భూములతో బంతాట
ABN, Publish Date - May 08 , 2024 | 05:22 AM
2019లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ఆమోదించడం దగ్గరి నుంచి... తాజాగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి సంతకాలు అవసరంలేదని ప్రతిపాదించడం దాకా!
భూములు, స్థిరాస్తులను ఏం చేయాలనుకుంటున్నారు?
జగన్ సర్కారు నిర్ణయాలపై అనేక సందేహాలు
రైతుల భూమి పత్రాలపై జగన్ పేరు ఎందుకు?
‘టైటిలింగ్’ యాక్ట్‌తో లిటిగెంట్లకు ఊతమివ్వడమేగా!
ఒరిజినల్ పత్రాలు కాదని, జిరాక్స్‌లు ఇవ్వడమేంటి?
రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు అక్కర్లేదా?
‘ఒక్కసారి’కే అనేక తలతిక్క, వివాదాస్పద నిర్ణయాలు
మరోసారి చాన్స్ ఇస్తే ‘ఈ బిడ్డ’ ఏం చేస్తాడో!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
2019లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ఆమోదించడం దగ్గరి నుంచి... తాజాగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి సంతకాలు అవసరంలేదని ప్రతిపాదించడం దాకా! భూములు, ప్రజల స్థిరాస్తులకు సంబంధించి జగన్ సర్కారు తీసుకున్న చర్యలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘ఇంకెవడైనా వచ్చి నాది అంటే, మీ భూమి మీది కాదు!’ అనేలా టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. ప్రభుత్వం నియమించే అధికారి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించారు. ‘బాస్... ఇది నా భూమే! ఇవిగో ఒరిజినల్ పత్రాలు’ అని చూపిద్దామనుకుంటే, రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని, జిరాక్స్‌లు ఇచ్చే పద్ధతి రుద్దుతున్నారు. ‘ఫలానా వాళ్లు సాక్షి సంతకం చేశారు! వాళ్లనే అడుగుదాం పదండి’ అని గట్టిగా నిలదీద్దామనుకుంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు కూడా అక్కర్లేదని, వాళ్లనూ లేపేస్తున్నారు. అన్నింటికీ మించి పట్టాదారు పాస్ పుస్తకాలపై ‘జగనన్న’ చిత్రాలు! ఎందుకిదంతా? భూములను ఏం చేద్దామనుకుని ఇలాంటి నిర్ణయాలు
తీసుకుంటున్నారు? ‘మీ బిడ్డ... మీ బిడ్డ’ అనే జగన్... ‘మీ బిడ్డకు మీ భూములు ఇవ్వరా?’’ అని అడగాలనుకుంటున్నారా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు.
ఒక్క చాన్స్‌తోనే ఇలా... మళ్లీ వస్తే ఎలా?
భూములు, స్థిరాస్తులకు సంబంధించి జగన్ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అసలు హక్కుదారులకు హాని జరిగేలా... లిటిగెంట్లు, కబ్జాదారులకు మేలు చేసేలాగానే ఈ నిర్ణయాలున్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అమలుపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. వివాదాస్పదమైన ఈ చట్టంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో విషయం అక్కడితో ఆగింది.
ఇక... ఆస్తి ఒరిజనల్ పత్రాలు కాకుండా జిరాక్స్ ఇచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధంచేశారు. ఇక... రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులను తప్పించే దిశగా అధికారుల స్థాయిలో ఆదేశాలు సిద్ధమయ్యాయి.
పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటోలు పడుతూనే ఉన్నాయి. ‘ఒక్క చాన్స్’ ఇచ్చినందుకే పరిస్థితి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. ఇక రెండో చాన్స్ ఇస్తే... ఈ వివాదాస్పద నిర్ణయాలన్నీ పూర్తిస్థాయిలో అమలుచేసి, జనం భూములు చుట్టేసి, బంతాట ఆడటం ఖాయమని సామాన్య రైతులు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిప్పుతో చెలగాటం...
రైతులకు భూమి కేవలం ఒక ఆస్తి కాదు! అది వారి భావోద్వేగం! అలాంటి భూములతోనే జగన్ ఆటాడుకుంటుండటం గమనార్హం. ఇప్పటిదాకా ప్రభుత్వ భూములను తెగనమ్మాలనుకున్నారు. అదివీలుకాకపోవడంతో బ్యాంకులకు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారు. సముద్రతీరం వెంట ఉన్న భూములకు సర్వే నంబర్లు ఇచ్చి మరీ వాటిని ప్రైవేటు కంపెనీలు, టూరిజం హబ్‌లకు ఇచ్చేశారు.
ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై అప్పులు తీసుకొచ్చారు. ఇక మిగిలింది ప్రజల భూములు, ఆస్తులే. టైటిల్ చట్టం ద్వారా ప్రజల సాగు భూములు, ఆస్తులను కూడా తాకట్టుపెడతారా? అందుకే ప్రతీ భూమి పట్టాపై జగన్ తన పేరు, ఫొటో వేసుకున్నారా? రాష్ట్రంలో 1.35కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 3,40,23,510.19 ఎకరాల భూమి ఉంది.
ఇదంతా ప్రైవేటు భూమే. ఇక ప్రజల ఇంటిస్ధలాలు, ఇతర ఆస్తులు అదనం. 3.40కోట్ల ఎకరాల భూమి విలువ కొన్ని రూ.లక్షల కోట్లు ఉంటుంది.
ఆ విలువను అమాంతం పెంచేసి బ్యాంకుల దగ్గర తాకట్టుపెట్టి గంపగుత్తగా అప్పులు తెచ్చే ఆలోచన ఏమైనా జగన్‌కు ఉందా? లేకుంటే ఇన్ని చిత్రవిచిత్ర విన్యాసాలు ఎందుకు చేస్తున్నట్లు?
ఈ అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది కూడా ప్రభుత్వమే! భూముల రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్స్ ప్రభుత్వం వద్దే ఉంచుకుంటామని కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదో ఆందోళనకరమైన అంశం. ఇక, టైటిల్ చట్టం ద్వారా కార్పొరేట్ తరహాలో ల్యాండ్ అఽథారిటీని ఏర్పాటు చేస్తామని చట్టంలోనే పొందుపరిచారు. ఇక దీని పనల్లా ఫక్తు వ్యాపారం చేయడమే అని తెలుస్తోంది.
ఎవరి భూమిపై ఎవరి చిత్రాలు?
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తక చట్టం-1971(ఆర్‌వోఆర్) ప్రకారం ఇచ్చే పాసుపుస్తకాలపై రైతు ఫొటో మాత్రమే ఉండాలి. అదికూడా తహసిల్దార్ సీల్‌తో ఉండాలి. కవర్‌పేజీ, చివరిపేజీ, లోపలి పేజీల్లో ఏ ఒక్కరి ఫొటో కూడా ఉండటానికి వీల్లేకుండా చాలా శాస్త్రీయంగా డిజైన్ చేశారు. కానీ, టైటిల్‌చట్టం కింద ఇచ్చే శాశ్వత భూ హక్కుపత్రాలపై జగన్ వంశవృక్షం కనిపించేలా డిజైన్ చేశారు. వైఎ్‌సఆర్ అంటే ఇద్దరి పేర్లు ఉన్నాయి. జగన్ తాత రాజారెడ్డిని వైఎ్‌సఆర్ అనే అంటారు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డిని కూడా వైఎ్‌సఆర్ అనే అంటారు.
ఇలా భూ హక్కుపత్రంలో తొలుత వైఎ్‌సఆర్, ఆ తర్వాత జగనన్న అని పేరుపెట్టుకున్నారు. ఇలా వైఎ్‌సఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, మరియు భూ రక్షపథకం అని పేరుపెట్టారు. ఇది సరిపోదనుకొని, హక్కు పత్రానికి జగనన్న భూ హక్కుపత్రంగా తన పేరు కనిపించేలా డిజైన్ చేశారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ దేశం, రాష్ట్రం కూడా ఇలాంటి పనిచేయలేదు.
ఎందుకీ ఆంక్షలు?
టైటిల్ చట్టం ప్రకారం భూ వివాదాలు వస్తే కోర్టులకు వెళ్లకూడదు. సివిల్ కోర్టులు జోక్యం చేసుకోకూడదని నిషేధం విధించారు. మరి బాధితులు ఎవరి వద్దకు వెళ్లాలి? వారికి సత్వర న్యాయం దక్కేదెలా? టైటిల్ చట్టంలో పేర్కొన్నట్లుగా ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిల్ అప్పిలేట్ అధికారి వద్దకు వెళ్లమని ప్రభుత్వం చెబుతోంది. వారు ప్రభుత్వం నియమించే అధికారులే కదా! ఆర్డీవో, డీఆర్‌వో నియామకాల్లో ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ప్రజలకు తెలిసిపోయింది. అస్మదీయులు, సొంత మనుషులనే ఏరికోరి ఆర్డీవోలుగా నియమిస్తున్నారు.
అనేకమంది ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. అధికారనేతలు చెప్పారని ప్రభుత్వ, దేవదాయ, ఇనాం భూములను సైతం ప్రైవేటుకు రాసిచ్చారు. ఇటీవలే ఈ బాగోతాలు బయటపడ్డాయి. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి గా మీరు నియమించే డిప్యూటీ కలెక్టరే ఉంటారు.
టైటిల్ అప్పిలేట్ అధికారిగా మీరు నియమించే రిటైర్డ్ ఐఏఎస్ ఉంటా రు. వారు ప్రభుత్వ మనుషులే కదా. వారు అధికార పార్టీ నేత లు చెప్పినట్లు వింటారు తప్ప రైతుల గోడు పట్టించుకుంటా రా? రైతుల వేదనను అర్ధం చే సుకుంటారా? రైతులను సివిల్ కోర్టులకు వెళ్లనివ్వకుండా, మీరు నియమించే సొంత మనుషుల కాళ్లు పట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారా? దీంతో మీరు ఏం సాధిద్దామనుకుంటున్నారు?
Updated Date - May 08 , 2024 | 05:22 AM