TDP: నెల్లూరులో నారా భువనేశ్వరి రెండవ రోజు పర్యటన
ABN, Publish Date - Feb 02 , 2024 | 08:20 AM
నెల్లూరు: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో రెండో రోజు శుక్రవారం పర్యటించనున్నారు. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి..
నెల్లూరు: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో రెండో రోజు శుక్రవారం పర్యటించనున్నారు. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి.. ఆర్థిక సాయం చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తీవ్ర మానసిక వత్తిడితో మృతిచెందిన కార్యకర్తలు కముజుల ఆంజనేయరెడ్డి, బొలిగర్ల చెన్నయ్య, సన్నిబోయిన కృష్ణయ్య కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి.. అన్ని విధాలా అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వనున్నారు.
కాగా ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో టీడీపీ కార్యకర్త తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో సుధాకర్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో సుధాకర్ భార్య వెంగమ్మ, కుటుంబసభ్యులను భువనేశ్వరి ఓదార్చి.. రూ.3 లక్షల చెక్కును అందజేశారు. సుధాకర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామస్థులతో సమావేశమైన భువనేశ్వరి.. వారితో మాట్లాడుతూ.. ‘‘మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు. పేదలందరికీ ప్రతీఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దయచేసి ఏదీ దుర్వినియోగం చేయొద్దు’’ అని భువనేశ్వరి కోరారు.
Updated Date - Feb 02 , 2024 | 08:20 AM