NTR Vaidya Seva : ‘వైద్య సేవ’కు గ్రహణం!
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:19 AM
రాష్ట్రంలో 1.40 లక్షల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించే వ్యవస్థ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. ఇలాంటి వ్యవస్థకు రెగ్యులర్ సీఈవోను నియమిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. అయితే
ట్రస్టులో గాడి తప్పిన పాలన.. ఇన్‌చార్జి సీఈవోల కుర్చీలాట
ఒకే ఏడాదిలో ఐదుగురు మార్పు
సొంత పనులకే ఉద్యోగుల ప్రాధాన్యం
రోగుల వైద్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం
వైసీపీ మద్దతుదారుల అడ్డాగా ట్రస్ట్
ధనుంజయరెడ్డి ఓఎస్డీకి సీఎంవో బ్రేక్
కీలక పోస్టులో మాజీ మంత్రి పీఏ
తాజాగా మొరాయించిన సర్వర్
వేల మంది రోగులకు అవస్థలు
కొత్త ఆడ్మిషన్లు, డిశ్చార్జ్‌లు బంద్
డయాలసిస్ సేవలకూ ఆటంకం
రెగ్యులర్ సీఈవో ఉంటేనే దారిలోకి
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో పాలన గాడి తప్పింది. ఒకవైపు ఇన్‌చార్జి సీఈవోలు, మరోవైపు నాన్ మెడికల్ అధికారులతో అంతా అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ లోపాలతోక్షేత్రస్థాయిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల సేవల కంటే సొంత వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెగ్యులర్ సీఈవో లేకపోవడం, కొత్తగా వచ్చినవారికి అనుభవం లేకపోవడంతో పాటు ట్రస్టులో అనుభవం ఉన్న ఉద్యోగులను అధికారులు పక్కన పెట్టడంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో 1.40 లక్షల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించే వ్యవస్థ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. ఇలాంటి వ్యవస్థకు రెగ్యులర్ సీఈవోను నియమిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. అయితే ఈ ట్రస్టుకు ప్రభుత్వం సీఈవోను నియమించినా, కొద్ది రోజులకే బదిలీ చేస్తోంది. హరేంద్రీ ప్రసాద్ తర్వాత ఇన్‌చార్జి సీఈవోగా వెంకటేశ్వర్లు విధులు నిర్వహించారు. ఆయన తర్వాత వచ్చిన డి.కె. బాలాజీని కృష్ణాజిల్లా కలెక్టర్‌గా వెళ్లడంతో ఆ స్థానంలో మంజులను నియమించారు. తర్వాత ఆమె స్థానంలో లక్ష్మీశకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడంతో ఇప్పుడు మళ్లీ మంజులను ప్రభుత్వం ఇన్‌చార్జి సీఈవోగా నియమించింది. ఏడాదిలో ఐదుగురు సీఈవోలు మారడంతో ట్రస్ట్‌లో పాలన అస్తవ్యస్తంగా మారింది. లక్ష్మీశ రెగ్యులర్ సీఈవోగా ఉన్నప్పటికీ మరో నాలుగు విభాగాల బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన ట్రస్ట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు.
ఆకాశరామన్న ఉత్తరాల కలకలం
ట్రస్ట్‌లో ఆకాశరామన్న ఉత్తరాలు కలకలం రేపుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై గుర్తుతెలియని వ్యక్తులు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి సంఖ్య ఎక్కువైంది. ఉత్తరాలపై అప్పటి సీఈవో లక్ష్మీశ ప్రత్యేక దృష్టిపెట్టి కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. దానిద్వారా ప్రతి ఆస్పత్రికి ఫోను చేసి అన్ని కోణాల్లో విచారణ చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ట్రస్ట్ నుంచి వివిధ ఆరోపణలతో తొలగించిన ఉద్యోగులే ఈ ఉత్తరాలు రాస్తున్నారని విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఇన్‌చార్జి సీఈవో రావడంతో మళ్లీ ఉత్తరాలు రావడం మొదలైంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన క్లైయిమ్స్ స్కామ్, డెంటల్ స్కామ్‌ల్లో కలిపి దాదాపు 15మంది ఉద్యోగులను తొలగించారు. వారంతా ట్రస్ట్‌పై అనేక ఆరోపణలు చేస్తూ ఉత్తరాలు రాయడం ప్రారంభించారు. వీరిలో కొంతమంది టీడీపీ, బీజేపీ నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ప్రభుత్వం రెగ్యులర్ సీఈవోని నియమిస్తే తప్ప వ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదు.
వైసీపీ బ్యాచ్‌కు అందలం
వైద్య సేవ ట్రస్ట్‌లోకి రావడానికి వైసీపీ అనుకూల అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మారగానే ధనుంజయరెడ్డి ఓఎ్‌సడీగా విధులు నిర్వహించిన మహిళా అధికారి ట్రస్ట్‌లోకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు క్లియరెన్స్ ఇచ్చి నా సీఎంవో జోక్యంతో ఆమె ప్రయత్నాలకు బ్రేక్ పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేసిన డీఎల్‌డీవో ఒకరు ట్రస్ట్‌లో అదనపు సీఈవోగా చేరారు. ఈయనపై అనేక ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని రూ.కోట్లలో వసూళ్లు చేశా రు. ట్రస్ట్ పాలన మొత్తం సదరు అధికారి చేతుల్లో పెట్టారు. రెగ్యులర్ సీఈవో లేకపోవడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందేపాటగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరుకు చెందిన ఓ ఆస్పత్రి క్లైయిమ్‌ల స్కామ్‌కు పాల్పడింది. ఆ ఆస్పత్రిని కాపాడాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాను ఆరోగ్య మంత్రి తాలుకా అని ఉద్యోగుల వద్ద చెబుతూ, పెత్తనం చెలాయిస్తున్నారు. ఈయనతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన మరో అధికారి ట్రస్ట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపైనా ఆరోపణలున్నాయని తెలుస్తోంది.
రోగులకు సర్వర్ కష్టాలు
ట్రస్ట్ సర్వర్లు నవంబరు 28న ఉదయం ఆగిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వేల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తగా ఆస్పత్రుల్లో చేరేందుకు వెళ్లినవారికి రిజిస్ట్రేషన్లు కాలేదు. డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారు ఆస్పత్రుల్లోనే ఉండిపోయారు. డయాలసిస్ సేవలకూ బ్రేక్ పడింది. శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సాయంత్రం 7గంటలకు సర్వర్లు అందుబాటులోకి వచ్చేవరకూ రోగులను పట్టించుకున్న నాథుడే లేడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వా లి. అధికారులు మాత్రం సర్వర్లు బాగయ్యేవరకూ సేవలు నిలిపివేశారు.
Updated Date - Dec 03 , 2024 | 05:19 AM