నదుల అనుసంధానంపై17న జాతీయ స్థాయి సమావేశం
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:07 AM
నదుల అనుసంధానంపై మరోసారి రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడానికి నేషనల్ వాటర్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన జాతీయ స్థాయి సమావేశం
రాష్ట్రాలకు వర్తమానం పంపిన ఎన్‌డబ్ల్యూడీఏ
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానంపై మరోసారి రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడానికి నేషనల్ వాటర్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన జాతీయ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లకు సోమవారం ఆహ్వాన పత్రాలు పంపింది. నదుల అనుసంధానంపై ఇప్పటివరకు అనుసరించిన విధానాలు, రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాలు, ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గోదావరి-కృష్ణా-కావేరి అనుసంధాన ప్రక్రియకు సిద్ధమవుతోంది. పోలవరం నుంచి నాగార్జున సాగర్-బొల్లాపల్లి మీదుగా కావేరి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాల అనుసంధాన ప్రక్రియను 2014-19 కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పుడు.. దాన్ని విస్తరిస్తూ ప్రకాశం బ్యారేజీకి సమీపంలో వైకుంఠపురం బ్యారేజీ ద్వారా రోజుకు రెండు టీఎంసీల చొప్పున నాగార్జునసాగర్ కాలువకు మళ్లించి.. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయరుకు తరలించాలని నిర్ణయించారు. అయితే.. గోదావరి - కృష్ణా జలాల అనుసంధానం విషయంలో తెలంగాణ అభిప్రాయం విరుద్ధంగా ఉంది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను సాగర్‌కు తరలించాలన్న యోచనలో తెలంగాణ ఉంది. కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అఖండ గోదావరి ప్రతిపాదనలతో తెలంగాణ ఏకీభవించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న జరగనున్న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఏపీ, తెలంగాణ వాదనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.
Updated Date - Dec 03 , 2024 | 05:07 AM