భారీ నష్టం
ABN, Publish Date - Nov 07 , 2024 | 02:30 AM
జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలపై అఽధికారులు లెక్క తేల్చారు. వ్యవసాయశాఖ పరిధిలో మొత్తం ఆరు రకాల పంటలు 5,020.96 హెక్టార్లలో దెబ్బతిన్నాయని, 7,468మంది రైతులు నష్టపోయినట్లు నిర్ధారించారు.
5,020.96 హెక్టార్లు.. 7,468 మంది రైతులు
గత నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటల లెక్క తేల్చిన అధికారులు
రూ.7.12 కోట్ల పరిహారం కోరుతూ ప్రభుత్వానికి కలెక్టర్ అన్సారియా నివేదిక
ఒంగోలు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలపై అఽధికారులు లెక్క తేల్చారు. వ్యవసాయశాఖ పరిధిలో మొత్తం ఆరు రకాల పంటలు 5,020.96 హెక్టార్లలో దెబ్బతిన్నాయని, 7,468మంది రైతులు నష్టపోయినట్లు నిర్ధారించారు. గతనెల 10 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం విదితమే. అత్యధిక ప్రాంతాల్లో భారీగా పడ్డాయి. చాలా మండలాల్లో 15 నుంచి 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలా తెరపిలేకుండా వర్షాలు కురవడంతో పంటలకు అపార నష్టం వాటిల్లుతుందని అందరూ భావించారు. అయితే వర్షాలు కురిసే సమయానికి ఖరీఫ్ పంటలు అధిక శాతం పూత, కాయ దశలో ఉన్నాయి. కోతకు వచ్చిన సజ్జ పంట, అలాగే కాయలు కుళ్లి కొంత మేర పత్తికి నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా వర్షాలు కురిసే సమయానికి మినుము, అలసంద, కంది ఇతరత్రా పంటలు వేసి నెల, నెలన్నర లోపుగా ఉన్నాయి. అలా మొక్క లేదా మొలకదశలో ఉన్న ఆ పంటలకు కూడా కొంత నష్టం వాటిల్లింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూత దశ నుంచి జరిగే నష్టాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అలా గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం కొంత పరిమితంగానే తేలింది.
రూ.7.12 కోట్లు పరిహారం ఇవ్వాలి
గతనెల 27 వరకు రైతు, పంట వారీ నష్టాలను వ్యవ సాయ, రెవెన్యూ క్షేత్ర స్థాయి అధికారులు సర్వే చేసి గుర్తించారు. ఈనెల 2 వరకు రైతు సేవా కేంద్రాలలో ఆ జాబితాలను ఉంచారు. పెద్దగా అభ్యంతరాలు, ఫిర్యాదులు రాలేదు. దీంతో వ్యవసాయ అధికారులు మూడు రోజుల క్రితం పంటల వారీ, రైతువారీ నష్టాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన ్టపరిహారం వివరాలను కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె భారీవర్షాలతో 7,468 మంది రైతులకు చెందిన 5,020.96 హెక్టార్లలోని ఆరు రకాల పంటలకు నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదించారు. సంబంధిత రైతులకు పరిహారంగా రూ.7.12కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కాగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం నిధులు విడుదల చేసినప్పుడు నేరుగా వారివారి ఖాతాల్లో ఆ మొత్తాలు జమ అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
Updated Date - Nov 07 , 2024 | 02:30 AM