Chandrababu: వెంకటగిరి ‘రా..కదలిరా’ సభలో వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 19 , 2024 | 01:35 PM
Andhrapradesh: వెంకటగిరి ‘‘రా..కదలిరా’’ బహిరంగ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయం మారుతుందని... ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లక్ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి నెల్లూరు, జనవరి 19: వెంకటగిరి ‘‘రా..కదలిరా’’ బహిరంగ సభలో వైసీపీపై (YCP) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజకీయం మారుతుందని... ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లక్ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉండి, జగన్ పాలన బాగాలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (MLA Anam Ramnarayana Reddy) చెప్పారని.. అప్పటి నుంచి ఆనంని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామన్నారు. ఎన్టీఆర్ (NTR), వైఎస్ఆర్ (YSR) హయాంలో మంత్రిగా ఆనం పనిచేశారన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే దూరంపెట్టి పక్కన పెట్టారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఐదేళ్లు పోరాటం చేశారన్నారు.
శిషుపాలుడు వంద తప్పులు చేస్తే, ఈ సైకో వెయ్యి తప్పులు చేశారని విమర్శించారు. ‘‘మీ అందరి చేతుల్లో ఓటుంది. ఇంటి పెద్ద సరిలేకుంటే, ఆ కుటుంబం బాగుంటుందా? ఏపీలో కూడా అదే జరిగింది. విధ్వంసం కొనసాగింది. సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేకపోయాం. ఉద్యోగులకి జీతాలు పెంచే పరిస్థితి లేదు. అడిగితే జైలుకి పోతామనే భయం’’ అందరిలో ఉందని టీడీపీ అధినేత పేర్కొన్నారు.
పరిశ్రమలు తెస్తే.. వాటికే కన్నెం వేశాడీ జగన్...
చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... తుపానులు, వరదలు వచ్చినప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఏ కులస్థులైనా బాగున్నారా? ఏ మతస్థులైనా బాగున్నారా? కనీసం రెడ్లు అయినా బాగున్నారా?.. దీనికి ఒక్కటే మార్గమని.. జగన్ పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. యువత కోసం 25 ఏళ్ల కిందట ఐటీ ఆయుధం ఇస్తే, ఇప్పుడదే వజ్రాయుధం అయిందన్నారు. తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్‌గా చేద్దామని అనుకున్నామని... ప్రపంచంలోనే మేలైన ప్రాంతంగా చేయాలని చూశామన్నారు. ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్‌గా చేద్దామని అనుకున్నామని తెలిపారు.
మంచి పరిశ్రమలు, విద్యాసంస్థలు తీసుకువచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెద్దామని అనుకున్నామన్నారు. అయితే తెచ్చిన వాటిని ఏం చేశారో చూశామని.. రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు టీడీపీ తెస్తే, జగన్ నిరుద్యోగం పెంచారని మండిపడ్డారు. కియా వంటి పరిశ్రమలు తెస్తే, వాటికే కన్నం వేశాడీ.. జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే, జగన్ వాలంటిర్ల ఉద్యోగాలు, బ్రాందీ షాపులో ఉద్యోగాలు, పిష్ మార్కెట్ ఉద్యోగాలిచ్చారని మండిపడ్డారు. టీడీపీ పరిశ్రమలు తెస్తే... జగన్ భూంభూం, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారని.. హోల్ సేల్, రిటైల్ వ్యాపారమంతా ఆయనదే అని విరుచుకుపడ్డారు.
ఆ దేవుడు క్షమించినా మనం క్షమించం..
‘‘జగన్ ఓ పెద్ద వ్యాపారి. మనల్ని అందర్నీ దోచుకున్నాడు. ఇసుక తైలం తీసి రూ.కోట్లు దోచాడు. తిరుపతిలో రూ.4వేల కోట్ల పీడీఆర్ బాండ్లు పేరుతో దోచారు. ఏపీ వ్యాప్తంగా రూ.24 వేల కోట్లు దోచారు. తిరుపతి ప్రాంతంలో ఎర్రచందనం ఉంది. ఆ రోజు స్మగ్లింగ్ చేసే వారిపై గట్టిగా చర్యలు తీసుకున్నాం. ఈ రోజు ఒక్కరినైనా పట్టుకున్నారా? ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే దేశమంతా చూస్తుంది. తిరుమలలో స్వామి ఆలయాన్నీ దోచుకుంటున్నారు. ఆ దేవుడు క్షమించినా మనం క్షమించం’’ అంటూ టీడీపీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు గెలవాలి.. జగన్ పోవాలి...
‘‘జగనన్న హౌసింగ్ కాలనీల్లో అవినీతే అవినీతి. రూ.15లక్షలకి ఎకరా భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.50కోట్లుకి అమ్మారు. కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ మాయమయ్యాయి. రూ.4500కోట్ల విలువ చేసే సిలికాని ఈ దుర్మార్గులు దోచేశారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. కేజీఎఫ్ త్రీగా మార్చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి నిరాహారదీక్షకి దిగి పోరాటం చేశారు. అది ప్రజా సంపద, ప్రజలందరి కోసం వినియోగించాలి. జగన్ 45లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు. ఇసుకంతా దోచేశారు. మొన్న బీచ్ శ్యాండ్‌ను అమ్మాలని చూస్తే, కోర్టు ఆపింది. జగన్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి. జగన్ పోవాలి’’ అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
Updated Date - Jan 19 , 2024 | 01:47 PM