గోదావరి బేసిన్ భూభాగంలో చమురు నిక్షేపాలు..!
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:37 AM
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో (గతంలో నదీ ఆధిపత్యంలో ఉన్న నేటి భూభాగం) చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎ్‌సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
నదీ పరీవాహక ప్రాంతంలో సహజవాయువులు
బీఎ్‌సఐపీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
లఖ్‌నవూ, సెప్టెంబరు 15: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో (గతంలో నదీ ఆధిపత్యంలో ఉన్న నేటి భూభాగం) చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎ్‌సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి సాధారణంగా సముద్ర క్రమంలో కనిపిస్తాయని, కానీ.. భూభాగంలో వీటి లభ్యతను గుర్తించడం సవాలుతో కూడుకున్న అంశమని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నేహా అగర్వాల్ తెలిపారు. ఈ సీక్వెన్స్ స్ట్రాటిగ్రఫీని గుర్తించేందుకు పాలినాలజీ, జియోకెమికల్ టూల్స్‌ను ఉపయోగించినట్టు చెప్పారు. ‘సీక్వెన్స్ స్ట్రాటిగ్రఫీ అనేది సముద్ర మట్టాలలో క్రమంగా వచ్చే మార్పుల కారణంగా కాలక్రమేణా అవి ఎలా నిక్షిప్తమయ్యాయో అర్థం చేసుకోవడానికి, రాతి పొరలను అధ్యయనం చేయడానికి భూగర్భ శాస్త్రవేత్తలు ఉపయోగించే సాంకేతికత. పెర్మియన్ కాలంలో ఒక భౌగోళిక సంఘటన కారణంగా గోండ్వానా ఉపఖండంలో ఒక మహాసముద్రం - నియో - టెథిస్... తెరుచుకుంది. సముద్ర మట్టాలు పెరగడం కూడా గోదావరి లోయలోని బొగ్గు క్షేత్రాన్ని ప్రభావితం చేసింది’ అని అగర్వాల్ తెలిపారు. ‘పాలియో ఎన్విరాన్‌మెంట్ (గత పర్యావరణం)ను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బొగ్గు, రాతి పొరలు సహా మరిన్ని అవక్షేపాలను అధ్యయనం చేశారు. పరిశోధనలో భాగంగా ఆర్గానిక్ కార్బన్ పరిమాణాన్ని కొలిచారు. ఈ క్రమంలో హైడ్రోకార్బన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్లాంక్టానిక్ జీవుల నిక్షేపణను గుర్తించారు. కాబట్టి ఈ హైడ్రోకార్బన్‌లో చమురు, సహజవాయువులు ఉంటాయి’ అని అగర్వాల్ తెలిపారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలను కనుగొనేందుకు ఇదొక ప్రాథమిక ప్రయత్నమని మరో శాస్త్రవేత్త దివ్య మిశ్రా చెప్పారు.
Updated Date - Sep 16 , 2024 | 03:38 AM