చంపి.. సూట్‌కేస్‌లో కుక్కి..
ABN, Publish Date - Nov 06 , 2024 | 05:20 AM
కాయగూరలు తీసుకువస్తానని వెళ్లిన వృద్ధురాలు పొరుగు రాష్ట్రంలోని రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసులో శవమై కనిపించింది.
ఆభరణాల కోసం వృద్ధురాలి దారుణ హత్య
శవాన్ని మాయం చేసేందుకు చెన్నై రైల్లో ప్రయాణం
నెల్లూరు క్రైం, చెన్నై, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): కాయగూరలు తీసుకువస్తానని వెళ్లిన వృద్ధురాలు పొరుగు రాష్ట్రంలోని రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసులో శవమై కనిపించింది. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులోని రాజేంద్రనగర్‌లో మురుగేశం, మణ్యం రమణి (65) దంపతులు ఉంటున్నారు. సోమవారం ఉదయం కూరగాయల కోసం రమణి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఎంత సేపటికీ ఆమె రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం సంతపేట ఇన్‌స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావుకు.. తమిళనాడులోని తిరువళ్లూ జిల్లాలోని మీంజూరు రైల్వే పోలీసులు ఫోన్ చేసి సూట్‌కేసులో వృద్ధురాలి మృతదేహం గుర్తించామని సమాచారమిచ్చారు. సూట్‌కేసు తెచ్చిన నెల్లూరుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఆయన కుమార్తె దివ్యశ్రీ తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పరిశీలించిన ఇన్‌స్పెక్టర్.. ఆమె రమణియేనని రైల్వే పోలీసులకు తెలిపారు. దీంతో మింజూరు రైల్వే పోలీసులు తండ్రీకుమార్తెలను స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా, హత్య చేసిన తీరును వెల్లడించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం కుటుంబం రమణి ఇంటికి సమీపంలోనే ఉంటోంది. వారి మధ్య పరిచయం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాలసుబ్రహ్మణ్యం, తనకు తెలిసిన రమణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం కూరగాయలకు వెళ్లిన వృద్ధురాలితో మాటామాటా కలిపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, కమ్మలు తదితర బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. ఓ ట్రావెల్ సూట్‌కే్‌సలో రమణి మృతదేహాన్ని కుక్కాడు. ఆ సూట్‌కేస్ తీసుకొని బాలసుబ్రహ్మణ్యం, దివ్యశ్రీలు ఊరెళ్తున్నామంటూ నెల్లూరులో చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కారు. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో సూట్‌కే్‌సను బయట పడేయడం కుదరలేదు. చెన్నై సమీపిస్తుండటంతో మీంజూరు స్టేషన్‌లో రైలు దిగేశారు. ప్లాట్‌ఫాంపై సూట్‌కేస్ వదిలి వెళ్తేందుకు ప్రయత్నించగా, ఓ యువకుడు అక్కడే ఉన్న రైల్వే పోలీసులకు ఉప్పందించాడు. వారు సూట్‌కే్‌సను పరిశీలించగా అందులో నుంచి వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆభరణాల కోసమే హత్య చేసినట్లు బాలసుబ్రహ్మణ్యం వెల్లడించినట్లు తెలిసింది. రమణి మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం జరిపించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.
Updated Date - Nov 08 , 2024 | 12:31 PM