Pawan kalyam : పంచాయతీల్లో బ్లీచింగ్‌కూ డబ్బుల్లేవు
ABN, Publish Date - Jul 27 , 2024 | 03:08 AM
పంచాయతీలకు భారీగా నిధులున్నట్లు ఖాతాల్లో డబ్బులు కనిపిస్తున్నాయి.
పారిశుద్ధ్య కార్మికులు 23 వేల మందికి జీతాలు 103 కోట్లు పెండింగ్
నిధుల్లో అవకతవకలనేకం, దారి మళ్లింపు
శ్వేత పత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం
ఎన్నికల నిర్వహణలో రెండున్నరేళ్లకు పైగా ఆలస్యం
పీఎ్‌ఫఎంఎ్‌సతో అనుసంధానంలోనూ నిర్లక్ష్యం
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ‘పంచాయతీలకు భారీగా నిధులున్నట్లు ఖాతాల్లో డబ్బులు కనిపిస్తున్నాయి. అయితే బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా వాటిని డ్రా చేసుకోలేని పరిస్థితి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 14, 15 ఆర్థిక సంఘాల నిధుల గురించి ఎమ్మెల్యేలు కూన రవి కుమార్, చింతమనేని ప్రభాకర్, బీఎన్ విజయ్‌కుమార్, గొండు శంకర్, గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘గత ప్రభుత్వం నుంచి ఆర్థిక దుర్నిర్వహణ మాకు వారసత్వంగా వచ్చింది. ఇది చాలా ప్రతికూలంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలోచిస్తున్నాం. 14, 15 ఆర్థిక సంఘాల నుంచి ఏపీకి రూ.8,283 కోట్లు వచ్చాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు వచ్చినా, వైసీపీ ప్రభుత్వం తన వాటా విడుదలలో జాప్యం చేసింది. సకాలంలో నిఽధులు ఇవ్వకపోవడం వల్ల 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రూ.103 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా రూ.2,281 కోట్లను నేరుగా డిస్కంలకు చెల్లించారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా రెండు సంవత్సరాల ఏడు నెలలు ఆలస్యం చేశారు. కేంద్రానికి గ్రాంట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లను ఇవ్వడంలోనూ ఆలస్యం చేశారు. ఆర్థిక సంఘం నిధుల కోసం పంచాయతీలను పీఎ్‌ఫఎంఎ్‌సతో అనుసంధానం చేయకుండా నిర్లక్ష్యం చేసింది’ అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనాభాలో మార్పులు లేనప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో తేడా ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించిన ఎమ్మెల్యే కూన రవికుమార్... రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.
Updated Date - Jul 27 , 2024 | 03:08 AM