ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మన నేతన్నల పొట్టగొట్టి!

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:18 AM

‘చేనేతను బలోపేతం చేస్తాం.. ఆప్కోను ప్రక్షాళన చేస్తాం

మీషన్ల కక్కుర్తితో పొరుగు రాష్ర్టాలకు దుప్పట్ల ఆర్డర్లు.. జగన్‌ సర్కారు ఒప్పందం.. బాబు ప్రభుత్వంలో అమలు

‘చేనేతను బలోపేతం చేస్తాం.. ఆప్కోను ప్రక్షాళన చేస్తాం’.. అంటూ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత భరోసా ఇస్తుంటే.. ‘ధర్మవరంలో చేనేతలకు క్లస్టర్లు కావాలి.. వారి అభివృద్ధికి కేంద్రం సాయం చేయా లి’.. అంటూ మంత్రి సత్యకుమార్‌ కేంద్ర పెద్దలకు ఢిల్లీలో వినతులి స్తున్నారు. ‘నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు.. నేను ఎప్పటికీ మీ(చేనేత) వాడినే’ అంటూ మంగళగిరి నేతన్నలకు మంత్రి నారా లోకేశ్‌ మాటిచ్చారు!. అయితే ఇవేవీ గిరిజన సంక్షేమశాఖకు వినిపించినట్లు లేదు. నేతన్నలకు చేయూత ఇవ్వాల్సిన ఆ శాఖ.. కమీషన్ల కోసం పొరుగు రాష్ట్రాల బాటపడుతోంది! మన రాష్ట్రంలోని పలు సొసైటీల్లో దుప్పట్లు నిల్వ ఉన్నా వాటిని కొనుగోలు చేయకుండా రూ.కోట్లు ఖర్చు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోంది. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి మన నేతన్నల పొట్టగొడుతోంది!!.

గిరిజన సంక్షేమశాఖ తీరుపై

నేతన్నల మండిపాటు

ఆర్డర్‌ రద్దు చేసి తమను ఆదుకోవాలని వినతి

వైసీపీ సర్కారు ‘కమీషన్‌ కొనుగోళ్ల’పై

విచారణకు డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు పంపిణీ చేసేందుకు కోట్ల ఖర్చుతో దుప్పట్లు, బెడ్‌ షీట్లు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే మన రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు, ఆప్కో ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంది. అలా కాకపోతే టెండర్లు ఆహ్వానించి చేనేత జౌళిశాఖ ద్వారా లేదా, తక్కువ ధరకు ఎవరు సరఫరా చేస్తే వారికైనా ఆర్డర్‌ ఇవ్వాలి. కానీ కోట్లాది రూపాయల దుప్పట్ల కొనుగోలు ఆర్డరు తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు వ్యాపారికి ఏపీ గిరిజన సంక్షేమ శాఖ గుట్టుచప్పుడు కాకుండా ఇచ్చేసింది. ఈ విద్యాసంవత్సరానికి గానూ రూ.40కోట్ల విలువైన దుప్పట్లు కొనుగోలుకుగాను మొదటి విడతగా రూ.8.50కోట్ల దుప్పట్ల సరఫరాకు హైదరాబాద్‌లోని నింబోలి అడ్డాలో ఉన్న వస్త్ర వ్యాపారికి ఆర్డర్‌ ఇచ్చింది. చేనేతకు అన్ని విధాలా చేయూత అందించే చంద్రబాబు ప్రభుత్వంలోని ఒక సంక్షేమ శాఖ ఇలా చేయడం తీవ్ర ఆక్షేపణీయమంటూ నేతన్నలు మండిపడుతున్నారు.

వైసీపీ ప్రభుత్వ నిర్ణయమే ఇప్పటికీ..

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొందరు అధికారులకు పాత వాసనలు ఇంకా పోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. గడచిన ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు, ఇప్పుడూ అదే పద్ధతి అవలంబిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారితో గిరిజన సంక్షేమ శాఖ దుప్పట్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. అదిగో.. ఇదిగో.. అనే లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. జూన్‌ 12న మంత్రివర్గం ఏర్పడగా రెండు వారాలు తిరక్కుండానే జూన్‌ 25న గిరిజన సంక్షేమ శాఖమంత్రితో జగన్‌ ప్రభుత్వంలో ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించారు. మొదటి విడతలో భాగంగా 62,103 దుప్పట్లు సరఫరా చేయాలంటూ ఈ నెల 1న ఆర్దర్‌ ఇచ్చారు.

కమీషన్‌ బాధ్యత ఉత్తరాంధ్ర దళారీదే..

కాగా, జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు లేనందున కమీషన్లు ఇప్పించే బాధ్యత ఉత్తరాంధ్రకు చెందిన ఒక దళారీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్లి విశాఖపట్నంలో స్థిరపడ్డ ఆ దళారీ ఆప్కో, ఇతర చేనేత వస్త్రాలకు సంబంధించిన కొనుగోళ్లలో వేలు పెడుతుంటాడు. ఐఏఎస్‌ అధికారులతో పరిచయాలు పెంచుకుని వారి పేరు చెప్పి సరఫరాదారులతో లబ్ధి పొందుతుంటాడు. ఆ వ్యక్తే గిరిజన సంక్షేమ శాఖ ఆర్డర్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆర్డర్‌ రద్దు చేసి మన చేనేతను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు విన్నవించేందుకు చేనేత సంఘాల ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.

పొరుగు వస్త్రం కొనుగోళ్లన్నీ కమీషన్ల కోసమే!

ఆంధ్రప్రదేశ్‌లో లక్షన్నర వరకూ చేనేత మగ్గాలుంటే సుమారు 800 చేనేత సహకార సంఘాలున్నాయి. వాటి ద్వారా ఉపాధి పొందే నేతన్నను ఆదుకోవడానికి గత ప్రభుత్వాలు నూలు, పట్టు, ఇతర ముడిసరుకు రాయితీపై సరఫరా చేసి కార్మికులను ఆదుకునేవి. సహకార సంఘాల నుంచి ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాన్ని కొనుగోలు చేసి చేనేతకు ఊతమిచ్చేవి. ఆప్కో వస్త్రాల విక్రయాలకు తోడ్పాటు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా శ్రమించింది. అయితే జగన్‌ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ కోసం కోట్లాది మీటర్ల వస్త్రం అవసరం కాగా మన రాష్ట్రంలోని ఒక్క చేనేత సంఘానికి లేదా కార్మికుడికి నూలు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ జగన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌ మన చేనేతల వద్దే కొనుగోలు చేయాలంటూ ఆదేశించినట్లు బహిరంగంగా చెప్పారు. ఆరా తీస్తే పొరుగు రాష్ట్రాల నుంచి కమీషన్ల కోసం వస్త్రాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. టెక్స్‌టైల్స్‌ కమిటీ ద్వారా కొన్నామని పైకి అధికారులు చెప్పినా.. నాణ్యతను నిర్ధారించే ‘రైట్స్‌’ వద్దన్నా కొనుగోలు చేయడం వెనుక కోట్లాది రూపాయల కమీషన్లు చేతులు మారినట్లు బలమైన వాదన వినిపిస్తోంది. ఈ బాగోతంతో పాటు తాజాగా గిరిజన సంక్షేమశాఖ ఇచ్చిన ఆర్డర్‌పై విచారణ జరిపించాలని నేతన్నలు ప్రభుత్వాన్ని కోరనున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 07:16 AM

Advertising
Advertising
<