ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan : బాబు అనుభవంతోనే ఇది సాధ్యం!

ABN, Publish Date - Jul 02 , 2024 | 03:46 AM

వలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని..

వలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ

జగన్‌ సర్కారులో కనివినీ ఎరుగని విధ్వంసం

‘పంచాయతీ’లో తవ్వేకొద్దీ బాగోతాలు: పవన్‌

కాకినాడ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని.. కానీ దానిని పటాపంచలు చేస్తూ వారు లేకుండానే పింఛన్లు పంపిణీ చేశామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అపార అనుభవం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్ది రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగేది ఆయనేనని తేల్చిచెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. అధికార వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి వ్యవస్థలను బాగుచేసే పనిలో ఉన్నామని, తమది కరెక్షన్‌ ప్రభుత్వమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తొలిసారి సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ సభలో ప్రసంగించారు. తెలిపారు. పిఠాపురంలో స్థలం కోసం చూస్తున్నానని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

ఒక్కొక్కరి నుంచి రూ.300 లంచం!

చంద్రబాబు అపార అనుభవంరాష్ట్రానికి చాలా అవసరం. ఆయన అనుభవం వల్లే ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వగలుగుతున్నాం. గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా పంపిణీ చేసింది. వీరేమో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.300 వరకు లంచంగా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని వైసీపీ ప్రచారం చేసింది. కానీ ఏమైంది..? ప్రతి ఒక్కరికీ రెట్టింపు డబ్బులు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. కానీ ప్రైవేటు ఉద్యోగికి బాధ్యత ఉండదు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలాగా అని ఆలోచిస్తున్నాం.

ఎన్ని తిట్టినా పట్టించుకోం..

పౌరసరఫరాల శాఖలో ఎంత అవినీతి జరిగిందో చూడండి. ప్రజల బియ్యాన్ని గోడౌన్‌లో ఎలా దాచారో అంతా చూడాలి. ఇది పేదల డబ్బు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను చంపేసి వ్యక్తులు పెరిగిపోయారు. అడ్డగోలుగా అవినీతి జరిగింది. కడపలో బెరైటీస్‌ గనులను ఖాళీ చేసేశారు. ఇసుకతోపాటు అనేక వాటిలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. మాది కరెక్షన్‌ ప్రభుత్వం. మేం ఎవరిపైనా కక్ష సాధించడానికి లేం. వైసీపీ వాళ్లు ఎన్ని తిట్టినా పట్టించుకోం. కాకపోతే వారి తప్పులను బయటకు తీస్తాం. నా జీవితంలో వందల కోట్లు సంపాదించాను. ఆడిటర్‌ లెక్కలు చూపిస్తే తలనొప్పి వచ్చేది. పన్ను ఎంత కట్టాలని మాత్రమే అడిగేవాడిని. గంట లేదా రెండు గంటలు మాత్రమే నా లెక్కలు చూసేవాడిని. కానీ ప్రజల డబ్బుకు వచ్చేసరికి.. పంచాయతీరాజ్‌శాఖలో లెక్కలు చూస్తూ జనం కోసం ఆడిటర్‌గా మారాను. ఈ శాఖ మంత్రిగా అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలచుకోలేదు. పంచాయతీరాజ్‌శాఖలో తవ్వేకొద్దీ గత ప్రభుత్వ బాగోతాలు చాలా బయట పడుతున్నాయి. అడ్డగోలుగా నిధులు దారిమళ్లించేశారు. అసలు ఎటు వెళ్లాయో తెలియదు.

జీతం వద్దన్నాను..

మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక నా క్యాంప్‌ ఆఫీసుకు మరమ్మతులు చేయించాలని అధికారులు చెప్పారు. వద్దన్నాను. నా కొత్త ఫర్నిచర్‌ నేనే తెచ్చుకుంటానన్నాను. ఇటీవల అసెంబ్లీకి వెళ్లినందుకు జీతం వస్తుందని అధికారులు చెబితే... ఇన్ని అప్పులు కనిపిస్తుంటే...తీసుకోవడానికి మనసు అంగీకరించలేదు. వదిలేసుకుంటున్నానని చెప్పాను.


వైసీపీ అవినీతి నేపాల్లో తేలింది!

వైసీపీ పాలనలో అవినీతి నేపాల్‌దాకా విస్తరించిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అటవీశాఖ మంత్రిగా ఇటీవల తాను సమీక్ష నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పారు. శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం దుంగలను దేశం దాటించగా.. అవి నేపాల్లో దొరికాయన్నారు. వాటిని వెనక్కి తీసుకురావడానికి సంబంధించిన ఫైలు తన వద్దకు వచ్చిందని చెప్పారు. వైసీపీ పాలనలో ఎర్రచందనం అడ్డగోలుగా దేశాలు దాటిపోయిందని.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి అమ్మేసుకున్నారన్నారు. వీటిని మన చెక్‌పోస్టులు వదిలేస్తే నేపాల్‌ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. కాగా, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల డీఎస్సీ పోస్టులను ప్రభుత్వం ప్రకటిస్తే ఇంతేనా అంటున్నారని, ఒక్క అటవీ శాఖలోనే లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. అయితే భర్తీ చేయడానికి ఖజానాలో డబ్బులు లేవన్నారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లలో కొన్ని డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు.

పూల కార్పెట్‌పై నడిచేందుకు నిరాకరణ

అంతకుముందు పవన్‌ రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి నేరుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపా్‌సరోడ్డులోని తన నివాసానికి చేరుకున్నారు. నివాసంలోకి వెళ్లే దారిలో గులాబీ పూలతో కార్పెట్‌లా పరచగా.. దానిపై నడిచేందుకు పవన్‌ సున్నితంగా తిరస్కరించారు.

కనిపించే దేవుడు చంద్రబాబు..

చంద్రబాబు మా గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. మాకు పింఛన్‌ రూ.6వేలు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నా భర్య, నేను ఇద్దరం వికలాంగులమే. ఒక్కొక్కరికీ రూ.6వేల చొప్పున రూ.12వేలు ఇస్తున్నారు. దీంతో మా సంసార కష్టాలు తగ్గిపోతాయి.

- వడ్డె చెన్నప్ప, దివ్యాంగుడు, బోడబండ గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా

బాబు, పవన్‌ ఫొటోలు పెట్టుకుంటాం

వారాహి యాత్ర సమయంలో జనవాణిలో మా సమస్యలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చాం. సీఎం చంద్రబాబుకు వివిధ సందర్భాల్లో వివరించాం. మంచానికి పరిమితమైన దివ్యాంగులకు రూ.10వేలు అడిగితే రూ.15వేలు చేశారు. మా ఇళ్లల్లో చంద్రబాబు, పవన్‌ ఫొటోలు పెట్టుకుంటాం.

- మేడిశెట్టి నాగమణి, దివ్యాంగురాలు, గొల్లప్రోలు, కాకినాడ జిల్లా

నా పెద్దకొడుకు చంద్రబాబు

ఉన్న ఒక్క కొడుకు చూసుకోవడం లేదు. పూరి గుడిసెలో ఉంటున్నా. ఎవరో ఇంత కూడు పెడితే తిని కాలం చేస్తున్నా. చంద్రబాబే నా పెద్దకొడుకు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కసారే పింఛన్‌ రూ.వెయ్యి పెంచాడు. ఈదినం రూ.7వేలు ఇచ్చినారు. నేను చంద్రబాబు వద్దకు పోలేను. నాకు బాబు ఫొటో ఇవ్వండి.. ఒక్కసారి నా పెద్దకొడుకు కు ముద్దు పెడతా.

- మంగమ్మ, సాదాపురం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా

చాలా ఆనందంగా ఉంది

మంచం దిగలేను. ఎలాంటి ఆదాయంలేని నేను కుటుంబానికి భారం కాకుండా ఏదోలా చేదోడు అందించేందుకు చంద్రబాబు అందించిన పింఛను దోహదపడుతోంది. ఇది ఇంటిలో నాకు గౌరవాన్ని మరింత పెంచింది. రూ.7వేలు పింఛన్‌ అందుకున్నాను. చాలా ఆనందంగా ఉంది.

- ఆర్‌.లక్ష్మీనరసింహమ్మ, విజయనగరం

Updated Date - Jul 02 , 2024 | 03:46 AM

Advertising
Advertising