాయి సమీక్ష నిర్వహించా రు. అందుబాటులో ఉన్న మం త్రులను పిలిచి ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. అత్యం త పవిత్రమైన లడ్డూ అపవిత్రం కావడాన్ని అత్యంత తీ వ్రంగా పరిగణించారు. లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయిందని భావించిన సీఎం క్షేత్రాన్ని పవిత్రం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో తొలుత లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని ఆదేశించారు. దీనికిగాను వైదిక, ఆగమ శాస్త్ర పద్ధతులను ఆచరించాలని సూచించారు. లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై శుక్రవారం సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును సీఎం ఆదేశించారు. కాగా, తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధివిధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈవో శ్యామలరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా వైదిక, ఆగమ శాస్త్ర పండితులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
Updated Date - Sep 21 , 2024 | 04:27 AM