Pinnelli : ఇదేమి తీర్పు?
ABN, Publish Date - Jun 04 , 2024 | 04:16 AM
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
పిన్నెల్లికి బెయిల్‌పై సుప్రీం విస్మయం
ఆయనకు రక్షణ కల్పించడం పెద్ద జోక్ అని వ్యాఖ్య
నేడు కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి వెళ్లొద్దు
ఆ పరిసరాల్లో కూడా కనిపించొద్దు
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
వ్యవస్థలను అపహాస్యం చేసేలా హైకోర్టు తీరు
సిటింగ్ ఎమ్మెల్యే బూత్‌లోకి వెళ్లి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేశారు
అది మార్ఫింగ్ వీడియో కాదు
‘గుర్తు తెలియని వ్యక్తుల’పై కేసు పెడతారా?
ధర్మాసనం ఆక్షేపణ
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వ్యవస్థలను అపహాస్యం చేసేలా ఉంది. ఈ తీర్పుపై మేం స్టే ఇవ్వకుంటే అది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్లే.
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు
చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా జరిగిన ప్రత్యక్ష ప్రసారం నుంచి తీసిన వీడియో ఇది. దీనిని మార్ఫింగ్ వీడియో అనడానికి వీల్లేదు.
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హైకోర్టు తీరు వ్యవస్థలను అపహాస్యం చేసేలా ఉందని వ్యాఖ్యానించింది. మంగళవారం ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి తన నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన కనిపించకూడదని తేల్చిచెప్పింది. మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల వైసీపీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి.. అక్కడ ఈవీఎంతోపాటు వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పిన్నెల్లిపై తక్షణ చర్యలకు ఆదేశించింది. దాంతో ఆయన గృహనిర్బంధం నుంచి పరారయ్యారు. అజ్ఞాతంలోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. దీనిపై బాధితుడు శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని కోరారు. ఆయన కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని, కౌంటింగ్ కేంద్రం వద్దకు రానివ్వకుండా ఆదేశాలు జారీచేయాలని మరో పిటిషన్ వేశారు.
ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నా అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. హైకోర్టు తీరు వ్యవస్థలను అపహాస్యం చేసేలా ఉందని, ఇది ముమ్మాటికీ న్యాయాన్ని అవహేళన చేయడమేనని మండిపడింది. శేషగిరిరావు తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అందరూ చూస్తుండగానే పిన్నెల్లి విచక్షణరహితంగా వ్యవహరించారని, ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైనా దాడికి పాల్పడ్డారని తెలిపారు. పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది వికా్‌ససింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అది ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన వీడియో కాదన్నారు. ప్రస్తుతం ఎన్నో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయని, వాటన్నింటినీ నిజమైనంగా భావించలేమని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం విడుదల చేసిన వీడియోను ఆదినారాయణరావు ధర్మాసనం ముందు ప్రదర్శించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ను ఎమ్మెల్యే ధ్వంసం చేసినట్లు వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయలేదని.. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Updated Date - Jun 04 , 2024 | 04:16 AM