70 ఏళ్లనాటి చప్టా శిథిలం
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:29 PM
దర్శి-పొదిలిరోడ్డులోని కాటేరువాగుపై నిర్మించిన చప్ట్టాకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు కూలి ప్రమాదభరితంగా మారింది.
దర్శి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): దర్శి-పొదిలిరోడ్డులోని కాటేరువాగుపై నిర్మించిన చప్ట్టాకు ఇరువైపులా రక్షణ దిమ్మెలు కూలి ప్రమాదభరితంగా మారింది. సుమారు 70 ఏళ్ల క్రితం ఈ చప్టాను నిర్మించారు. ప్రస్తుతం చప్టా శ్లాబు కూడా నెర్రలిచ్చి దెబ్బతింది. అసలే కాటేరు వాగు కుంచించుకుపోయింది. దానికితోడు చప్టా వద్ద కూడా పూడిక పెరిగి నీటి పారుదలకు ఇబ్బందిగా మారింది. వాగు ఉధృతంగా ప్రవహించిన సమయాల్లో వరద రోడ్డుపైనా చేరుతుంటుంది. ఆ సమయంలో చప్టా శ్లాబు సరిగా లేకపోవడం, ప్రమాద హెచ్చరికలు తెలిపే రక్షణ గోడలు లేకపోవడంతో వాహనచోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాటేరు వాగుపై పెద్ద బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గత ఐదేళ్లు వైసీపీ పాలకులు రోడ్లు, చప్టాలు, వంతెనల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవటంతో మరింత అధ్వానంగా మారాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం వీటి మరమ్మతులకు నిధుల విడుదల చేసింది. ఇప్పుడైనా ఈ చప్టా మరమ్మతులకు మోక్షం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Nov 06 , 2024 | 11:29 PM