నా గెలుపు ఖాయం
ABN, Publish Date - Apr 23 , 2024 | 04:48 AM
రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ మాజీ సభ్యుడు,
జగన్‌ను గద్దె దించాలని జనంలో కసి: సీఎం రమేశ్
మోదీ ఆదేశాలతోనే అనకాపల్లి బరిలో.. నా నడవడిక చూసి సీటిచ్చారు
గెలుపు అవకాశాలను బీజేపీ పెద్దలకు వివరించే టికెట్ తెచ్చుకున్నా
ఆ ఎలక్టోరల్ బాండ్స్‌తో నాకు సంబంధం లేదు
చిరంజీవి, నేను ఒకేసారి రాజ్యసభకు.. అప్పటి నుంచి సాన్నిహిత్యం
అవినాశ్‌రెడ్డి అరెస్టు ఖాయం.. అన్ని ఆధారాలూ ఉన్నాయి
జగన్‌కు, భారతికీ ప్రమేయం ఉందని ప్రజలకు తెలుసు
ఈ సీఎం అవినీతి, అక్రమాలు మోదీ, అమిత్ షాలకూ తెలుసు
ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు లేని లోటు తీరుస్తా.. ‘బిగ్ డిబేట్’లో రమేశ్
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ బిగ్ డిబేట్‌లో సీఎం రమేశ్
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ప్రజలు మరిచిపోవడానికి వంద రోజులు పట్టింది. కానీ ఆంధ్రలో ఎన్నికల తర్వాత 100 గంటల్లో వైసీపీ కనిపించకుండా పోతుంది.
జగన్ బీజేపీ భుజాన తుపాకీ పెట్టి తప్పులు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి తప్పకుండా అరెస్టవుతాడు. అన్ని ఆధారాలూ ఉన్నాయి.
- సీఎం రమేశ్
అనకాపల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, అనకాపల్లి లోక్‌సభ స్థానంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ అన్నారు. తన విజయం ఖాయమని.. రాష్ట్రంలో జగన్‌ను సాగనంపాలని జనం కసితో ఉన్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తాను ఐదేళ్ల కిందట బీజేపీలో చేరానని.. తన పనితీరు, నడవడిక చూసి మోదీ ఆదేశిస్తేనే అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. సోమవారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్ డిబేట్’లో రమేశ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు.
ఆ వివరాలు..
ఆర్కే: మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. టెన్షన్‌గా ఉందా?
సీఎం రమేశ్: నాకెందుకు టెన్షన్! నాకు 30 ఏళ్ల వయసు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. చిత్తూరు ఎంపీ సీటు జనరల్ కేటగిరీలో ఉన్నప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు యత్నించాను. చివరి క్షణాల్లో సామాజికవర్గ సమీకరణల్లో ఆదికేశవులునాయుడికి అవకాశం లభించింది. నా కోర్కె ఇన్నాళ్లకు తీరింది. బీజేపీ ఎటువంటి సామాజిక సమీకరణలపై ఆలోచన చేయకుండానే నాకు అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించింది.
ఈ సీటు కోసం బీజేపీని ఎలా మాయ చేయగలిగారు?
మీరు మాయ అంటున్నారు. కానీ అధిష్ఠానానికి నా గెలుపు అవకాశాలను వివరించి సీటు తెచ్చుకోగలిగాను. బీజేపీలో సీటు కోసం ఎవరినీ మేనేజ్ చేయలేం. ఐదేళ్ల కిందటే పార్టీలో చేరాను. అదృష్టవశాత్తూ పార్లమెంటులో నా శక్తిసామర్థ్యాలు, పనితీరును అమిత్‌షా చూశారు. టీడీపీలో చంద్రబాబుకు ఎంత దగ్గరగా ఉన్నానో, బీజేపీలో కూడా నెల రోజుల వ్యవధిలోనే మోదీ, అమిత్‌షా వంటి నేతలతో సాన్నిహిత్యం పెంచుకోగలిగాను. రమేశ్‌కు ఏ పని అప్పగించినా సమర్థంగా చేయగలడనే గుర్తింపు పొందగలిగాను. దేశంలో చాలామంది నేతలకు మోదీ, షా వద్దకు వెళ్లాలంటే సాధ్యం కాదు. కానీ నాకు ఆ ఇబ్బంది లేదు. దేవుడి దయతో బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు నెరపగలుగుతున్నాను. తెలంగాణ కాంగ్రె్‌సతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. రేవంత్‌రెడ్డి, నేను టీడీపీలో సుదీర్ఘకాలం కలిసి పనిచేశాం. స్నేహం వేరు, రాజకీయాలు వేరు. నాకు అన్ని పార్టీల్లో స్నేహితులున్నారు. ఎలక్టొరల్ బాండ్స్ కాంగ్రె్‌సకు ఇవ్వలేదు. ఆ బాండ్స్‌కు, నాకు ఎటువంటి సంబంధం లేదు. జగన్ పత్రిక తప్పుడు ప్రచారం చేసింది. నాకు చెందిన కంపెనీని 15 సంవత్సరాల కిందటే వదిలేశాను. రాజకీయాల్లోకి వచ్చాక కంపెనీలో జరిగే లావాదేవీలతో నాకు సంబంధం ఉండదు. ఖర్చులకంటారా.. అద్దెల రూపంలో నాకు, నా భార్యకు నెలకు రూ.25-30 లక్షల వరకు ఆదాయం వస్తుంది. రాజ్యసభ సభ్యుడిగా జీతం కూడా వస్తుంది.
చిరంజీవి మద్దతు ఎలా పొందగలిగారు..?
నేను, చిరంజీవి ఒకేసారి రాజ్యసభకు ఎన్నికయ్యాం. అప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంలో ఢిల్లీలో అమిత్‌షా చేతులమీదుగా రామ్‌చరణ్‌కు శాలువా కప్పి సన్మానం చేశాం. ఆ సందర్భంలో చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వద్దకు నేనే వెళ్లి అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పాను. అంతే.. ఆయన నా గురించి మాట్లాడుతూ నన్ను గెలిపించాలని కోరారు. కూటమిని రాష్ట్రంలో గెలిపించాలని కూడా కోరారు. చిరంజీవి నా గురించి ఇచ్చిన సందేశాన్ని యూట్యూబ్‌లో లక్షల మంది చూశారు. వైసీపీ వాళ్లు ఆయన్ను కూడా విమర్శిస్తున్నారు. గాంధీమహాత్ముడు సందేశం ఇచ్చినా వాళ్లు విమర్శిస్తారు.
అనకాపల్లి కొత్త ప్రాంతం, మీరు కొత్త వ్యక్తి.
అక్కడ రాజకీయాలు ఎలా చేస్తున్నారు..?
శాసనసభకు స్థానికుడు, పార్లమెంటుకు పరిచయాలు, పలుకుబడి కావాలి. నేను ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో పాటు దేశంలో అందరికీ తెలుసు. జగన్‌తో కాకుండా నాకున్న పరిచయాలతో దేశంలో ఏ రాష్ట్ర సీఎంతోనైనా నేను డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడగలను. ఏదైనా సాధించగలననే నమ్మకం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా మొట్టమొదట మన అనకాపల్లికే వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. కేంద్రంలో నాకున్న పరిచయాలు వారికి తెలుసు. జగన్ జాబ్ కేలెండర్ అని చెప్పి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. నేను ఎంపీ అయితే ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నమ్ముతున్నారు.
బీజేపీకి అనకాపల్లిలో ఓటు బ్యాంకు లేదు..
మీ ధైర్యం ఏంటి..?
గత ఎన్నికలు వేరు. ఈసారి ఎన్నికలు వేరు. ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను బాగా అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం వల్ల నా విజయం నల్లేరు మీద నడకేనని నమ్ముతున్నాను. నియోజకవర్గంలో బీజేపీ ఓటు శాతం కూడా పెరిగింది. అన్నిటికంటే ముఖ్య విషయం ఏమిటంటే.. జగన్‌ను ఎప్పుడు గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆయన్ను దించాలని కసితో ఉన్నారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన అవినాశ్‌రెడ్డిని పక్కన పెట్టుకుని హత్య ఎవరు చేశారో దేవుడికి తెలుసని జగన్ అంటున్నాడు. ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటున్న ఆయన.. ఇంట్లో ఆడబిడ్డలకే న్యాయం చేయలేకపోయాడు. జగన్ ఏ తప్పు చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో చెప్పే చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మా పార్టీ పెద్దలకు చెప్పాం. నడ్డా, అమిత్‌షా.. జగన్ గురించి క్లారిటీగా చెప్పారు. అవినాశ్‌రెడ్డిని సీబీఐ తప్పకుండా అరెస్టు చేస్తుంది. హత్య వెనుక ఉన్నవారు కూడా బయటకు వస్తారు. ఈ హత్యతో జగన్‌కు, భారతికి ప్రమేయం ఉందని ప్రజలకు తెలుసు. కడపలో షర్మిల, సునీత ప్రచారంతో జగన్‌కు బాగా నష్టం జరుగుతుంది. ఇంటిలో ఆడబిడ్డకు అన్యాయం చేసిన ఆయనకు శాపం తగులుతుంది.
టీడీపీతో పొత్తును మోదీ అయిష్టంగానే
ఒప్పుకొన్నారన్న మాట వాస్తవమేనా?
బీజేపీలో అమిత్‌షాను, మోదీని ఎవరూ ప్రభావితం చేయలేరు. జగన్ అవినీతి, అక్రమాలు వారికి తెలుసు. ఇసుక, మైనింగ్, లిక్కర్, అరాచకాలు.. అన్నీ తెలుసు. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని కూడా తెలుసు.
జగన్‌కు ప్రధాని ఆశీస్సులున్నాయని అంటున్నారు? సీఎంపై చిన్న దాడి జరిగితే ఆయన స్పందించడాన్ని ప్రజలు ఏమనుకోవాలి?
జగన్‌పై దాడిని ఆయన రోత మీడియాతో పాటు మరికొందరు హత్యాయత్నంగా చిత్రీకరించారు. అది చూసి మోదీ ట్వీట్ చేసి ఉండవచ్చు. తర్వాత అంతా మోసమని బీజేపీ పెద్దలకు తెలిసింది. జగన్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి చిలుకలూరిపేట సభలో ఆయన పేరు కూడా చెప్పడానికి మోదీ ఇష్టపడలేదు. త్వరలో అనకాపల్లి సభకు ప్రధాని వస్తున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం, మోదీ ప్రధాని కావడం ఖాయం.
కడప నుంచి అనకాపల్లి వెళ్లి రాజకీయాలు
చేయగలమనే ధైర్యం ఎక్కడిది?
మాడుగుల నియోజకవర్గాన్ని చూస్తే బాధేస్తోంది. మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఉండి బూడి ముత్యాలనాయుడు తన సొంత నియోజకవర్గానికే ఏమీ చేయలేకపోయారు. ఎంపీగా ఢిల్లీ వెళ్లి ఏం సాధిస్తారు? అందుకే అనకాపల్లి ప్రాంత ప్రజలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. అనకాపల్లి ప్రజలు స్థానికుడా, స్థానికేతరుడా అని చూడడం లేదు. నా పనితనాన్ని చూసి ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కూటమిలో నాయకులు, ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అనకాపల్లిలో కూటమి తరఫున గెలిచి, ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు లేని లోటు తీరుస్తా. విశాఖలో రాజధాని ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుకోవడం లేదు.
Updated Date - Apr 23 , 2024 | 04:48 AM