Sankranti: పట్నం తరలొచ్చింది.. గ్రామ సీమలో పొలిటికల్ పొంగల్!
ABN, Publish Date - Jan 15 , 2024 | 02:50 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతుండగా.. ఏపీలో రాజకీయ నాయకులు పండగను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా....
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతుండగా.. ఏపీలో రాజకీయ నాయకులు పండగను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా.. పబ్లిసిటీ కోసమండీ!. ఆంధ్రలో సంక్రాంతే పెద్ద పండుగ. దీంతో ఎక్కడున్నా ప్రజలు రెక్కలు కట్టుకుని సొంతూళ్లలో వాలిపోతారు. మరి ఇలాంటి ఛాన్స్ రాజకీయ నాయకులు వదులుకుంటారా.. అసలే ఎన్నికల కాలం.. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
వాళ్లొచ్చారు.. వీళ్లు రెడీ!
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ - జనసేన కూటమి నేతలు విస్త్రృతంగా పర్యటిస్తున్నారు. సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవాలని వారు అనుకుంటున్నారు. ఇంఛార్జ్‌ల మార్పుతో వైసీపీ అల్లకల్లోలం అవుతుంటే, వైసీపీ నుంచి బయటకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను చేర్చుకునే పనిలో పడింది టీడీపీ. ఇటీవలే అంబటి రాయుడు వంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. ఇంకా చాలా మంది అసంతృప్తులు వైసీపీని వీడటానికి రెడీగా ఉన్నారు. పండగ కోసం వేల సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు వచ్చారు. జనమంతా రావడంతో ఊళ్లకు అతుక్కుపోయారు రాజకీయ నాయకులు. ఎప్పుడూ చూడని ముఖాలు కూడా తారసపడుతున్నట్లు కొందరు చెప్పుకుంటున్నారు.
ప్రత్యర్థులపై బాణాలు!
సీఎం జగన్ 175 సీట్లు టార్గెట్ అంటూ, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ని రాష్ట్రం నుంచి తరమికొట్టాలంటూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అరాచక పాలనను అంతమోందించాలంటూ.. ఇలా ఎవరికివారు ప్రత్యర్థులపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. వచ్చిన ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక గిఫ్టులు రెడీ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ తరఫున కోళ్ల పందేలు నిర్వహిస్తున్నవారూ ఉన్నారు. ఇక రాత్రి పార్టీల గురించి వేరే చెప్పనక్కర్లేదు. జనాల అభిరుచులను తెలుసుకుని వాటికనుగుణంగా పనులు చేసి ప్రసన్నం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో సంక్రాంతి కంటే ఎక్కువ ముచ్చట్లు రాజకీయాల గురించే ఉన్నాయంటే అతిశయోక్తికాదండోయ్. తమ కోసం ఇంత కష్టపడుతున్న నేతల కోరికను ప్రజలు మన్నిస్తారో లేదో తెలియాలంటే ఎన్నికలయిపోయేవరకు ఆగాల్సిందే.
Updated Date - Jan 15 , 2024 | 02:50 PM