Amaravati : రెడ్డీ బ్రదర్స్ కొలతే వేరు
ABN, Publish Date - Oct 20 , 2024 | 03:46 AM
ఒకరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు....మరొకరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఇద్దరూ రెడ్డీ బ్రదర్స్. శాఖాపరంగా అప్పగించిన పనులు కాంట్రాక్టర్లు పూర్తి చేశాక ఇంజనీర్లు జరిగిన పనిని కొలతలు వేసి, మెజర్‌మెంట్ బుక్ (ఎం.బుక్)లో నమోదు చేస్తారు.
సొమ్ములిస్తేనే మెజర్‌మెంట్
ఇరిగేషన్‌లో 2017లో భారీ దందా
ట్రాప్‌వేసి పట్టుకున్న ఏసీబీ..సస్పెన్షన్
వారి క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఇప్పుడు అనుమతి..
ఉత్తర్వులు జారీ
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒకరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు....మరొకరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఇద్దరూ రెడ్డీ బ్రదర్స్. శాఖాపరంగా అప్పగించిన పనులు కాంట్రాక్టర్లు పూర్తి చేశాక ఇంజనీర్లు జరిగిన పనిని కొలతలు వేసి, మెజర్‌మెంట్ బుక్ (ఎం.బుక్)లో నమోదు చేస్తారు. కానీ, ఈ పని చేయడానికి రెడ్డీ బ్రదర్స్ లంచం అడిగి 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అప్పుడే వారిని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లడానికి ఏసీబీకి అనుమతి ఇస్తూ శుక్రవారం జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లోని వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఖాజీపేట గ్రామనివాసి షేక్ ఖదీరుల్లా భార్య షేక్ యాస్మిన్ జన్మభూమి కమిటీ సభ్యురాలు. గ్రామ సర్పంచ్‌తో సహా నలుగురు జన్మభూమి కమిటీ సభ్యులతో కలసి ’డీసిల్లింగ్’ పనులు చేసేందుకు కలెక్టర్ నుంచి ఆమె అనుమతి పొందారు.
2016లో... ఏప్రిల్ 7వ తేదీన రూ.4,96,000, ఆగస్టు 17న రూ.4,96,000, అక్టోబరు 28వ తేదీన రూ.4,95000 విలువైన పనులు.... జన్మభూమి కమిటీకి అప్పగిస్తూ పంచాయతీ తీర్మానం చేసి ఖాజీపేట ఎంపీడీవోకు పంపింది. ఈ తీర్మానాన్ని ఎంపీడీవో... ఖాజీపేట జల వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు పంపారు. ఈ పనులు పూర్తి చేసేలా యాస్మిన్ భర్త షేక్ ఖాదీరుల్లాతో జలవనరులశాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు (ఏఈఈ) పాతకోట వరస్రసాదరెడ్డి ఒప్పందం చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేశాక .. తనకు రావాల్సిన బిల్లుల కోసం ఏఈఈని ఖాదీరుల్లా సంప్రదించారు. అయితే.. బిల్లులు చెల్లించాలంటే ముందుగా పనులు పూర్తి చేసినట్లుగా కొలతలు తీసుకుని బుక్‌లో రికార్డు చేయాల్సి ఉందని, దానికోసం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మిరియాల వెంకట రమణారెడ్డిని కలవాలని ఆయనకు సూచించారు.
వెంకట రమణారెడ్డిని కలిసి ఖాదీరుల్లా తన బిల్లుల విషయం మాట్లాడారు. అయితే, ఎంబుక్‌లో కొలతలు నమోదుచేసి ..ఏఈఈకి పంపాలంటే తనకు రూ.50,000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బేరమాడక ..రూ. 30 వేలకు దిగివచ్చారు. అక్కడ నుంచి బిల్లులు చెల్లించేందుకు ఫైలు ఏఈఈ వరప్రసాద్‌రెడ్డి వద్దకు వెళ్లింది. ఆయన బిల్లులు మంజూరు చేసేందుకు రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. రూ.30,000 ఇస్తానంటే ఒప్పుకోలేదు. దీంతో.. ఖాదీరుల్లా...ఏసీబీని ఆశ్రయించారు. 2017 అక్టోబరు మూడో తేదీన .. పాతకోట వరప్రసాదరరెడ్డి కుడిచేత్తో రూ.50,000, మిరియాల వెంకట రమణారెడ్డి ఎడమ చేత్తో రూ.30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిని జల వనరులశాఖ విధుల నుంచి సస్పెండ్ చేసింది. తాగాజా వీరిద్దరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల చేశారు. కాగా, మిరియాల వెంకట రమణారెడ్డి కడప జిల్లా బద్వేల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 2014 నవంబరు 24 నుంచి 2017 అక్టోబరు మూడో తేదీ వరకు పనిచేశారు. పాతకోత వరప్రసాద్‌రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు జలవనరుల శాఖ స్పెషల్ సబ్ డివిజన్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పాతకోట వరస్రసాదరెడ్డి 2016 జూన్ 27 నుంచి 2017 అక్టోబరు మూడో తేదీదాకా బాధ్యతలు నిర్వహించారు.
Updated Date - Oct 20 , 2024 | 03:46 AM