Nimmala Ramanaidu : పోలవరం ఎత్తు తగ్గదు!
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:59 AM
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచనే టీడీపీ కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
45.72 మీటర్ల కాంటూరులోనే నిర్మాణం: నిమ్మల
రెండు దశలంటూ ఎత్తు 41.15 మీటర్లకు కుదించిన ఘనుడు జగనే
నీటి నిల్వపై ఏమాత్రం రాజీపడం.. 150 అడుగుల మేర నిల్వ చేస్తాం
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచనే టీడీపీ కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 45.72 మీటర్ల కాంటూరు(ఎత్తు)లోనే నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు ఎత్తుపై గానీ.. నీటి నిల్వపై గానీ తమ సర్కారు ఎంతమాత్రం రాజీపడదన్నారు. 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసి.. నదులను అనుసంధానిస్తామన్నారు. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనుడు జగన్మోహన్‌రెడ్డేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దిశగా పీపీఏతో పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారంటూ సంబంధిత డాక్యుమెంట్లు, లేఖలను మీడియాకు చూపించారు. లేఖల్లో ఫేజ్-1, ఫేజ్-2 అని పేర్కొన్నారని తెలిపారు. 41.15మీటర్ల ఎత్తులో మొదటి దశ పూర్తికి రూ.10,911 కోట్లు ఇవ్వాలని పీపీఏ సీఈవోను జగన్ కోరడం నిజం కాదా అని నిలదీశారు. జగన్ వచ్చాకే 41.15 మీటర్ల కాంటూరును తెరపైకి తెచ్చారని తెలిపారు. ఆయన తప్పిదాల వల్ల 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటీ-హైదరాబాద్ నిపుణులు వెల్లడించారని చెప్పారు.
అప్పుడు తగ్గించేసి.. ఇప్పుడు పెడబొబ్బలా?
పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 196.40 టీఎంసీలు (నీటి మట్టం 150 అడుగులు).. 45.72 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 2019లో జగన్ సీఎం అయిన నాటి నుంచి పరిస్థితి మారింది. ఎత్తు ఒక్కసారిగా 41.15 మీటర్లకు తగ్గిపోయింది. దశలవారీగా ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులో 115 టీఎంసీలు నిల్వ చేస్తామని.. రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తున 196.40 టీఎంసీలను నిల్వ చేస్తామని చెప్పడం మొదలుపెట్టారు. ఐదేళ్లూ అదే చేశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే పోలవరం నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలు ప్రచురించింది. ఇది రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఎత్తు ఒకడుగు కూడా తగ్గదని అసెంబ్లీలో జగన్ చెప్పారు. కానీ 45.72 మీటర్ల కాంటూరులో 196.4 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం మేరకు భూసేకరణ చేపడతామన్న హామీ ఇవ్వలేదు. ప్రధాని మోదీకి రాసిన లేఖలోనూ తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు అవసరమయ్యే రూ.12,567 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇప్పుడు అధికారం కోల్పోయి గద్దెదిగాక.. పోలవరం ఎత్తును చంద్రబాబు తగ్గించేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. అదేమీ లేదని మంత్రి నిమ్మల అసలు వాస్తవాలు చెప్పడంతో జగన్ సహా వైసీపీ నేతలెవరూ కిమ్మనడం లేదు.
హెడ్‌వర్క్స్ అంచనా 11,214 కోట్లు పోలవరంపై జలవనరుల శాఖ ఉత్తర్వులు
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం రూ.11,214.78 కోట్లుగా జల వనరుల శాఖ నిర్ధారించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం గ్యాప్ 1, 2, కాంక్రీట్ డ్యాం గ్యాప్-3, కాఫర్ డ్యాం, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం కోసం క్రస్ట్ లెవెల్ వరకూ పునాదులు, స్పిల్‌వే నిర్మాణం, ఇన్‌టేక్ స్ట్రక్చర్లు, టెయిల్ పాండ్, టెయిల్ రేస్ చానల్, పవర్ హౌస్ అప్రోచ్ చానల్ వంటి నిర్మాణాలకు ఈ మొత్తం ఖర్చవుతుందని పేర్కొన్నారు.
Updated Date - Oct 31 , 2024 | 04:59 AM