కోర్టుకు రావడానికి జగన్‌కు నామోషీ!
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:44 AM
మాజీ సీఎం జగన్‌కు పాస్‌పోర్ట్‌ను ఏడాది పాటే పునరుద్ధరించాలని, తమ ముందు హాజరై రూ.20 వేలు స్వీయ పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) మెండ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇబ్బంది పేరిట షరతులు సవరించాలంటున్నారు.. చట్టానికి లోబడే షరతులు
ఎన్‌వోసీ జారీకి షరతులు విధించే అధికారం ఉంది.. పరువునష్టం కేసు వివరాలు జగన్‌కు తెలుసు
ఎన్నికల అఫిడవిట్లలో ప్రస్తావించారు.. పలు సందర్భాల్లో ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది
హోదాను అడ్డుపెట్టుకుని వాటిని అందుకోలేదు.. ‘పాస్‌పోర్టు’ వ్యాజ్యాన్ని కొట్టివేయండి: పీపీ వాదనలు
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌కు పాస్‌పోర్ట్‌ను ఏడాది పాటే పునరుద్ధరించాలని, తమ ముందు హాజరై రూ.20 వేలు స్వీయ పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. అవి చట్టనిబంధనలకు లోబడే ఉన్నాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్‌వోసీ జారీకి షరతులు విధించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉందన్నారు. ఈ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టుకు విన్నవించారు. సీబీఐ కోర్టు ముందున్న కేసులు, ప్రత్యేక కోర్టు ముందున్న కేసు వేర్వేరని, రెండింటినీ పోల్చిచూడటానికి వీల్లేదని అన్నారు. పిటిషనర్‌కు అసౌకర్యం ఉందనే కారణంతో కోర్టు ఉత్తర్వులను సవరించాలని కోరరాదని చెప్పారు.
పూచీకత్తు సమర్పించే నిమిత్తం కోర్టుకు వచ్చేందుకు జగన్ నామోషీగా భావిస్తున్నారని తెలిపారు. విజయవాడ కోర్టుకు వెళ్లకుండా.. ఎగ్గొట్టేందుకు పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. పరువు నష్టం కేసుపై హైకోర్టు స్టే విధించలేదన్నారు. సీనియర్ న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు జగన్‌కు తాజాగా సమన్లు జారీ చేసిందని, ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సి ఉందని అన్నారు. పాస్‌పోర్టు జారీ, పునరుద్ధరణకు సంబంధించి పూర్తి అధికారం పాస్‌పోర్టు అధికారులదేనని తెలిపారు. ఎన్‌వోసీ జారీ కోసం ప్రత్యేక కోర్టులో వేసిన పిటిషన్‌లో వారిని ప్రతివాదులుగా చేర్చలేదని చెప్పారు. ఎన్‌వోసీ జారీకి ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని ప్రత్యేక కోర్టులో వేసిన వ్యాజ్యంలో పిటిషనర్ ప్రస్తావించారని, అలాంటిది ఇప్పుడు కోర్టు షరతులపై హైకోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదని పేర్కొన్నారు.
క్రిమినల్ కేసుల విచారణ పెండింగ్‌లో ఉండగా పాస్‌పోర్టు జారీ/పునరుద్ధరణ కోసం షరతులు విధించే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని ఈ సందర్భంగా వివరించారు. తనపై పరువు నష్టం కేసు పెండింగ్‌లో ఉందని 2019, 2024 ఎన్నికల అఫిడవిట్‌లోనే జగన్ ప్రస్తావించారని తెలిపారు. కేసు గురించి పిటిషనర్‌కు అవగాహన లేదని, సమన్లు అందలేదని సీనియర్ న్యాయవాది కోర్టును తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. దీనిని పరిశీలిస్తే పిటిషనర్ వైఖరి ఏంటో తెలుస్తోందని చెప్పారు. ఈ అంశాలను పరిగనణలోకి తీసుకొని జగన్ దాఖలు చేసిన పాస్ పోర్టు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయంలో నిరభ్యంతరపత్రం(ఎన్‌వోసీ) ఇచ్చేందుకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కఠిన షరతులు విధించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ శుక్రవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.
నిందితుడే తప్పించుకున్నారా?
న్యాయస్థానం స్పందిస్తూ.. పరువునష్టం కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను నిందితుడి(జగన్)కి అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. ఇంతకాలం సమన్లు అందచేయకుండా వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సమన్లు ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదా? వాటిని తీసుకోకుండా నిందితుడే తప్పించుకున్నారా? కారణాలు ఏంటని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించింది. పీపీ బదులిస్తూ.. పిటిషనర్ తన హోదాను అడ్డుపెట్టుకొని గత ఐదునరేళ్లుగా సమన్లు అందుకోలేదని వివరించారు. పాస్‌పోర్టుకు సంబంధించిన పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 11న నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు.
ప్రత్యేక కోర్టు పరిధి దాటింది: పొన్నవోలు
జగన్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. సీఎంగా ఉండగా డిప్లొమేటిక్ పాస్‌పోర్టు ఉండేదని, ఆయన పదవి నుంచి దిగిపోయాక జనరల్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరిపేందుకుగాను ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పాస్‌పోర్టును ఐదేళ్లపాటు పునరుద్ధరించాలని(రెన్యువల్) సీబీఐ కోర్టు సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుత మంత్రి నారాయణ 2018లో వేసిన పరువునష్టం కేసు పెండింగులో ఉన్నందున ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాలని పాస్‌పోర్ట్ అధికారులు పిటిషనర్‌కు సూచించారని తెలిపారు.
ఎన్‌వోసీ కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా కఠిన షరతులు విధించిందన్నారు. పాస్‌పోర్టును ఏడాదిపాటు మాత్రమే రెన్యువల్‌కు అనుమతిస్తామని, రూ.20 వేల స్వీయ పూచీకత్తు సమర్పించాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 26 మధ్య మాత్రమే లండన్‌కు వెళ్లాలని షరతులు విధించిందన్నారు. పిటిషనర్‌పై ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులను విచారిస్తున్న సీబీఐ కోర్టే పాస్‌పోర్టును ఐదేళ్లకు పునరుద్ధరించాలని ఆదేశించగా, దానికి విరుద్ధంగా షరతులు విధించి ప్రత్యేక కోర్టు తన పరిధి దాటిందని తెలిపారు.
తనపై పరువునష్టం కేసు ఉన్నట్లు పిటిషనర్‌కు అవగాహన లేదన్నారు. కేసును కాగ్నిజెన్స్‌లోకి తీసుకొని ప్రత్యేక కోర్టు జగన్‌కు ఎలాంటి సమన్లు ఇవ్వలేదని చెప్పారు. పరువునష్టం కేసు విచారణపై హైకోర్టు స్టే విధించిందన్నారు. ఈ నేపథ్యంలో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు భావించడానికి వీల్లేదన్నారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయని, వాటిని పరిశీలించాలని కోరారు. పిటిషనర్‌కు ఐదేళ్లు పాస్‌పోర్టు పునరుద్ధరించడం వల్ల ప్రాసిక్యూషన్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ప్రత్యేక కోర్టు షరతులు రద్దు చేయాలని అభ్యర్థించారు.
Updated Date - Sep 10 , 2024 | 07:26 AM