పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:19 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటనకు సంబంధించిన విచారణ ముమ్మరంగా సాగుతోంది.

పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు

మాధవరెడ్డిని విచారిస్తున్న అధికారులు

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌

‘అగ్గి’ ఘటనలో కీలక పరిణామం

2 బస్తాల డాక్యుమెంట్లు స్వాధీనం

సబ్‌కలెక్టరేట్‌ ఉద్యోగుల విచారణ

ఏఎస్పీ ఆధ్వర్యంలో 10 బృందాలు

డీఆర్‌వో ఆధ్వర్యంలో ఐదు బృందాలు

11 మండలాల రికార్డులు సీజ్‌

రంగంలోకి రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

అన్నీ తేలుస్తాం: సిసోడియా

గౌతమ్‌ తేజ్‌ పక్కా ప్లాన్‌!

ముందే ఇంజన్‌ ఆయిల్‌ తెచ్చి బీరువాలో

రాయచోటి, జూలై 23(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటనకు సంబంధించిన విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి పోలీసుల అదుపులో ఉన్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేర కు.. పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్న ట్టు తెలిసింది. మంగళవారం ఉదయం నుంచి పోలీసు లు సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులను విడివిడిగా విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌ ఆధ్వర్యంలో పది పోలీసు బృందాలు, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐదు రెవెన్యూ బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఆర్డీవో స్థాయి అధికారుల పర్యవేక్షణలో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని 10 మండలాలు, పీలేరు నియోజకవర్గం కలికిరి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను అధికారులు సీజ్‌ చేసి జిల్లా కేంద్రమైన రాయచోటికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలు ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు.

మాధవరెడ్డి మహా ముదురు!

పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి మహా ముదురని పోలీసులు భావిస్తున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన భూవ్యవహారాలు ఆయనే చూసేవారని సమాచారం. పెద్దిరెడ్డి తరపున 22ఏ ఫైళ్లు చూడడంతో పాటు, వివాదాస్పద భూముల్లో పెద్దిరెడ్డి పేరుతో జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్లు చేసేవారని తెలుస్తోంది. మదనపల్లె పట్టణం చుట్టూ.. రూ.వందల కోట్ల విలువ చేసే భూవ్యవహారాల్లో మాధవరెడ్డి పాత్ర ఉన్నట్టు సమాచారం. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని తగలబెట్టక ముందు వారం రోజుల నుంచి ఆయన ప్రతిరోజూ అక్కడకు వెళ్లి అక్కడి ఉద్యోగులతో మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే, మంగళవారం ఉదయం నుంచి కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మదనపల్లెలో మకాం వేశారు. అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌తేజ్‌, వాచ్‌మెన్‌ రమణయ్యతో పాటు మరికొందరితో కలిపి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసినట్లు సమాచారం. ఘటన ఏ విధంగా జరిగింది? ఎవరు అగ్గి పెట్టారు? వంటివి పోలీసులు నిర్ధారించుకున్నట్లు తెలిసింది. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సెక్షన్ల వారీగా ఉద్యోగులను విడివిడిగా పోలీసులు విచారిస్తున్నారు. గతంలో ఏయే ఫైళ్లు చేశారు? ఎవరెవరు వచ్చేవాళ్లు? అక్రమ వ్యవహారాలు ఎవరు నడిపారు? సూత్రధారులు ఎవరు? అనే కోణాల్లో ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ఘటనపై అటు రెవెన్యూ, ఇటు పోలీసు బృందాలు విడివిడిగా విచారణ సాగిస్తున్నాయి. కాలిపోయిన ఫైళ్ల బూడిదను ఫోరెన్సిక్‌ బృందం సీజ్‌ చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది.

11 మండలాల రికార్డులు సీజ్‌

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని దహనం చేసిన ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్దిరెడ్డి కుటుంబం పలు భూఅక్రమాలకు పాల్పడిందనే ఆరోపణల నేపధ్యంలో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు, పీలేరు నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని రెవెన్యూ రికార్డులను ఆర్డీవో స్థాయి అధికారితో పరిశీలించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో కాలిపోయిన 22ఏ ఫైళ్లలో ఇక్కడి నుంచి ఏ రికార్డులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఎవరికి సంబంధించినవని ఆరా తీశారు. వాటిని మంగళవారం కలెక్టర్‌ కార్యాలయానికి తరలించారు.

పూర్తిస్థాయి విచారణ: సిసోడియా

‘మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌కు అగ్గి’ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్టు రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా తెలిపారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ విద్యాసాగర్‌లతో కలసి సబ్‌కలెక్టర్‌ భవనంతో పాటు, ఆవరణలోని అన్ని ప్రాంతాలను తనిఖీ చేశారు. ఏ గది నుంచి మంటలు వ్యాపించాయి, ఆర్డీవో చాంబర్‌కు ఎందుకు మంటలు రాలేదు.. తదితర వివరాలను సేకరించారు. 22ఏ విభాగంలో కాలిపోయి మిగిలిన ఫైళ్ల ముక్కలను పరిశీలించారు. అగ్గి ఘటనకి గల కారణాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటామని సిసోడియా తెలిపారు.

బీరువాలో 7 లీటర్ల ఇంజన్‌ ఆయిల్‌

ముందే తెచ్చి పెట్టిన సీనియర్‌ అసిస్టెంట్‌

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతమ్‌తేజ్‌ పక్కా పధకం ప్రకారమే వ్యవహరించినట్టు సమాచారం. అగ్గి ఘటన జరగడానికి ముందుగానే సుమారు 7 లీటర్లు ఇంజన్‌ ఆయిల్‌ తెచ్చి తన బీరువాలో ఉంచినట్లు తెలిసింది. కార్యాలయానికి నిప్పు పెట్టినరోజు ఈ ఇంజన్‌ ఆయిల్‌ని ఉపయోగించినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఎవరీ మాధవరెడ్డి?

వి. మాధవరెడ్డి అలియాస్‌ రైస్‌మిల్లు మాధవరెడ్డి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందినవారు. తొలుత భవన నిర్మాణ రంగంలో ఉన్నాక రైస్‌మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్‌ హయాంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉండి తర్వాత అనుచరుడిగా మారారు. అప్పట్లో వెలుగు చూసిన ధాన్యం కుంభకోణంలో మాధవరెడ్డి పాత్ర ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అక్రమాలకు తెరలేపారు. పలు మండలాల్లో 22ఏ కింద నిషేధిత భూముల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని బెదిరించి రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. ఇలా కొన్న భూములను పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత, మాధవరెడ్డి, ఆయన కుమారుడు మౌని్‌షరెడ్డి పేర్ల మీద రిజిస్ర్టేషన్లు చేయించారు. ఒక్క కురబలకోట మండలంలోనే 500 ఎకరాలు, తంబళ్లపల్లెలో 200 ఎకరాలు, మదనపల్లెలో 100 ఎకరాలు, బి.కొత్తకోటలో 50 ఎకరాలకుపైగా బినామీ పేర్లతో మాధవరెడ్డి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 24 , 2024 | 05:20 AM

Advertising
Advertising
<