ఓబీసీ కులగణన వెంటనే చేపట్టాలి
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:47 PM
యావత్ భారతదేశంలో జనగణనతో పాటుగా ఓబీసీ కులగణన త్వరగా పాలక ప్రభుత్వాలు చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు
కడప మారుతీనగర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): యావత్ భారతదేశంలో జనగణనతో పాటుగా ఓబీసీ కులగణన త్వరగా పాలక ప్రభుత్వాలు చేపట్టాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఓబీసీ కులగణన చేట్టిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలని తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పాలక ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారన్నారు. ఆ మేరకు బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కమిటీ పిలుపు దృష్ట్యా సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి త్రివిక్రమ్, ఉపాధ్యక్షుడు కళ్యాసుధాకర్ మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1931 సంవత్సరంలో మన దేశంలో గల అన్ని కులాల జనాభా వివరాలతో పాటుగా జీవన స్థితిగతులను సేకరించారన్నారు. తదుపరి ఇంతవరకూ జరిగిన ఏ జనగణనలోనూ, సమగ్ర కులగణన జరపకపోవడం విడ్డూరంగా వుందన్నారు. స్వతంత్ర భారతంలో 77 సంవత్సరాల తర్వాత కూడా అణగారిన వెనుకబడిన తరగతులైన ఓబీసీల జనగణన, కులాలవారిగా వివరాలను శాస్త్రీయంగా సేకరించకపోవడం బాధాకరమన్నారు. మనదేశంలో సుమారు 6,743 కులాలున్నాయని, అందులో 3,964 ఓబీసీ కులాలతో విభజితమై వుందన్నారు. కాగా మొత్తం జనాభాలో 52 శాతంగా వున్న ఓబీసీలకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, విద్య, ఉద్యోగ, ఉపాధి, రంగాలలో మాత్రం వీరి వాటా 12 నుంచి 21 శాతానికి మించి లేవని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఆధిపత్య కుల ప్రాధాన్యత కలిగిన హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ఏనాడు 12 నుంచి 30 శాతానికి మించడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి త్వరితగతిన ఓబీసీ కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు సీఆర్‌ఐ సునీల్ జయంత్, నాయకులు ఖాదర్‌బాష, మహిళా నాయకురాలు జయశ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 11:47 PM