గోడదూకి ‘పిన్నెల్లి’ సోదరులు పరార్!
ABN, Publish Date - May 18 , 2024 | 04:52 AM
పల్నాడుజిల్లా మాచర్లలో సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తూ హింసకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
తొలుత తాడేపల్లి ప్యాలె్‌సకు, ఆ తర్వాత ఇంటికి.. అర్ధరాత్రి దాటాక అక్కడి నుంచి పరార్
దీని వెనుక ‘తాడేపల్లి స్కెచ్’?.. మాచర్ల మారణహోమంపై ఈసీకి కమిషన్ పరిశీలకుల నివేదిక
కఠిన చర్యలకు ఆదేశించే అవకాశం.. దీనిని గుర్తించి పారిపోయిన బ్రదర్స్.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి
గుంటూరు, మే 17(ఆంధ్రజ్యోతి): పల్నాడుజిల్లా మాచర్లలో సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తూ హింసకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గురువారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరూ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సుమారు గంటపైనే ఉండి.. పలు విషయాలు చర్చించినట్టు తెలిసింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో గన్‌మెన్లను కింద ఉంచి ఇంటిలోని మేడ పైన ఉన్న గదికి చేరుకున్నారు. ఇంతలో పల్నాడు కలెక్టర్, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయాన్ని తెలుసుకున్నారు. అంతే.. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక ఉన్న గోడ దూకి ప్రయివేటు వాహనాల్లో పారిపోయినట్లు తెలిసింది. అయితే.. వీరు ఈసీ కన్నుగప్పి పరారవడం వెనుక ‘తాడేపల్లి పెద్దల స్కెచ్’ ఉండి ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. కాగా, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాచర్లలో ఘోర అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి సోదరుల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ సీరియ్‌సగా ఉందని తెలియటం, తాడేపల్లికి వెళ్లి వైసీపీ పెద్దలను కలిసి రావడం, ఆ వెంటనే గోడదూకి పారిపోవడం గమనిస్తే.. పక్కా వ్యూహంతోనే వారు పరారైనట్టు మాచర్లలో చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే, ఎన్నికలకు ముందు, తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు సృష్టించిన అల్లర్లు అన్నీ ఇన్నీ కాదు. పోలీసులు తమ చెప్పుచేతల్లో ఉన్నారన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌పై ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పిన్నెల్లి అండ చూసుకుని వైసీపీ నేతలు, కొందరు రౌడీ షీటర్లు పోలింగ్ ఏజంట్లను లక్ష్యంగా చేసుకుని విజృంభించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమించిన పరిశీలకులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలపై ఈసీకి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే, ఆయన సోదరుడిపై ఈసీ కఠిన చర్యలకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. దీనిని ముందుగానే గ్రహించిన పిన్నెల్లి బ్రదర్స్ పారిపోవడం గమనార్హం.
ఇవీ దారుణాలు
రెంటచింతల మండలం రెంటాలలో పోలింగ్ ఏజంట్‌గా ఉన్న చేరెడ్డి మంజుల, ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డి పై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. రెంటాలలో పోలింగ్ ప్రక్రియ పరిశీలించేందుకు వెళ్లిన కూటమి అభ్యర్థి, టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి కళ్లలో కారం కొట్టి హత్యాయత్నం చేయడంతో పాటు, నాలుగు కార్లకు నిప్పు పెట్టారు.
టీడీపీకి బూత్‌లలో అసలు ఏజంట్లు లేకుండా చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే సోదరుల డైరెక్షన్‌లో అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.
ఎమ్మెల్యే సొంత గ్రామం అయిన వెల్దుర్తి మండలం కర్లకుంటలో దళిత వర్గానికి చెందిన పోలింగ్ ఏజంట్ నోముల మాణిక్యం కుటుంబం పట్ల మరింత దారుణంగా ప్రవర్తించారు.
నోముల మాణిక్యం టీడీపీ ఏజంట్‌గా ఉండి, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో ఇంట్లో ఉన్న ఆయన భార్య, పిల్లలను ఘోరంగా కొట్టారు. వారిని కొడుతూ, హింసిస్తూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా మాణిక్యానికి చూపించారు. అయినప్పటికీ మాణిక్యం పోలింగ్ బూత్ నుంచి బయటకు రాకపోవడంతో ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ఆయనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి మాణిక్యం చొక్కా పట్టుకుని మరీ బయటకు లాక్కొచ్చారు.
ఎన్నికల పోలింగ్ రోజు గిరిజన సామాజిక వర్గానికి చెందిన పోలింగ్ ఏజంట్లపై దాడులకు పాల్పడటంతో పాటు, వారి ఇళ్లను కూడా ధ్వంసం చేశారు.
పోలింగ్ ముగిసిన తర్వాత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కారంపూడి మండలంలో తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు.
తెలంగాణ నుంచి 300 మంది రౌడీలను తీసుకొచ్చి అక్కడ స్వైరవిహారం చేశారు. కారంపూడి మండలం పేటసన్నెగండ్లలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీకి చెందిన నాయకులు, సానుభూతిపరుల కారులను, ఇళ్లను ధ్వంసం చేశారు.
చేతుల్లో కర్రలు, కత్తులు పట్టుకుని కారంపూడిలో వీరంగం సృష్టించారు. ఈ సందర్భంగా జరిగిన వైసీపీ నేతల రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
వైసీపీ కార్యకర్తలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నారాయణస్వామిపై కూడా రాళ్లతో దాడికి తెగబడ్డారు. మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎన్నికల వేళ మాచర్ల నియోజకవర్గంలో అరాచకానికి ఒడిగట్టారు.
చాలాచోట్ల టీడీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుండి బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు రెండు రోజులు కూడా పిన్నెల్లి సోదరులు అరాచకం సృష్టించారు.
ఎన్నికల్లో జరిగిన హింసపై ఈసీ సీరియస్ కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Updated Date - May 18 , 2024 | 04:52 AM