ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెరీ‘గుడ్డు’ అయితేనే..

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:35 AM

పాఠశాలల విద్యార్థులకు, అంగన్‌వాడీ చిన్నారులు, గర్భిణులకు అందించే గుడ్లలోనూ గత వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పరిమాణంలో చిన్నవి, పాడైన గుడ్లు సరఫరా చేశారు.

విద్యార్థులకు, గర్భిణులకు అందించే గుడ్లపై కొత్త నిబంధనలు

పరిమాణం, నాణ్యత పక్కాగా ఉండాలి

గుడ్డు బరువు 50 గ్రాములు తగ్గితే వెనక్కి

సరఫరా వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌

సకాలంలో ఇవ్వకపోతే జరిమానా, బ్లాక్‌లిస్ట్‌

గత ప్రభుత్వంలో భారీగా అక్రమాలు

వాటికి చెక్‌ పెట్టిన కూటమి ప్రభుత్వం

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల విద్యార్థులకు, అంగన్‌వాడీ చిన్నారులు, గర్భిణులకు అందించే గుడ్లలోనూ గత వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పరిమాణంలో చిన్నవి, పాడైన గుడ్లు సరఫరా చేశారు. కాంట్రాక్టును టెండర్ల ద్వారా కాకుండా కేవలం కొనసాగింపుతో వందల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచిపెట్టారు. దీనికి కూటమి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. పరిమాణం, నాణ్యత విషయంలో కొత్త నిబంధనలు రూపొందించింది. వీటితోనే గుడ్లకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ టెండర్లు పిలిచింది. ప్రస్తుతం గుడ్డు బరువు 50 గ్రాములు తగ్గకూడదు అనే నిబంధన ఉన్నా, తూకం వేసి తీసుకునే విధానం లేదు. ఇకపై ట్రేలు వారీగా పాఠశాలల్లో తూకం వేసిన తర్వాతే దిగుమతి చేయాలని నిబంధన పెట్టారు. చిన్న గుడ్లు ఉంటే వెంటనే వెనక్కి పంపే వెసులుబాటు కల్పించారు. అలాగే కొత్తగా థర్డ్‌ పార్టీ చెకింగ్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు. నాణ్యతపై లేబొరేటరీల్లో పరీక్షలు చేస్తారు. ఎన్‌ఏబీఎల్‌, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా, నిర్దేశిత సమయంలో గుడ్లు సరఫరా చేయకపోయినా జరిమానా విధించనున్నారు. మొదటిసారి ఆలస్యానికి సరఫరా చేసే గుడ్ల విలువలో ఒక శాతం, రెండోసారి ఆలస్యానికి 5 శాతం, మూడోసారి ఆలస్యానికి 10 శాతం జరిమానా విధిస్తారు. నాలుగోసారి కాంట్రాక్టు సంస్థపై అనర్హత వేటు వేసి, బ్లాక్‌ లిస్టులో పెడతారు. అలాగే గుడ్లు సరఫరా వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉండాలనే నిబంధన పెట్టారు. గోడౌన్లలో బయలుదేరిన వాహనాలు నిర్దేశిత సమయంలో పాఠశాలలు, అంగన్‌వాడీలకు చేరుకుంటేనే గుడ్లను తీసుకుంటారు. గతంలో రవాణా ఖర్చు తగ్గించుకునేందుకు కాంట్రాక్టర్లు పాఠశాలలకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో గుడ్లు దిగుమతి చేసేవారు. దీంతో ఎక్కువకాలం బడుల్లో నిల్వ ఉంటున్న గుడ్లు పాడైపోతున్నాయి. దానిని నివారించేందుకు ఇకపై ఒక వారానికి అవసరమైన మేరకు మాత్రమే సరఫరా చేయాలని నిబంధన పెట్టారు. ఒకవేళ ఒక వారంలో పంపిన గుడ్లు శుక్రవారానికి మిగిలితే వాటిని వెనక్కి పంపుతారు. నిబంధనల ప్రకారం గుడ్లపై వారానికో రంగులో స్టాంపులు లేకపోయినా జరిమానాలు విధిస్తారు.


కాంట్రాక్టుల కోసం పేర్లు మార్చుకుని..

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబరులోనే కాంట్రాక్టు ముగిసినా అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పాత వారికే కాంట్రాక్టులు కొనసాగించారు. వారికి బిల్లులు ఇవ్వకుండా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. బకాయిలు ఇవ్వకపోతే గుడ్లు సరఫరా చేయబోం అంటూ మొదట్లో కూటమి ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్‌మెయిల్‌ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారు. రావులపాలేనికి చెందిన ఓ సంస్థ గతంలో చిక్కీలు సరఫరా చేయగా, ఇప్పుడు వేరే పేరుతో గుడ్లు కాంట్రాక్టు కోసం టెండరు దాఖలు చేసింది. శ్రీకాకుళంలోని ఓ వైసీపీ నేతకు చెందిన పౌల్ర్టీ, అనంతపురంలో ఓ మాజీ మంత్రి అనుచరుడి సంస్థ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని కంపెనీలు అప్పట్లో అక్రమాలకు పాల్పడి.. ఇప్పుడు మళ్లీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు సిద్ధమయ్యాయి. బిల్లులు చెల్లించకపోతే గుడ్లు ఆపేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేసినవారిలో వీరూ ఉండటం కొసమెరుపు.

Updated Date - Nov 08 , 2024 | 03:35 AM