మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

11 నుంచి 13 వరకు పంపిణీ వద్దు

ABN, Publish Date - May 10 , 2024 | 04:52 AM

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీతో పాటు చేయూత, విద్యాదీవెన, ఆసరా,ఈబీసీ నేస్తం పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

11 నుంచి 13 వరకు పంపిణీ వద్దు

నేటివరకు ఈసీ ఉత్తర్వులు పక్కనపెడుతున్నాం

పంపిణీపై మీడియాలో ప్రచారం చేయొద్దు

ఉత్సవాలు జరపడం వంటివి చేయకూడదు

రాజకీయ నేతల ప్రమేయం నిరోధించండి

మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు

కౌంటర్‌ దాఖలుకు ప్రతివాదులకు ఆదేశం

తదుపరి విచారణ జూన్‌ 27కు వాయిదా

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీతో పాటు చేయూత, విద్యాదీవెన, ఆసరా,ఈబీసీ నేస్తం పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పోలింగ్‌ తేదీ ముగిసిన తరువాతే పథకాల నిధులను పంపిణీ చేయాలని ఎన్నికలసంఘం గురువారం ఇచ్చిన ఉత్తర్వుల అమలును, ఈ నెల 10వరకు తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని పేర్కొంది. నిధుల విడుదలకు సంబంధించి ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, రేడియో, ఇంటర్నెట్‌, ఇతర ప్రసార మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉత్సవాలు జరపవద్దని, రాజకీయనేతల ప్రమేయాన్ని నిరోధించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను జూన్‌ 27కి వాయిదా వేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసిన (మే13) తరువాత రోజు నుంచి రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీతో పాటు చేయూత, విద్యాదీవెన, ఆసరా,ఈబీసీ నేస్తం పథకాల నిధులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయవచ్చునంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, అత్యవసరంగా ఎందుకు పంపిణీ చేయాలనుకుంటున్నారో కారణాలు పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తాజాగా వినతి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి దానిపై నిర్ణయాన్ని తీసుకోవాలని, ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఈసీని ఆదేశించింది. ఈ అంశం గురువారం విచారణకు రాగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3.30 వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి.

సంతృప్తికరంగా లేని సర్కారు వినతి : ఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. ‘‘వివిధ పథకాల లబ్ధిదారులకు దాదాపు రూ.14,165 కోట్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. పోలింగ్‌ తేదీ మే 13 తరువాత ఎప్పుడైనా ఆ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు అనుమతించాం. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు సొమ్ము పంపిణీ చేయవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాన అవకాశాలను(లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) దెబ్బతీయకుండా, లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ సొమ్ము పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చాం. పథకాల సొమ్ము విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేవలం కొద్దిమంది లబ్ధిదారులు మాత్రమే కోర్టును ఆశ్రయించారు. ఫలానా తేదీ లోపలే సొమ్ము తమ ఖాతాల్లో జమ చేయాలని కోరే చట్టబద్ధమైన హక్కు పిటిషనర్లకు లేదు. పథకాల లబ్ధిదారులమని నిరూపించుకొనేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు. పథకాల నిధుల విడుదల ప్రకటన చేసిన 3 నుంచి 5 నెలల తరువాత పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోడ్‌ కొత్త పథకాలతోపాటు అమల్లో ఉన్న పథకాలకు సైతం వర్తిస్తుంది. కోర్టు పరిశీలనలో ఉన్న ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి సొమ్మును జమ చేస్తారు. నాలుగు రోజులు వారికి సొమ్ము జమ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. కరువుబారిన పడి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆరునెలల క్రితం గుర్తించింది. ఇప్పటివరకు వారికి సొమ్ము జమ చేయకుండా జాప్యం చేసి పోలింగ్‌ జరిగే ఒకటి రెండు రోజుల ముందు జమ చేస్తామనడం సరికాదు. కోడ్‌ అమల్లోకి రాకముందే పథకాల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమచేసేందుకు ఇంత జాప్యం ఎందుకు జరిగిందో రాష్ట్రప్రభుత్వం సమర్పించిన వినతిలో పేర్కొన్న కారణాలు ఆమోదయోగ్యంగా లేవు. దీనిపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాశాం. పోలింగ్‌ తేదీ తరవాత పథకాల నిధులు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం సహేతుకమైన షరతులే విధించింది. ఈ నేపఽథ్యంలో వ్యాజ్యాలను కొట్టివేయాలి’’ అని కోరారు.

నిధుల విడుదలకు ఆదేశించండి: ప్రభుత్వం

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ‘ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల అమలును అడ్డుకోవడానికి వీల్లేదు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల నిధుల విడుదలను సైతం పోలింగ్‌ ముగిసేవరకు ఆపాలని ఈసీ ఆదేశించింది. ఈ పథకాలు కొత్తవి కాదు. మూడేళ్లుగా అమల్లో ఉన్నవే’ అని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘నిధుల పంపిణీకి అనుమతి ఇవ్వాలని స్ర్కీనింగ్‌ కమిటీ ముందుగానే ప్రతిపాదనలు పంపించింది. నిర్ణయం వెల్లడించకుండా ఈసీయే జాప్యం చేసింది. నిధుల పంపిణీకి అనుమతించాలి’’ అని కోరారు.

Updated Date - May 10 , 2024 | 04:52 AM

Advertising
Advertising