Share News

తిరుపతిలో ఓపెన్‌ యూనివర్సిటీ!

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:57 AM

హైదరాబాద్‌లో ఉమ్మడిగా కొనసాగుతున్న బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని యుద్ధప్రాతిపదికన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తిరుపతిలో ఓపెన్‌ యూనివర్సిటీ!

హైదరాబాద్‌ నుంచి తరలింపునకు నిర్ణయం

16న ‘షార్ట్‌ సర్క్యులేషన్‌’తో కేబినెట్‌ ఆమోదం

ఈసీ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి ఆర్డినెన్స్‌

ఎన్నికల ముందు జగన్‌ సర్కారు హడావుడి

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉమ్మడిగా కొనసాగుతున్న బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని యుద్ధప్రాతిపదికన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్ల పాటు వర్సిటీ విభజన, ఏపీలో స్టడీ సర్కిళ్ల నిర్వహణ అంశాలను గాలికొదిలేసిన జగన్‌ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు ముందు ఆగమేఘాలపై వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందున బిల్లు పెట్టే అవకాశం లేకపోవడంతో, ఆర్డినెన్స్‌ ద్వారా తిరుపతిలో వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షార్ట్‌ సర్క్యులేషన్‌ విధానంలో మంత్రులకు నోట్‌ పంపి ఆమోదముద్ర వేయించింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఈ నెల 16న ఆ ఫైలుకు కేబినెట్‌ ఆమోదం లభించగా, 19న ఈసీకి ఈ ప్రతిపాదనను పంపాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు ఉన్నత విద్యాశాఖ లేఖ రాసింది. ఈసీ అనుమతిస్తే వెంటనే ఫైల్‌ను గవర్నర్‌కు పంపి ఆర్డినెన్స్‌ జారీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ ఏర్పాటుకు అనుమతితో పాటు మొదట రూ.63.85 కోట్ల బడ్జెట్‌, 50 టీచింగ్‌, 68 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదించింది.

పదో షెడ్యూలులో వర్సిటీ

1982లో హైదరాబాద్‌లో స్థాపించిన ఓపెన్‌ యూనివర్సిటీ రాష్ట్ర విభజన సమయంలో పదో షెడ్యూలు పరిధిలోకి వెళ్లింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లు అవుతున్నా ఈ షెడ్యూలులో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. అయినా ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, ఇతర సంస్థలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. కానీ ఓపెన్‌ వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓపెన్‌ వర్సిటీకి ఏపీలో 76 స్టడీ సర్కిళ్లున్నాయి. 16 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 500 మంది పార్ట్‌టైం సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే, విద్యార్థులు చెల్లించే ఫీజులు మాత్రం హైదరాబాద్‌లోని యూనివర్సిటీకి వెళ్తున్నాయి. దూర విద్య ద్వారా ఏటా 30వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. వీరంతా కలిపి సంవత్సరానికి రూ.13కోట్లకు పైగా ఫీజులు కడుతున్నారు. ఈ వర్సిటీని విభజించాలని ఎప్పటినుంచో డిమాండ్‌ ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, ఎన్నికల షెడ్యూలు వచ్చాక దీనిపై ఫైలు పెట్టింది. అయితే తిరుపతిలో ఏర్పాటు చేసేది కొత్త వర్సిటీ అవుతుందా లేక పాతదానిగానే పరిగణిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఉన్న ఏపీ చట్టమే ఇప్పుడు ఏర్పాటు చేయబోయే దానికీ వర్తిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ విభజించకుండానే హైదరాబాద్‌లో ఉన్న వర్సిటీని ఏపీకి తరలిస్తే అది కొత్తదే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో వర్సిటీని ఏర్పాటుచేసినా, ఉమ్మడి వర్సిటీపై కొంతకాలం పాటు ఆధారపడాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Mar 24 , 2024 | 02:57 AM